లోకేష్ కనగరాజ్ క్లారిటీ మిస్సయ్యాడా?
భారతదేశంలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ జాబితాలో తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది.
By: Tupaki Desk | 14 Oct 2024 4:13 AM GMTభారతదేశంలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ జాబితాలో తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అతడి అసాధారణమైన ట్రాక్ రికార్డ్, బ్లాక్ బస్టర్ల జాబితా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అపజయమెరుగని దర్శకుడిగా అతడు సంచలనాలు సృష్టిస్తున్నాడు. కోలీవుడ్ అగ్రదర్శకులందరికీ వారి కెరీర్ జాబితాలో ఫ్లాపులున్నాయి కానీ లోకేష్ కి అలాంటిదేదీ లేదు. దీంతో అతడు తెరకెక్కించే ప్రతి సినిమాపైనా ప్రజల్లో ఆసక్తి నెలకొంది. వరస పెట్టి తన బ్లాక్ బస్టర్లకు సీక్వెల్ సినిమాలు తీసేందుకు లోకేష్ కనగరాజ్ ప్రణాళికలు వేస్తున్నాడు.
అయితే అతడి ప్లానింగ్ ఎలా ఉండబోతోంది? సినిమాలు ఆర్డర్ ఏదైనా ఉందా? అంటే క్లారిటీ మిస్సయింది. ఏ సీక్వెల్ ని ముందుగా సెట్స్ కి వెళుతుంది? ఏది ఆలస్యమవుతుంది? అన్నదానిపై సరైన స్పష్ఠత లేదు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీ కాంత్ తో కూలీ కోసం పని చేస్తున్నాడు. ఈ సినిమా లెకేష్ కనగరాజ్ యూనివర్శ్ (ఎల్.సి.యు)లో భాగం కాదని తేల్చేశాడు. అలాగే ఎల్.సి.యులో వచ్చి బ్లాక్ బస్టర్లుగా నిలిచిన ఖైదీ - విక్రమ్- లియో చిత్రాలకు సీక్వెల్స్ తీస్తానని కూడా ప్రకటించాడు. అంటే ఖైదీ 2, విక్రమ్ 2, లియో 2 చిత్రాల స్క్రిప్టులు ప్రస్తుతం రెడీ అవుతున్నాయి. అయితే వీటిలో ఏది ముందు? ఏది వెనక? అనేదానికి లోకేష్ కి స్పష్ఠత ఉందా? అంటే.. దానికి కాలమే సమాధానం చెప్పాలి.
ఈలోగానే సూర్యతో రోలెక్స్ స్టాండ్ ఎలోన్ మూవీ తీసే ఆలోచన ఉందని కూడా లోకేష్ కనగరాజ్ ప్రకటించాడు. విక్రమ్ సినిమా క్లైమాక్స్ లో ప్రవేశించిన రోలెక్స్ పాత్ర ప్రేక్షకుల మైండ్ పై గొప్ప ముద్ర వేయడంతో ఆ పాత్రనే ప్రధాన ఆయుధంగా ఉపయోగిస్తూ అతడు పూర్తి సినిమా తీయాలని భావిస్తున్నాడు. దీంతో పాటు LCUలోని హీరోలందరితో పీక్ ఎల్‌సీయూ మూవీ తీస్తానని కూడా లోకేష్ తాజా ప్రకటనలో వెల్లడించి ఆశ్చర్యపరిచాడు. కమల్ హాసన్, సూర్య, కార్తీ- సేతుపతి- ఫహద్ ఫాజిల్ - విజయ్‌లతో ఈ సినిమా ఉంటుందని అంతా భావిస్తున్నారు. అయితే కమల్ హాసన్ తో విక్రమ్ 2 ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది? అన్నదానిపైనా క్లారిటీ రావాల్సి ఉంది. దీనికి తోడు టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ తో లోకేష్ మూవీ చేసేందుకు ఆస్కారం ఉందని కథనాలొచ్చాయి. అయితే దీనికి ఇంకా చాలా కాలం పడుతుందని భావిస్తున్నారు. దళపతి విజయ్ తో లియో 2 కూడా ఇప్పట్లో సాధ్యం కాదు. ఎందుకంటే విజయ్ ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో ప్రవేశిస్తున్నారు. సుదీర్ఘ కాలం నాయకుడిగా అతడు పోరాటం సాగిస్తారని భావిస్తున్నారు.
`విక్రమ్`కి అద్భుతమైన ముగింపు ఇచ్చేందుకు `రోలెక్స్` సీన్స్ క్రియేట్ చేశాను. ఆ పాత్రకు వచ్చిన క్రేజ్ దృష్టిలో ఉంచుకుని `రోలెక్స్`పై ఒక స్టాండలోన్ మూవీ చేయాలని ప్లాన్ చేస్తున్నానని ఇదివరకూ ఓ ప్రకటనలో లోకేష్ అన్నాడు గనుక సూర్యతో భారీ చిత్రం త్వరగా సెట్స్ పైకి వెళ్లేందుకు ఆస్కారం ఉందని భావిస్తున్నారు. `కూలీ` పూర్తి చేసిన తర్వాత LCUలోని హీరోలందరితో పీక్ ఎల్‌సీయూ మూవీ పూర్తి చేశాక, రోలెక్స్ మూవీ ఉంటుందని కూడా భావిస్తున్నారు.