Begin typing your search above and press return to search.

లియో.. ఈసారి ప్రభాస్ స్టోరీ అంటున్నారే..

ఇప్పుడు ఇదే కథను కొంచెం మార్చి లియోగా చూపించనున్నారని తెలుస్తోంది. సంజయ్ దత్ ఈ మూవీలో విజయ్ కి తండ్రిగా కనిపిస్తాడని, ఇక, యాక్షన్ హీరో అర్జున్ సోదరుడిగా కనిపిస్తాడనే ప్రచారం జరుగుతోంది.

By:  Tupaki Desk   |   22 Sep 2023 1:37 PM GMT
లియో.. ఈసారి ప్రభాస్ స్టోరీ అంటున్నారే..
X

తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం లియో. ఈ మూవీకి క్రేజీ డైరెక్టర్ లొకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ పై ఫ్యాన్స్ విపరీతమైన అంచనాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా లోకేష్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన విక్రమ్ మూవీ చూసిన తర్వాత లియో పై మరిన్ని ఆశలు పెంచుకున్నారు. ఈ మూవీ దసరా పండగ సమయానికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నెమ్మదిగా ప్రమోషన్స్ హీట్ పెంచుతున్నారు. దీనిలో భాగంగానే మూవీ నుంచి కొన్ని పోస్టర్లు, లుక్స్ విడుదల చేశారు. అయితే, మూవీ పై మరీ ఎక్కువ హోప్స్ పెట్టుకోవడం వలన ఏమో, పెద్దగా ఆకట్టుకోలేదు.

ఆ పోస్టర్లు చూసి ఫ్యాన్స్ కాస్త నిరుత్సాహ పడుతున్నారు. అయితే, పోస్టర్లు ఎలా ఉంటే ఏంటి? సినిమా మాత్రం అందరిపోవడం ఖాయం అని కొందరు ఫ్యాన్స్ చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మూవీ గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వార్త విన్న తర్వాత చాలా మంది ఫ్యాన్స్ లో భయం మొదలైంది. పోస్టర్లు మాత్రమే ఆకట్టుకోవడం లేదు అనుకున్నాం, సినిమా కూడా దెబ్బేసేలా ఉందే అనే ఫీలింగ్ మొదలైంది.

ఇంతకీ ఆ వార్త ఏంటంటే, అప్పుడెప్పుడో ప్రభాస్ హీరోగా మున్నా అనే సినిమా వచ్చింది. అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ మూవీలో హీరో ప్రభాస్ తన తండ్రితోనే పోటీ పడతాడు. ఇప్పుడు ఇదే కథను కొంచెం మార్చి లియోగా చూపించనున్నారని తెలుస్తోంది. సంజయ్ దత్ ఈ మూవీలో విజయ్ కి తండ్రిగా కనిపిస్తాడని, ఇక, యాక్షన్ హీరో అర్జున్ సోదరుడిగా కనిపిస్తాడనే ప్రచారం జరుగుతోంది.

కథ మొత్తం అటూ, ఇటుగా మున్నా సినిమాలానే ఉంటుందని, అయితే, వారి మధ్య వచ్చే యాక్షన్ సీన్లు మాత్రం అదిరిపోతాయని తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాలి. ఒకవేళ అదే కథ అయితే, తమిళ ప్రేక్షకులకు నచ్చే అవకాశం ఉందేమో కానీ, తెలుగులో పెద్దగా ఆకట్టుకోకపోవచ్చు. లేదంటే, కథ ఏది అయినా, మేకింగ్ లో ఒక్కో డైరెక్టర్ ఒక్కో స్టైల్ ఫాలో అవుతూ ఉంటారు.

లోకేష్ తన డైరెక్షన్ స్టైల్ తో మూవీని డిఫరెంట్ గా చూపించే అవకాశం కూడా లేకపోలేదు. ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. ఇక, ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, అభిమానులకు మాత్రం ఒకరోజు ముందే ప్రీమియర్స్ వేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది.