టాలీవుడ్: బెస్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ ఏది?
గడిచిన ఏడాది కాలంలో సంగీత ప్రియులను అలరించిన తెలుగు సినిమా పాటలు చాలానే ఉన్నాయి.
By: Tupaki Desk | 26 Dec 2024 3:55 AM GMT2024 సంవత్సరం చివరకు వచ్చేశాం. మరో ఐదు రోజుల్లో మనం కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం. గడిచిన ఏడాది కాలంలో సంగీత ప్రియులను అలరించిన తెలుగు సినిమా పాటలు చాలానే ఉన్నాయి. కొన్ని సాంగ్స్ సినిమా రిలీజ్ అవ్వకముందే ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటే, మరికొన్ని పాటలు మాత్రం సినిమా విడుదలైన తర్వాత జనాల్లోకి బాగా వెళ్లాయి. సోషల్ మీడియాలో రీల్స్ రూపంలో వైరల్ అయిన డ్యూయెట్స్ కొన్నుంటే, నెట్టింట దుమ్ము రేపిన డ్యాన్స్ నంబర్స్ ఇంకొన్ని ఉన్నాయి. ఓవరాల్ గా బెస్ట్ సాంగ్స్ ఆఫ్ ది ఇయర్ ఏవో ఇప్పుడు చూద్దాం.
''గుంటూరు కారం'' సినిమాలోని చార్ట్ బస్టర్ సాంగ్స్ తో ఈ ఏడాది మ్యూజికల్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. థమన్ స్వరపరిచిన 'దమ్ మసాలా బిర్యానీ', 'కుర్చీ మడతపెట్టి', 'మావా ఎంతైనా' పాటలు శ్రోతలను విపరీతంగా అలరించాయి. థియేటర్లతో పాటుగా సోషల్ మీడియాని షేక్ చేశాయి. పార్టీలలో, పెళ్లిళ్లలో, కాలేజ్ ఈవెంట్స్, ఊరేగింపులలో ఎక్కడ చూసినా ఈ పాటలే వినిపించాయి. ఇందులో మహేష్ బాబు గతంలో ఎన్నడూ లేని విధంగా స్టెప్పులు ఇరగదీయడం ఫ్యాన్స్ కు కనుల పండుగలా అనిపించింది. సినిమా ఓటీటీలో విడుదలైన తర్వాత పాటలు సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ అన్ని మ్యూజిక్ ఫ్లాట్ ఫార్మ్స్ ని బ్లాస్ట్ చేసింది.
''దేవర'' పార్ట్-1 సినిమా కోసం అనిరుధ్ కంపోజ్ చేసిన పాటలు ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. 'ఫియర్ సాంగ్', 'చుట్టమల్లే', 'ఆయుధ పూజ', 'దావుడి'.. ఇలా నాలుగు పాటలూ వేటికవే ప్రత్యేకంగా నిలిచాయి. వాటిల్లో రెండు సాంగ్స్ లో ఎన్టీఆర్ డ్యాన్సులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. 'చుట్టమల్లే' సాంగ్ మెలోడీ ఆఫ్ ది ఇయర్ అనిపించుకుంది. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన ''పుష్ప 2: ది రూల్'' సినిమా నుంచి పాటలు కాస్త ఆలస్యంగా వచ్చినా, జనాల్లోకి తొందరగానే వెళ్లాయి. ముందుగా 'పుష్ప పుష్ప' సాంగ్ బాగా వైరల్ అయింది. ఆ తర్వాత వచ్చిన 'సూసేకి' లిరికల్ వీడియో కొన్నాళ్ళు ట్రెండింగ్ లో ఉంది. 'కిస్సిక్', 'పీలింగ్స్' సినిమాలు విడుదలైన తర్వాత పెద్ద హిట్టయ్యాయి.
అలానే 'హను-మాన్' మూవీలోని 'పూలమ్మే పిల్ల' పాట బాగా పాపులర్ అయింది. 'ఓం భీమ్ బుష్' సినిమాలోని 'అణువణువూ'.. 'అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్' నుంచి వచ్చిన 'గుమ్మా' పాటలు మ్యూజికల్ ట్రీట్ ఇచ్చాయి. 'టిల్లు స్క్వేర్' మ్యూజిక్ ఆల్బమ్ మొత్తం సూపర్ హిట్ అయింది. 'టికెట్టే కొనకుండా', 'రాధిక', 'డీజే టిల్లు రీవ్యాప్' పాటలు యూత్ కి బాగా ఎక్కాయి. ఎక్కడ డీజే ప్లే చేసినా డీజే టిల్లు పాటలు ఉండాల్సిందే అనే రేంజ్ లో ట్రెండ్ అయ్యాయి. 'మిస్టర్ బచ్చన్' మూవీ డిజాస్టర్ గా మారినప్పటికీ, పాటలు మాత్రం మంచి హిట్టయ్యాయి. వాటిల్లో 'నల్లంచు తెల్లచీర' సాంగ్ ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ అయింది.
యువన్ శంకర్ రాజా చాలా కాలం తర్వాత తెలుగులో వర్క్ చేసిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమాలోని 'సుట్టంలా సూసి' సాంగ్ జనాలకి ఒక రేంజ్ లో నచ్చేసింది. 'ఊరు పేరు భైరవకోన' మూవీలోని 'నిజమేనే చెబుతున్నా' గీతం బాగా ఫేమస్ అయింది. 'డబుల్ ఇస్మార్ట్' సినిమాలోని 'స్టెప్పా మార్' సాంగ్ ఆడియన్స్ అందరితో స్టెప్పులేయించింది. 'జనక అయితే గనుక' చిత్రంలో 'నా ఫేవరేట్ నా పెళ్ళాం' పాట కూడా వైరల్ అయింది. వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే సినిమాల్లోని కొన్ని పాటలు కూడా ఈ ఏడాది జనాల్లోకి దూసుకెళ్లాయి. 'తండేల్' నుంచి వచ్చిన మెలోడియస్ 'బుజ్జితల్లి' పాటకు సంగీత ప్రియులు ఫిదా అయ్యారు. ఇప్పుడు ఇంస్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్ స్టేటస్ లలో ఎక్కడ చూసినా ఈ పాటే కనిపిస్తోంది.
ఇలా పైన చెప్పుకున్న పాటలు జియో సావన్, స్పూటిఫై, గానా, అమెజాన్ మ్యూజిక్, రేడియో ఛానల్స్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ లో వైరల్ అయ్యాయి. ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. మరి వీటిల్లో మీకు ఏ పాట బాగా నచ్చింది.. 'సాంగ్ ఆఫ్ ది ఇయర్' ఏది?, బెస్ట్ డ్యాన్స్ నంబర్ ఆఫ్ ది ఇయర్, మెలోడీ ఆఫ్ ది ఇయర్, డ్యూయెట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ ఏదనేది కామెంట్ చేయండి.