స్టార్ హీరోలతో మల్టీస్టారర్ చాలా ఈజీ.. ఎందుకంటే!
తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ గురించి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ మారుమ్రోగుతోంది.
By: Tupaki Desk | 6 Nov 2024 10:30 AM GMTతమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ గురించి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ మారుమ్రోగుతోంది. ఖైదీ, విక్రమ్, లియో ఇలా దేనికి అదే అన్నట్లుగా విభిన్నమైన సూపర్ హిట్స్ ను సొంతం చేసుకున్న లోకేష్ కనరాజ్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ తో 'కూలీ' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. రజనీకాంత్ ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరిలోనూ కూలీ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇప్పటి వరకు లోకేష్ నుంచి వచ్చిన సినిమాల మాదిరిగానే చాలా విభిన్నమైన కాన్సెప్ట్‌తో సినిమా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాలో నాగార్జున, ఉపేంద్రతో పాటు పలువురు ప్రముఖ స్టార్స్ కనిపించబోతున్నారు.
శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న కూలీ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చేసింది. వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కూలీ గురించిన విషయాలను దర్శకుడు లోకేష్ కనగరాజ్ తాజా ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నారు. 9 గంటలకు షూటింగ్ అంటే రజనీ సర్ ఉదయం 7 గంటల వరకు సెట్స్ లో ఉండేవారు. కాస్త ఆలస్యం అయినా పర్వాలేదు సర్ అంటూ తన వల్ల ఏ ఒక్కరు ఇబ్బందికి గురి కాకూడదని అనే వారు. కమల్ సర్, విజయ్ సర్ సైతం టైమ్ ను బాగా పాటించే వారు. వారు షూటింగ్ కు ఎప్పుడూ లేట్‌గా వచ్చిందే లేదు. ట్రాఫిక్ జామ్ వల్ల ఆలస్యం అవుతుందేమో అనే ఉద్దేశ్యంతో ముందుగానే స్టార్ట్ అయ్యేవారు. అలాంటి గొప్ప వ్యక్తులతో సినిమాలు చేయడం చాలా బాగుంటుంది అన్నాడు.
స్టార్ హీరోలు దాదాపు అందరూ చాలా క్రమ శిక్షణతో ఉంటారు, అంతే కాకుండా సినిమా కోసం స్క్రిప్ట్ గురించి ఏ సలహా ఇచ్చినా దాన్ని సమర్ధిస్తారు. కనుక స్టార్ హీరోలతో మల్టీస్టారర్ సినిమాలను చేయడం చాలా ఈజీ అని నేను భావిస్తున్నాను. ఒకరిని ఒకరు గౌరవించుకోవడంతో పాటు, ఒకరి నిర్ణయాలను ఒకరు సమర్ధించడం వల్ల స్టార్ హీరోలతో చాలా సునాయాసంగా మల్టీస్టారర్ లు తీయవచ్చు అన్నాడు. సాధారణంగా స్టార్ హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు కష్టం అని దర్శకులు భావిస్తూ ఉంటారు. కానీ లోకేష్ కనగరాజ్ మాత్రం యంగ్ హీరోలతో పోల్చితే స్టార్ హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేయడం ఈజీ అంటూ వింత లాజిక్ చెప్పి అందరినీ సర్ప్రైజ్ చేశాడు.
రజనీకాంత్, శృతి హాసన్, నాగార్జున, ఉపేంద్రతో పాటు ఇంకా పలువురు ప్రముఖ నటీనటులు నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు ఆమీర్ ఖాన్ గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడనే వార్తలు వచ్చాయి. తాజాగా ఆ విషయమై ఇంటర్వ్యూలో ప్రశ్నించిన సందర్భంగా లోకేష్ స్పందిస్తూ... తనకు ఆమీర్ ఖాన్ అంటూ చాలా ఇష్టం. కచ్చితంగా ఆయనతో భవిష్యత్తులో వర్క్ చేస్తానంటూ ప్రకటించాడు. దాంతో సినిమాలో ఆమీర్ ఖాన్ ఉన్నట్లే అనే చర్చ మరింతగా జరుగుతోంది. కూలీ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ ఖైదీ 2 సినిమాను చేయబోతున్నాడు. ఇటీవల ప్రభాస్ తో ఒక సినిమా విషయమై చర్చలు జరిపాడని తెలుస్తోంది. లోకేష్ చాలా స్పీడ్‌గా సినిమాలు చేస్తాడు. ఏడాదికి రెండు సినిమాలు వచ్చే విధంగా ఆయన ప్లాన్ చేస్తున్నాడు.