లెజెండ్ ANRకి జాతీయ అవార్డ్ రాలేదు ఎందుకు?
110 ఏళ్లు పైబడిన భారతీయ సినిమా ప్రస్థానంలో 96 సంవత్సరాలు పైబడిన చరిత్ర టాలీవుడ్ కి ఉంది.
By: Tupaki Desk | 28 Oct 2024 1:32 PM GMT110 ఏళ్లు పైబడిన భారతీయ సినిమా ప్రస్థానంలో 96 సంవత్సరాలు పైబడిన చరిత్ర టాలీవుడ్ కి ఉంది. ఇందులో లెజెండరీ హీరోలను నిరంతరం స్మరిస్తూనే ఉన్నాం. ఎన్టీఆర్ -ఏఎన్నార్- కృష్ణ- శోభన్ బాబు-కృష్ణంరాజు- చిరంజీవి తదితర దిగ్గజాలు టాలీవుడ్ ని ఏలిన వారిలో ఉన్నారు. దశాబ్ధాల పాటు కెరీర్ ని కొనసాగించి స్టార్లుగా హృదయాలను ఏలారు. కానీ ఇన్నేళ్లలో జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం వీళ్లలో ఎవరికీ దక్కలేదు. కనీసం దిల్లీలో తెలుగు సినిమాకి కనీసం గౌరవం అయినా దక్కలేదు. జాతీయ (భారతీయ) సినిమా అంటే హిందీ సినిమా మాత్రమే.. సౌత్ సినిమా కానే కాదు అన్న అవమానం సృష్టించారు.
నేడు ఏఎన్నార్ జాతీయ అవార్డ్‌ని మెగాస్టార్ చిరంజీవికి అందిస్తున్నారు. అందుకు సంబంధించిన ఘనమైన వేడుక లైవ్ కార్యక్రమం ఇప్పటికే మొదలైంది. ఏఎన్నార్ లివ్స్ ఆన్ అంటూ అభిమానులు సంబరాల్లో మునిగి తేలగా, ఆయన నటించిన చివరి చిత్రం మనం నుంచి క్లాసిక్ స్టిల్ ఒకటి వేదికపై కనిపిస్తోంది. నేడు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతున్న ఈ వేడుకలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన చేతులమీదుగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్నార్ అవార్డును అందజేయనున్నారు. నాగార్జున స్వయంగా ఆ ఇద్దరు లెజెండ్స్ ని ఈ వేడుకకు ఆహ్వానించారని ఇప్పటికే కథనాలొచ్చాయి. అయితే ఈ వేదిక వద్ద ఏఎన్నార్ కి జాతీయ అవార్డ్ దక్కకపోవడంపై అభిమానుల్లో చర్చ సాగుతోంది. భారతీయ సినిమా లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు ఎన్నో గొప్ప క్లాసిక్స్ లో నటించి మెప్పించారు. గొప్ప ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. కానీ ఆయనను నాటి దిల్లీలోని కేంద్ర ప్రభుత్వాలు గుర్తించకపోవడం శోచనీయం అని విమర్శిస్తున్నారు.
నిజానికి నేడు అక్కినేని జాతీయ పురస్కారం అందుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి.. ఒకానొక సందర్భంలో ఏఎన్నార్, ఎన్టీఆర్ వంటి దిగ్గజ నటులకు జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం దక్కకపోవడంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అదంతా దిల్లీ పెద్దల నిర్వాకం.. దక్షిణాదిపై ఉన్న చిన్నచూపు అంటూ నిలదీసారు. ఏఎన్నార్ పురస్కారం అందుకుంటున్న వేళ చిరంజీవి అన్న మాటలను మెగా అక్కినేని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు.
అదంతా అటుంచితే.. మెగాస్టార్ చిరంజీవి తన తల్లిగారైన అంజనా దేవి ఆశీస్సులతో నేడు వేదికపై అవార్డును అందుకునేందుకు రెడీ అవుతున్నారు. నేటి అక్కినేని జాతీయ పురస్కార వేడుకలకు దర్శకులు రాఘవేందర్ రావు, నిర్మాత అశ్వినీదత్, నిర్మాత అల్లు అరవింద్, హీరోలు వెంకటేశ్, రామ్ చరణ్, సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ తదితరులు అటెండయ్యారు.
తన తండ్రి అక్కినేని నాగేశ్వర రావు స్మారకంగా ప్రతియేటా చిత్ర పరిశ్రమకు విశిష్ట సేవలు అందించిన వారికి, హీరో నాగార్జున సారథ్యంలో ఏయన్నార్ స్మారక పురస్కారం ఇస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో సందడిగా సాగుతున్న ఈ వేడుకల నుంచి నిరంతర అప్ డేట్స్ మీకోసం...