Begin typing your search above and press return to search.

లియో: సర్ప్రైజ్‌లు కాదు.. షాక్‌లు

ఈ చిత్ర ట్రైలర్ అంచనాలకు తగ్గట్లు లేకపోయినా.. సినిమాలో కంటెంట్ అనే సంకేతాలు ఇచ్చినా కూడా జనం అంచనాలను తగ్గించుకోలేదు.

By:  Tupaki Desk   |   20 Oct 2023 3:51 AM GMT
లియో: సర్ప్రైజ్‌లు కాదు.. షాక్‌లు
X

ఈ ఏడాది ఇండియాలో అత్యధిక అంచనాలతో రిలీజైన సినిమా 'లియో'నే అంటే అతిశయోక్తి కాదేమో. భాషతో సంబంధం లేకుండా అన్ని చోట్లా విపరీతమైన హైప్ తెచ్చుకుంది ఈ చిత్రం. ఇక సౌత్ ఇండియాలో అయితే 'లియో' హైప్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ చిత్ర ట్రైలర్ అంచనాలకు తగ్గట్లు లేకపోయినా.. సినిమాలో కంటెంట్ అనే సంకేతాలు ఇచ్చినా కూడా జనం అంచనాలను తగ్గించుకోలేదు. తెలుగులో 'లియో'కు సరైన ప్రమోషన్ కూడా లేదు. అయినా సరే.. దీనికి జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ చూసి ట్రేడ్ పండిట్లు షాకైపోయారు.

తెలుగు చిత్రాలు 'భగవంత్ కేసరి', 'టైగర్ నాగేశ్వరరావు'లను మించి ఈ సినిమా జనం దృష్టిని ఆకర్షించింది. ఎప్పుడెప్పుడు 'లియో' చూద్దామా అన్నట్లు థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు ఈ రోజు ఉదయమే దిమ్మదిరిగి బొమ్మ కనిపించింది. ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను 'లియో' కనీస స్థాయిలో కూడా అందుకోలేకపోయింది.

అందరూ అనుకున్నట్లే 'ఎ హిస్టరీ ఆఫ్ వయొలెన్స్' సినిమా నుంచి పాయింట్ తీసుకుని అటు ఇటు తిప్పి తీసేశాడు లోకేష్ కనకరాజ్. పోనీ అదేమైనా కొత్త కథా అదీ కాదు. 'బాషా' రోజుల నుంచి చూస్తున్న స్టోరీనే.

ఆల్రెడీ 'ఎ హిస్టరీ ఆఫ్ వయొలెన్స్' తెలుగులో 'గాయం-2' పేరుతో ఫ్రీమేక్ అయింది. అట్టర్ ఫ్లాప్ అయింది. ఇప్పుడు 'లియో' దాన్ని మించిన పేలవమైన సినిమాలా తయారైంది. స్టార్ట్ టు ఎండ్ ఒకే పాయింట్ మీద నడుస్తూ.. ప్రేక్షకులను విసిగించింది 'లియో'.

ఇంకేదో ఉంటుంది.. ఇంకేదో ఉంటుంది అని చివరి దాకా ఎదురు చూడటానికే సరిపోయింది. ఇక ఈ సినిమా 'లోకేష్ సినిమాటిక్ యూనివర్శ్' మూమెంట్స్ ఉంటాయని చూసిన వాళ్లకు తీవ్ర నిరాశ తప్పలేదు. 'ఖైదీ' సినిమాలో కనిపించే పోలీస్ క్యారెక్టర్ పెట్టి ఏదో మ్యాజిక్ చేయాలని చూశారు. అది తుస్సుమంది. చివర్లో హీరోకు విక్రమ్ పాత్రధారి అయిన కమల్ హాసన్‌ ఒక కాల్ చేసినట్లు చూపించారు.

ఇవేవీ ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇవ్వలేకపోయాయి. ఇక రామ్ చరణ్ క్యామియో గురించి జరిగిన ప్రచారమంతా ఉత్తిదే అని తేలిపోయింది. మొత్తంగా సర్ప్రైజ్‌లు ఆశిస్తే షాక్‌లు మాత్రమే మిగిలాయని 'లియో' డైరెక్టర్‌ లోకేష్ కనకరాజ్‌ను తిట్టుకుంటున్నారు ప్రేక్షకులు.