'ఎల్ ఐసీ' కి ఎల్ ఐసీ నోటిసులు
ప్రదీప్ రంగనాధ్-కృతిశెట్టి జంటగా విగ్నేష్ శివన్ దర్శకత్వంలో `ఎల్ ఐసీ` అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 8 Jan 2024 8:58 AM GMTప్రదీప్ రంగనాధ్-కృతిశెట్టి జంటగా విగ్నేష్ శివన్ దర్శకత్వంలో `ఎల్ ఐసీ` అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో నయనతార కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. భర్త దర్శకత్వం వహిస్తోన్న సినిమా కావడంతో నయనతార తనకు తానుగా ముందుకొచ్చి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పటికే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా న్యాయపరమైన చిక్కుల్లో పడింది.
తమ అనుమతి లేకుండా ఎల్ ఐసీ అనే టైటిల్ ని వాడుకోవడంపై భారతీయ భీమా సంస్థ ఎల్ ఐసీ వివరణ ఇవ్వాలని కోరింది. చిత్ర నిర్మాతలకు..నటీనటులకు..దర్శకులకు నోటీసులు పంపించింది. వారం రోజుల్లో సినిమా టైటిల్ మార్చామని రాకపోతే చట్టపరంగా మరింత ముందుకెళ్తామని నోటీసుల్లో పేర్కొన్నా రు. మరోవైపు ఈ సినిమా యూనిట్ లైఫ్ ఇన్స్ రెన్స్ కార్పోరేషన్ ని ప్రతిబింబించేలా ఎల్ ఐసీ అనే టైటిల్ నిర్ణయించామని చెబుతుంది.
సెవన్ స్క్రీన్ స్టూడియోస్- రౌడీ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగాఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి తాజాగా ఎల్ ఐసీ నుంచి నోటీసులు అందుకున్న ఎల్ ఐసీ టీమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి. టైటిల్ కచ్చితంగా మార్చాల్సిందే. ఎల్ ఐసీ పేరుతో సినిమా రిలీజ్ అయితే ఆ సంస్థకి భంగపాటు ఏర్పడే అవకాశం ఉంది. సినిమా ఎలా ఉన్నా! ఒక ప్రభుత్వ-ప్రయివేట్ సంస్థ పేరుని టైటిల్ గా పెట్టడం అన్నది ఇబ్బందుల్లో పడేసే అంశమే.
ఎలాంటి అనుమతి లేకుండా టైటిల్ పెట్టారు. ఒకవేళ అనుమతితో టైటిల్ పెడితే! ఇది వివాదం అయ్యేదా? అందుకు ఎల్ ఐసీ అంగీకరించేదా? అన్నది తెలియని అంశం. ఏదిఏమైనా వారం రోజుల్లో టైటిల్ మార్చాలని హెచ్చరించిన నేపథ్యంలో దర్శకుడు విగ్నేష్ శివన్ ఎలాంటి నిర్ణయం తీసుకుం టారు? అన్నది చూడాలి.