'లియో' మూవీ రివ్యూ
By: Tupaki Desk | 19 Oct 2023 10:22 AM GMT'లియో' మూవీ రివ్యూ
నటీనటులు: విజయ్-త్రిష-సంజయ్ దత్-అర్జున్ సర్జా-గౌతమ్ వాసుదేవ్ మీనన్-మిస్కిన్-మన్సూర్ అలీఖాన్-ప్రియా ఆనంద్ తదితరులు
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఛాయాగ్రహణం: మనోజ్ పరమహంస
నిర్మాత: లలిత్ కుమార్
రచన-దర్శకత్వం: లోకేష్ కనకరాజ్
పేరుకు అనువాద చిత్రమే కానీ.. ఒక స్ట్రెయిట్ మూవీలా తెలుగులో బంపర్ క్రేజ్ తెచ్చుకుంది 'లియో'. 'విక్రమ్'తో సెన్సేషన్ క్రియేట్ చేసిన లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించడమే ఆ క్రేజ్‌కు ప్రధాన కారణం. ఇందులో హీరో విజయ్ కావడం.. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చడం కూడా అంచనాలను పెంచాయి. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'లియో' విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
పార్తిబన్ (విజయ్) హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో ఒక కేఫ్ నడుపుకుంటూ తన కుటుంబంతో ప్రశాంతంగా జీవిస్తుంటాడు. అతడికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలుంటారు. ఒక సందర్భంలో తన హోటల్ మీద దాడి చేసిన ఒక క్రిమినల్ గ్యాంగ్ మొత్తాన్ని పార్తిబన్ అంతమొందించడంతో అతడి పేరు మీడియాలో మార్మోగుతుంది. ఆత్మరక్షణ కోసమే పార్తిబన్ ఆ హత్యలు చేసినట్లు కోర్టు నిర్ధరించి అతణ్ని నిర్దోషిగా విడుదల చేసినప్పటికీ.. కొన్ని మాఫియా గ్యాంగ్స్ అతణ్ని టార్గెట్ చేస్తాయి. అందులో అతను హత్యలు చేసిన వాళ్లకు సంబంధించిన వ్యక్తులతో పాటు కొత్త వాళ్లు కూడా ఉంటారు. వాళ్లంతా నువ్వు పార్తిబన్ కాదు లియో అంటూ అతణ్ని.. కుటుంబాన్ని టార్గెట్ చేస్తాయి. పార్తిబన్ తాను లియో కాదని ఎంత చెప్పినా వాళ్లు వినిపించుకోరు. కొన్ని పరిణామాల తర్వాత లియో భార్య.. పోలీసులు కూడా అతడి పట్ల సందేహాలు వ్యక్తం చేస్తారు. ఇంతకీ పార్తిబన్ నేపథ్యమేంటి.. లియోకు అతడికి సంబంధమేంటి.. ఈ గందరగోళానికి పార్తిబన్ ఎలా ముగింపు పలికాడు.. తనను టార్గెట్ చేసిన వాళ్లను ఎలా ఎదుర్కొన్నాడు అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
'ఖైదీ'.. 'విక్రమ్' సినిమాలతో యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ కు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అందులోనూ తాను ఇప్పటిదాకా తీసిన సినిమాలన్నింటికీ 'విక్రమ్' చిత్రంతో కనెక్షన్ పెడుతూ.. 'లోకేష్ సినిమాటిక్ యూనివర్శ్' (ఎల్‌సీయూ) పేరుతో ఒక కొత్త ట్రెండుకు శ్రీకారం చుట్టి ఒక యుఫోరియా క్రియేట్ చేశాడతను. ఆ యుఫోరియా ఏ స్థాయికి వెళ్లిందంటే.. 'లియో' ట్రైలర్ చాలా పేలవంగా అనిపించినా సరే.. దానికి లేని పోని ప్రత్యేకతలు ఆపాదించేశారు ప్రేక్షకులు. ట్రైలర్లో కనిపించిన ఎవరో అనామకుడిని చూపించి ఇదిగో ఇతనే రోలెక్స్ అనడం.. బ్యాగ్రౌండ్లో ఉన్న ఎవరో వ్యక్తిని చూపించి ఇదిగో రామ్ చరణ్ క్యామియో చేశాడని ఊహించుకోవడం... 'ఖైదీ'లో ఉన్న పోలీస్ ఇక్కడా ఉన్నాడంటే లోకేష్ ఏదో భారీగా ప్లాన్ చేశాడని ఊగిపోవడం.. ఇలా మామూలుగా లేదు 'లియో' గురించి ఊహలు. కానీ 'లియో' మొదలుపెట్టిన కాసేపటికే.. ఈ బుడగలన్నీ పేలిపోతాయి. ఆశలు.. అంచనాలు.. ఊహలు.. అన్నింటినీ ఒక్కసారిగా కూల్చేస్తూ ఒక అర్థం పర్థం లేని సినిమా తీసి రెండూ ముప్పావు గంటల పాటు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తాడు లోకేష్ కనకరాజ్. అతడికిది దర్శకుడిగా ఐదో సినిమా కాగా.. మొత్తంగా తాను తీసేది పది చిత్రాలే అని ఢంకా భజాయించి చెబుతున్నాడు. కానీ తర్వాతి ఐదు సినిమాలు ఎలా ఉంటాయో ఏమో కానీ.. లోకేష్ కెరీర్లో అత్యంత పేలవమైన నిలవడానికి అన్ని అర్హతలూ ఉన్న సినిమా 'లియో'నే అనడంలో సందేహం లేదు.
తెలుగులో 'గాయం-2' పేరుతో ఫ్రీమేక్ అయిన హాలీవుడ్ మూవీ 'ఎ హిస్టరీ ఆఫ్ వయొలెన్స్' నుంచి ప్లాట్ పాయింట్ తీసుకుని.. దానికి తన సినిమాల్లో కామన్ పాయింట్ డ్రగ్ రాకెట్ తో లింక్ పెట్టి ఒక కలగాపులగం సినిమా తీశాడు లోకేష్ కనకరాజ్. అసలు ఇందులో కథంటూ చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఎప్పుడో 'బాషా' రోజుల్లో చూసిన పాయింటునే మళ్లీ తిప్పి తిప్పి తీశాడు లోకేష్. పూర్వాశ్రమంలో పెద్ద డాన్ అయిన వ్యక్తి కొన్ని అనూహ్య పరిణామాల మధ్య ఆ గతాన్ని పాతిపెట్టేసి ఒక సామాన్యుడిలా జీవించడం.. అనుకోకుండా ఎవరో తనను గుర్తించి గతాన్ని గుర్తు చేస్తూ అతణ్ని వెంటాడటం.. అతను మీరనుకుంటున్న వ్యక్తి నేను కాదు మొర్రో అని తల బాదుకోవడం.. సినిమా మొదలైన కాసేపటి నుంచి కేవలం ఈ ఒక్క పాయింట్ మీదే కథ నడుస్తుంది. ఒక్కొక్కరు రావడం.. నువ్వు లియోనే కదా అనడం.. వాళ్లతో హీరో గొడవ పెట్టుకోవడం.. తర్వాత ఇంకో గ్యాంగు రావడం.. వాళ్లతోనూ గొడవ.. సినిమా అంతా ఇదే వరస. మధ్యలో లియో గురించి ఒక సిల్లీ ఫ్లాష్ బ్యాక్. ఆ తర్వాత వర్తమానంలోకి వచ్చాక మళ్లీ పైన చెప్పిన గొడవే రిపీట్ అన్నట్లు. మనకు వర్తమానంలో కనిపించే హీరోనే లియోనా అనే విషయంలో చివరి వరకు సస్పెన్స్ మెయింటైన్ చేద్దామని చూశారు కానీ.. విషయం అర్థం చేసుకోకపోవడానికి ప్రేక్షకులేమీ వెర్రోళ్లు కాదు.
'లియో'లో కాన్ఫ్లిక్ట్ ఎంత సిల్లీగా ఉంటుందంటే.. డ్రగ్ మాఫియాను నడిపించే హీరో తండ్రికి మూఢ నమ్మకాలుంటాయి. అందుకోసం సొంత కూతుర్నే నరబలి ఇవ్వడానికి రెడీ అయిపోతాడు. అడ్డొచ్చిన కొడుకును కూడా ఏం చేయడానికి కూడా సిద్ధపడతాడు. అప్పటిదాకా చేయాల్సిన అరాచకాలన్నీ చేసిన హీరో.. ఇదంతా చూసి ఉన్నట్లుండి మారిపోతాడు. అసలు చాలా మోడర్న్ గా.. స్టైలిష్ గా కనిపించే 'ఎల్‌సీయూ'లోకి ఈ నరబలి కాన్సెప్ట్ తీసుకురావడాన్నే అసలు జీర్ణించుకోలేం. ఇలాంటి సిల్లీ పాయింట్ మీద ఇంత భారీ కాస్టింగ్ పెట్టుకుని.. ఇంత పెద్ద సినిమా తీయాలన్న ఆలోచన లోకేష్ కు అసలెలా వచ్చిందో అర్థం కాదు. అసలు విలన్ గా కనిపించే తండ్రి పాత్ర లక్ష్యం ఏంటో కూడా అంతుబట్టదు. నువ్వు లియో అని ఒప్పుకో.. నువ్వు లియో అని ఒప్పుకో అని విలన్.. అతడి గ్యాంగ్ హీరోను సతాయించడమే తప్ప వాళ్ల టార్గెట్ ఏంటో అర్థం కాదు. అలాగే హీరో ఏం చేయాలనుకుంటున్నాడన్నది కూడా అయోమయమే. ఒకే పాయింట్ మీద రిపీటెడ్ సీన్లు వస్తుంటే.. గంటలు గంటలు కథను సాగదీస్తుంటే.. ప్రేక్షకుల అసహనం పతాక స్థాయికి చేరుతుంది. చివర్లో అయినా ఏవైనా మెరుపులు ఉంటాయేమో.. 'ఎల్సీయూ'తో కనెక్ట్ చేసి ప్రేక్షకులను కొంచెం ఎంటర్టైన్ చేస్తాడేమో అనుకుంటే.. ఆ ఆశలు కూడా నీరుగారిపోతాయి. ఏదో మొక్కుబడిగా కమల్ (విక్రమ్ పాత్ర)తో ఒక కాల్ చేయించి.. ఇదే ఎల్సీయూ అనుకోండి అంటూ ప్రేక్షకులను ఫూల్స్ ను చేశాడు లోకేష్. సినిమాలో థ్రిల్లింగ్ గా.. ఎగ్జైటింగ్ గా అనిపించే ఒక్క సీన్ కూడా లేదు. మొత్తంగా 'లియో' అనేది ఒక వ్యర్థ ప్రయత్నంలా అనిపిస్తుందే కనీస స్థాయిలో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోదు.
నటీనటులు:
బేసిగ్గా విజయ్ సాధారణ నటుడు. కథ.. పాత్ర.. బలహీనంగా ఉంటే విజయ్ బలహీనతలన్నీ బయటపడిపోతాయి. ‘లియో’లో అదే జరిగింది. ప్రథమార్ధంలో పార్తిబన్ పాత్రలో అతణ్ని భరించడం చాలా కష్టమవుతుంది. పేలవమైన హేర్ స్టైల్ తో అతడి మేకప్ చెడగొట్టారు. దీనికి తోడు పాత్ర కూడా చిరాకు పెట్టించేలా ఉండటంతో విజయ్ తో ట్రావెల్ చేయడం కష్టమవుతుంది. లియో దాస్ పాత్రలో మాత్రం తన లుక్.. పెర్ఫామెన్స్ బాగున్నాయి. అలా అని ఆ పాత్రలో అయినా విషయం ఉందా అంటే అదీ లేదు. త్రిషకు సినిమా మొత్తం తన కళ్ల ముందు జరిగే దారుణాలను చూసి ఆశ్చర్యపోవడం.. కంగారు పడటం.. ఇదే పనిగా మారింది. ఆ ఒక్క హావభావంతోనే తన పాత్రను లాగించేశారు. సంజయ్ దత్.. అర్జున్ ల లుక్స్ వరకు బాగా సెట్ చేశారు కానీ.. వాళ్ల పాత్రల మీద కనీస స్థాయిలో కూడా శ్రద్ధ పెట్టలేదు లోకేష్. గౌతమ్ వాసుదేవ్ మీనన్ సహా ఇంకా పేరున్న నటీనటులు చాలామంది ఉన్నా ఎవరికీ సరైన పాత్ర పడలేదు.
సాంకేతిక వర్గం: సన్నివేశంలో అంతో ఇంతో విషయం ఉంటేనే.. అనిరుధ్ మ్యాజిక్ చేయగలడు. అది లేనపుడు అతను ఎన్ని విన్యాసాలు చేసినా వ్యర్థమే. అసలు సన్నివేశాలతోనే మనం డిస్కనెక్ట్ అయిపోయినపుడు బ్యాగ్రౌండ్లో ఏం వినిపిస్తోందో.. ఏం పట్టించుకుంటాం. ‘లియో’లో చాలా సీన్లు అలా కొట్టుకుపోతాయి. అయినా సరే.. కొన్ని చోట్ల తన మార్కు బీజీఎంతో ఆకట్టుకోవడానికి అనిరుధ్ ప్రయత్నించాడు. కానీ అతడి పాటలు మాత్రం ఒక్కటీ ఆకట్టుకునేలా లేవు. ‘నే రెడీ’ కొంత మెరుగే కానీ.. తెలుగులో రాసిన పేలవమైన లిరిక్స్ దాన్ని నీరుగార్చేశాయి. మనోజ్ పరమహంస ఒక్కడు విజువల్స్ తో ప్రేక్షకులను కొంత ఎంగేజ్ చేయడానికి ప్రయత్నించాడు. కార్లతో తీసిన యాక్షన్ సీక్వెన్స్.. ఫ్లాష్ బ్యాక్ ముగింపులో పెద్ద డెన్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్లలో మనోజ్ పనితనం గొప్పగా అనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ మంచి స్థాయిలోనే ఉన్నాయి. లోకేష్ కనకరాజ్ రచయితగా.. దర్శకుడిగా ఈసారి తేలిపోయాడు. తాను ఏం రాసినా.. తీసినా చెల్లిపోతుంది అనే అతి విశ్వాసం అతడిలో కనిపించింది. అసలు కథంటూ చెప్పుకోవడానికి ఏమీ లేని ‘లియో’ కోసం ఇంతమందిని ఒప్పించి ఇంత భారీ ఖర్చు పెట్టించి సిినిమా తీయగలగడమే విడ్డూరం.
చివరగా: లియో.. పేరు గొప్ప ఊరు దిబ్బ
రేటింగ్-2/5
Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater