Begin typing your search above and press return to search.

సూపర్‌ హిట్ సీక్వెల్‌కి ఇంకాస్త సమయం..!

ఆయన దర్శకత్వంలో నటించేందుకు ఎప్పుడు అడిగితే అప్పుడు రెడీ అంటూ పలువురు స్టార్స్ ఓపెన్‌ ఆఫర్‌ ఇస్తున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   15 March 2025 11:09 AM IST
సూపర్‌ హిట్ సీక్వెల్‌కి ఇంకాస్త సమయం..!
X

లోకేష్ కనగరాజ్ పేరు ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తోంది. తమిళ్‌లోనే ఈయన సినిమాలు తీసినా దేశం మొత్తం ఈయన గురించి చర్చ జరుగుతోంది. విభిన్నమైన సినిమాలు తీయడంతో పాటు, ప్రతి సినిమాతో వందల కోట్ల వసూళ్లు రాబడుతూ బాక్సాఫీస్‌ను దున్నేస్తున్న లోకేష్ కనగరాజ్‌తో ఆ భాష, ఈ భాష అని కాకుండా అన్ని భాషల స్టార్స్ సినిమాలు చేయాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన దర్శకత్వంలో నటించేందుకు ఎప్పుడు అడిగితే అప్పుడు రెడీ అంటూ పలువురు స్టార్స్ ఓపెన్‌ ఆఫర్‌ ఇస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో 'కూలీ' సినిమాను తీస్తున్న లోకేష్ కనగరాజ్ తదుపరి సినిమా విషయమై ఆసక్తికర ప్రచారం జరుగుతోంది.

'కూలీ' సినిమాలో రజనీకాంత్‌, నాగార్జునతో పాటు పలువురు స్టార్స్‌ నటిస్తున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం సమ్మర్ వరకు కూలీని ముగించాల్సి ఉంది. కానీ భారీ స్టార్‌ కాస్ట్‌ మూవీ కావడంతో షూటింగ్‌ ఆలస్యం అవుతోంది. కోలీవుడ్‌ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కూలీ సినిమాను ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దసరాకు విడుదల చేయాలని లోకేష్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ అది సాధ్యం కాకుంటే నవంబర్‌లో సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అతి త్వరలోనే సినిమా నుంచి కీలక అప్డేట్‌ రాబోతుంది అంటూ కోలీవుడ్‌ మీడియాలో ఇటీవల ప్రముఖంగా చర్చ జరిగింది.

లోకేష్ ప్రస్తుత సినిమా కూలీ విషయం పక్కన పెడితే ఆయన దర్శకత్వంలో ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్న ఖైదీ 2 ఆలస్యం అవుతూ వస్తోంది. మొదట అనుకున్న ప్రకారం కూలీ కంటే ముందు ఖైదీ 2 సినిమా పట్టాలెక్కాల్సి ఉంది. కానీ రజనీకాంత్‌ నుంచి ఆఫర్‌ రావడంతో లోకేష్ కనగరాజ్‌ ఖైదీ 2 సినిమాను తాత్కాలికంగా వాయిదా వేశారని తెలుస్తోంది. ఖైదీ 2 సినిమా కోసం ఇప్పటికే కథను రెడీ చేసిన లోకేష్‌ కనగరాజ్‌ ఈ ఏడాదిలో సీక్వెల్‌ను పట్టాలెక్కించాలని అనుకున్నాడు. కానీ అది సాధ్యం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. వచ్చే ఏడాదిలోనే సినిమాను ప్రారంభించి వచ్చే ఏడాది ద్వితీయార్థంలో సినిమాను విడుదల చేయాలని లోకేష్ భావిస్తున్నాడని తెలుస్తోంది.

ఖైదీ సినిమాతో లోకేష్ కనగరాజ్ స్థాయి అమాంతం పెరిగింది. సింపుల్‌ కథను తనదైన శైలిలో లోకేష్ కనగరాజ్ చూపించిన తీరుకు పాన్ ఇండియా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అందుకే ఖైదీ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్‌ స్థాయి అమాంతం పెరిగింది. లోకేష్ కనగరాజ్ సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే అభిప్రాయం పడిపోయింది. అందుకే ఖైదీ 2 సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కార్తీ హీరోగా నటించిన ఆ సినిమా తెలుగులోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. కార్తీ పలు సందర్భాల్లో మాట్లాడుతూ ఖైదీ 2 కోసం తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఖైదీ 2 మాత్రమే కాకుండా రోలెక్స్‌, విక్రమ్‌ 2 సినిమాలు సైతం లోకేష్ చేయాల్సి ఉంది.