2024 సమీక్ష: భారీ యాక్షన్ పప్పులుడకలేదు కానీ!
2024 ముగుస్తోంది. కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభతరుణంలో వినోదరంగంపై సమీక్షలు వెల్లువెత్తుతున్నాయి.
By: Tupaki Desk | 17 Dec 2024 11:30 PM GMT2024 ముగుస్తోంది. కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభతరుణంలో వినోదరంగంపై సమీక్షలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి ఈ ఏడాది బాలీవుడ్ కి కలిసొచ్చిందా లేదా? అన్నది విశ్లేషిస్తే.... ఈ సంవత్సరం మొత్తంలో మూడు సినిమాలు భారీ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. అజయ్ దేవగన్ , మాధవన్ నటించిన- షైతాన్, కార్తీక్ ఆర్యన్ భూల్ భులయా 3, శ్రద్ధాకపూర్-రాజ్ కుమార్ రావుల స్త్రీ 2 హిందీ చిత్రసీమకు పెద్ద ఊరటనిస్తూ విజయాలను అందించాయి.
నిజానికి ఖాన్ ల త్రయం కానీ, రణబీర్ కపూర్ వంటి సూపర్ స్టార్లు నటించిన సినిమాలేవీ ఈ ఏడాది విడుదల కాలేదు. భారీ యాక్షన్ చిత్రాల పప్పులుడకలేదు. సింగం ఎగైన్, యోధ, బడే మియాన్ చోటే మియాన్, ఫైటర్ లాంటి సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. జిగ్రా, ఐ వాంట్ టు టాక్ జనాల్ని థియేటర్లకు రప్పించలేకపోయాయి. సింగం ఎగైన్ భారీ ఓపెనింగులు తెచ్చినా కానీ, భారీ బడ్జెట్ దృష్ట్యా లాంగ్ రన్ లో ఆశించిన మార్క్ కి చేరుకోలేకపోయింది. బడే మియాన్ చోటే మియాన్ తో అక్షయ్, టైగర్ లాంటి స్టార్లు మరో పెద్ద పరాజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఫైటర్ చిత్రం హృతిక్ రోషన్ - సిద్ధార్థ్ ఆనంద్ లను తీవ్రంగా నిరాశపరిచింది.
పుష్ప 2 ఏడాది చివరిలో అద్భుత విజయం అందుకుంది. ఉత్తరాది బెల్ట్ ప్రమోషన్స్ లో `థాంక్యూ ఇండియా` అంటూ బన్ని సెంటిమెంటును రాజేసాడు. `పుష్ప 2` ని ఇండియన్ మూవీగా ప్రచారం చేసాడు. ఇది సత్ఫలితాన్ని ఇచ్చింది. ముఖ్యంగా పుష్ప 2 దక్షిణాది కంటే ఉత్తరాదిన బంపర్ హిట్ కొట్టింది. పుష్ప , పుష్ప 2 చిత్రాలతో ఉత్తరాది బెల్ట్ లో సత్తా చాటిన అల్లు అర్జున్ తదుపరి పుష్ప 3 లోను నటించనున్నాడు. సుకుమార్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ కాన్వాసుపై రూపొందించనున్నారు.
సింగం ఎగైన్ , స్త్రీ 2, భూల్ భులయా 3 ఓటీటీలోను మంచి ఆదరణ దక్కించుకున్నాయి. విక్కీ విద్యా కా వో వాలా వీడియో, సికందర్ కా ముకద్దర్, ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్, విజయ్ 69 వంటివి ఆదరణ దక్కించుకున్నాయి. అలాగే రీరిలీజ్ లు కూడా బాగానే ఆడాయి. కల్ హో నహో, వీర్ జారా వంటి క్లాసిక్స్ ని ప్రజలు తిరిగి ఆస్వాధించారు. 2025లో బాలీవుడ్ నుంచి భారీ క్రేజీ చిత్రాలు విడుదల కానున్నాయి. వీటన్నిటిపైనా భారీ అంచనాలున్నాయి.