Begin typing your search above and press return to search.

వీడియో: ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడించిన భార‌తీయ‌ చిన్నారి

నేటి వెబ్ సిరీస్‌లు, వెకిలి రియాలిటీ షోల‌ను మించిన గొప్ప ప్ర‌తిభా వేదిక‌గా దీనిని గుర్తించింది ప్ర‌పంచం.

By:  Tupaki Desk   |   30 Jun 2024 9:28 AM GMT
వీడియో: ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడించిన భార‌తీయ‌ చిన్నారి
X

అమెరికాస్ గాట్ టాలెంట్..యూట్యూబ్.. సోష‌ల్ మీడియాల్లో ఈ రియాలిటీ షోకి ఉన్న ఆద‌ర‌ణ అంతా ఇంతా కాదు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ట్యాలెంట్ ని ఒక చోట చేర్చి అద్భుతాలను ఆవిష్క‌రిస్తోంది ఈ షో. నేటి వెబ్ సిరీస్‌లు, వెకిలి రియాలిటీ షోల‌ను మించిన గొప్ప ప్ర‌తిభా వేదిక‌గా దీనిని గుర్తించింది ప్ర‌పంచం.

ఈ ట్యాలెంట్ షోకి భార‌త‌దేశం నుంచి ఎంద‌రో క‌ళాకారులు హాజ‌ర‌య్యారు. ప్ర‌పంచ వీక్ష‌కుల నుంచి గొప్ప మెప్పును పొందారు. గోల్డెన్ బ‌జ‌ర్ ల‌తో ఘ‌న‌మైన ప్ర‌శంస‌లు అందుకున్నారు. ఇప్పుడు `మాయా నీలకంఠన్` అనే భారతదేశానికి చెందిన 10 ఏళ్ల గిటార్ కళాకారిణి `అమెరికాస్ గాట్ టాలెంట్`లో త‌న ప్ర‌ద‌ర్శ‌న‌తో క‌ట్టి ప‌డేసింది. చిన్నారి మాయా అసాధారణమైన రాక్ సంగీత నైపుణ్యంతో వీక్షకులను మంత్రముగ్దులను చేసింది.

మాయ తన ఆడిషన్ లో భారతీయ సాంప్ర‌దాయ స్వ‌రాల నుండి పాపా రోచ్ `లాస్ట్ రిసార్ట్` రాక్ మ్యూజిక్ ని గిటార్ పై ప్లే చేస్తూ అద్భుత ప్రదర్శనతో న్యాయమూర్తులను ఆశ్చర్యపరిచింది. గిటార్ పై చేతి మునివేళ్ల‌ను క‌దుల్చుతూ ఉర్రూత‌లూగించింది. ఈ ప్రదర్శన ప్ర‌జ‌ల మ‌న‌సుల‌పై చెరగని ముద్ర వేసింది.

మాయాకు త‌న కుటుంబ‌మే అండ‌. మాయ అద్భుతమైన ప్రతిభ, రంగస్థల తేజస్సు న్యాయనిర్ణేతలు సైమన్ కోవెల్, సోఫియా వెర్గారా, హెడీ క్లమ్, హౌవీ మాండెల్‌ల హృద‌యాల‌ను గెలుచుకుంది. చిన్నారి మాయా అద్భుతమైన ప్రదర్శన తర్వాత త‌న‌ను గొప్ప‌గా ప్రశంసించారు. ప్రేక్షకులు త‌న ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉర్రూత‌లూగారు. లేచి డ్యాన్సులు ఆడారు. ల‌వ్‌ సింబ‌ల్స్‌ని చూపిస్తూ చిన్నారిని మెచ్చుకున్నారు.

మాయ సంగీత ప్రయాణం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. సంగీతంలో విభిన్న శైలులను ఒడిసిప‌ట్టి సంక్లిష్టమైన బాణీల‌ మిక్సింగ్ నైపుణ్యంతో అల‌రించిన మాయాకు భారతదేశంలో వర్ధమాన రాక్ స్టార్‌గా పేరు తెచ్చిపెట్టాయి. చిన్నారి మాయా ఆడిషన్ వీడియో సోషల్ మీడియాలో తుఫాన్ వేగంతో దూసుకెళుతోంది. ఇప్ప‌టికే ల‌క్ష‌లాదిగా వీక్షణలను సంపాదించింది. విస్తృత చర్చకు దారితీసింది. వీక్షకులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు.

ఈ వ‌ర్థ‌మాన భారతీయ తార ను ప్రశంసించిన ల‌క్ష‌లాది మందిలో మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఉన్నారు. యువ సంగీత సంచలనంపై ఆయ‌న ఎక్స్ లో తన అభిమానాన్ని వ్యక్తీకరించారు. మాయా నీలకంఠ‌న్‌ని మహీంద్రా ఈవెంట్‌- బ్లూస్‌లోను త‌న ప్ర‌తిభ‌ను ప్ర‌ద‌ర్శించాల‌ని కూడా ఆహ్వానించారు. ``ఓ మై గాడ్. మాయ నీలకంఠన్.. వయసు కేవలం 10 సంవత్సరాలు. అవును, సైమన్ ఆమె ఒక రాక్ గాడెస్. దేవతల దేశం నుండి.. మ‌హీంద్ర బ్లూస్ ప్ర‌ద‌ర్శ‌న కోసం మాయాను తిరిగి ఇక్కడికి తీసుకురావాలి!`` అని ఆనంద్ మహీంద్రా రాశారు.

మాయ రాక్ సంగీతాన్ని ప్లే చేయడానికి ఇలా సాంప్ర‌దాయ‌ భారతీయ దుస్తులను ధరించడం మాకు చాలా గర్వంగా ఉంది. మీ ప్ర‌తిభ‌ అద్వితీయం.. ఇంత చిన్న వయస్సులో మీ ప్రతిభకు హద్దులు లేవు.. అని నెటిజ‌నులు ప్ర‌శంసిస్తున్నారు. మాయా గిటార్‌తో సితార్ ధ్వనులను ఎలా సృష్టించగలిగిందనేది ఆశ్చర్యంగా ఉంది. సాంస్కృతిక దుస్తులను గర్వంగా ధరించడం నాకు చాలా ఇష్టం అని ఒక నెటిజ‌న్ వ్యాఖ్యానించారు.