Begin typing your search above and press return to search.

40లో త్రిష ప‌రిణ‌తి ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది

నిత్యం మాఫియా వ‌ల్ల ప్ర‌మాదంలో ప‌డే భ‌ర్త (విజ‌య్) తో తాను కూడా చిక్కుల్లో ప‌డే డ్యాషింగ్ మ‌మ్మీగా కూడా త్రిష క‌నిపిస్తుంది.

By:  Tupaki Desk   |   11 Oct 2023 3:22 PM GMT
40లో త్రిష ప‌రిణ‌తి ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది
X

హీరో సెంట్రిక్ సినిమాలో ఎక్కువ స్కోర్ చేసి ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న క‌థానాయిక‌లు కొంద‌రు మాత్రమే. అలాంటి వారిలో అరుదైన హీరోయిన్‌గా త్రిష కృష్ణన్ పేరు మార్మోగింది. దక్షిణ భారత సినిమాల్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటి త్రిష. `జోడి` చిత్రంలో సైడ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన త్రిష ద‌క్షిణాది చిత్రసీమలో అగ్ర నటిగా ఎదిగింది.

తెలుగులో వ‌ర్షం- అత‌డు- నువ్వొస్తానంటే నేనొద్దంటానా- ఆడ వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే స‌హా ఎన్నో చిత్రాల్లో త్రిష అద్భుత న‌ట‌న‌తో అల‌రించింది. అటు త‌మిళంలోను ఎన్నై అరిందాల్, 96, కోడి, గిల్లి, మన్ క‌థ‌, సామి, విన్నైతాండీ వరువాయా, ఉనకుం ఎనకుం, ఎన్నకు 20 ఉనకు 18, అరణ్మనై 2 వంటి చిత్రాల్లో అద్బుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. అందం అభిన‌యం క‌ల‌బోత‌తో త్రిష రెండు ద‌శాబ్ధాలు పైగా ద‌క్షిణాది చిత్ర‌సీమ‌ను ఏలింది. త‌న వ‌య‌సు 40. కానీ ఇప్ప‌టికీ అదే అందంతో కుర్ర‌కారు హృద‌య‌రాణిగా ఏల్తోంది.

వ‌ర్షం - నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రాల్లో ప్రేమికురాలి పాత్ర‌లో త్రిష న‌ట‌న‌కు తెలుగు ప్రేక్ష‌కులు ఫిదా అయిపోయారు. త్రిష అంద‌చందాలు అభిన‌యానికి ప్ర‌త్యేకించి అభిమానులున్నారు. ఇక త‌మిళంలోను చెప్పుకోద‌గ్గ పాత్ర‌ల్లో ప్ర‌యోగాత్మ‌క న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. కొన్నేళ్ల పాటు చాలా సినిమాలు ఫ్లాపులైన క్ర‌మంలో ఆ సమయంలో 96 చిత్రంతో త్రిష కంబ్యాక్ గురించి తెలిసిందే.

ఈ చిత్రం మొత్తం విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టింది. చాలా మంది నోరు మూయించింది. ఆ ఏడాది ఉత్తమ నటి అవార్డు త్రిషకు దక్కింది. ఈ చిత్రంలో జాను పాత్ర అంటే త్రిష చిరస్థాయిగా గుర్తుండిపోయింది. ప్రేమికుల హృదయాల్లో జానుకి ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది.

గౌతమ్ మీనన్ సూపర్ హిట్ చిత్రం విన్న‌య్ తాండి వ‌రువాయ‌(తెలుగులో ఏమాయ చేశావే) లో జెస్సీగా నటించిన త్రిషకు ఆ పాత్ర‌తో ఎంతో పేరొచ్చింది. త్రిష‌ ఉత్తమ చిత్రాలలో ఒకటిగా ఇది నిలిచిపోయింది. ఈ ఒక్క సినిమాలో హీరోయిన్‌కి సంబంధించిన అన్ని అంశాలను కవర్ చేసింది. జెస్సీ- తమిళ సినిమాల్లో అత్యంత ఇష్టపడే పాత్రగా లైబ్ర‌రీలో సుర‌క్షితంగా నిలిచింది.

ఇప్పుడు పైన చెప్పుకున్న బెస్ట్ పెర్ఫామెన్స్ ఉన్న పాత్ర‌ల‌కు భిన్న‌మైన పాత్ర‌లో త్రిష న‌టించింది. అది కూడా త‌న గిల్లి కోస్టార్ విజ‌య్ స‌ర‌స‌న త్రిషకు అవ‌కాశం. లోకేష్ క‌న‌గ‌రాజ్ తెర‌కెక్కించిన ఈ సినిమా పేరు లియో. ఇందులో త్రిష ఒక చిన్నారికి త‌ల్లిగా, క‌థానాయ‌కుడికి భార్య‌గా క‌నిపించ‌నుంది. నిత్యం మాఫియా వ‌ల్ల ప్ర‌మాదంలో ప‌డే భ‌ర్త (విజ‌య్) తో తాను కూడా చిక్కుల్లో ప‌డే డ్యాషింగ్ మ‌మ్మీగా కూడా త్రిష క‌నిపిస్తుంది.

ఇది చాలా ప‌రిణ‌తితో చేయాల్సిన పాత్ర‌. కానీ ద‌ళ‌ప‌తికి స‌రిజోడు అనిపించేలా ఒదిగిపోయి న‌టించింది. నాలుగు ప‌దుల వ‌య‌సులో పూర్తి ప‌రిణ‌తి త్రిష‌లో కనిపిస్తోంది. ఇంత‌కుముందే విడుదలైన రాసిచ్చాలే మ‌న‌సే.. పాట‌లో త్రిష పెర్ఫామెన్స్ ఎంతో ఆక‌ట్టుకుంటోంది. ఈ ప్లెజెంట్ గీతంలో విజ‌య్ తో క‌లిసి త్రిష పెర్ఫామెన్స్ మైమ‌రిపిస్తోంది. లియో చిత్రానికి త్రిష న‌ట‌న అద‌న‌పు ఆక‌ర్ష‌ణ కానుంద‌ని అర్థ‌మ‌వుతోంది. లియో త్వ‌ర‌లోనే విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.