రివైండ్ 2024: వివాదాల్లో చిక్కుకున్న హీరో హీరోయిన్లు వీరే!
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఈ ఏడాదిలో పలువురు హీరో హీరోయిన్లు ఊహించని వివాదాల్లో చిక్కుకున్నారు.
By: Tupaki Desk | 12 Dec 2024 2:30 AM GMT2024 సంవత్సరం కొంతమంది సెలబ్రిటీలకు మరుపురాని తీపి జ్ఞాపకంగా ఉంటే, మరికొంతమందికి మాత్రం చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఈ ఏడాదిలో పలువురు హీరో హీరోయిన్లు ఊహించని వివాదాల్లో చిక్కుకున్నారు. వారిలో కొందరు పోలీస్ స్టేషన్ వరకూ వెళ్తే, మరికొందరు జైలు జీవితాన్ని కూడా గడిపారు. ఇంకొందరు కోర్టు మెట్లు ఎక్కారు. తమకు సంబంధం లేకుండా వివాదాల్లో చిచ్చుకున్న సెలబ్రిటీలు, సోషల్ మీడియాలో విపరీతమైన నెగెటివిటీ ఎదుర్కొన్న వారు కూడా ఉన్నారు.
'మంచు' ఫ్యామిలీలో ముసలం...
టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా 'మంచు' ఫ్యామిలీ ఫైట్ హాట్ టాపిక్ గా నడుస్తోంది. మంచు మోహన్ బాబు కుటుంబలో గొడవలు రోడ్డుకెక్కాయి. కొడుకు మనోజ్ మీద మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేస్తే, తన తండ్రి వ్యక్తిగత సిబ్బంది మీద కొడుకు కేసు పెట్టారు. మనోజ్ ను ఉద్దేశిస్తూ మోహన్ బాబు ఓ బహిరంగ సందేశాన్ని విడుదల చేసారు. తాను ఆస్తి కోసం పోరాటం చేయడం లేదని, ఆత్మ గౌరవం కోసం ఫైట్ చేస్తున్నానని మనోజ్ అంటున్నారు. మీడియాలో సోషల్ మీడియాలో దీని మీదనే ఎక్కువగా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలో కాస్త సహనం కోల్పోయిన మోహన్ బాబు ఒక మీడియా ప్రతినిధి మీద దాడి చేయడం వివాదాస్పందం అయింది. ఈ విషయంలో ఇప్పటికే ఆయనపై కేసు కూడా నమోదు చేసారు. ఇక్కడ తప్పొప్పులు ఎవరివనేవి పక్కన పెడితే.. ఇన్నాళ్లు క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే ఫ్యామిలీలో విభేదాలు తలెత్తడం చర్చనీయాంశంగా మారింది. దీన్ని మంచు బ్రదర్స్ ఎలా పరిష్కరించుకుంటారో చూడాలి.
ధనుష్ - నయన్ వివాదం...
'నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీ విషయంలో ధనుష్ - నయనతారల మధ్య నెలకొన్న వివాదం ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపింది. తాను నటించిన 'నానుమ్ రౌడీ దాన్' సినిమా విజువల్స్ వాడుకోడానికి నిర్మాత ధనుష్ ఎన్ఓసీ ఇవ్వలేదంటూ నయన్ ఓపెన్ లెటర్ ద్వారా తీవ్ర విమర్శలు చేయడం హాట్ టాపిక్ అయింది. 3 సెకండ్ల బీటీఎస్ ఫుటేజీ వాడినందుకు 10 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేస్తూ ధనుష్ లీగల్ నోటీసులు పంపారని తెలిపింది. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ధనుష్.. డాక్యుమెంటరీలో అనుమతి లేకుండా తన సినిమాలోని విజువల్స్ ఉపయోగించారంటూ నయనతార, ఆమె భర్త విఘ్నేష్ శివన్ పై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కింగ్ నాగార్జున పరువు నష్టం దావా...
అక్కినేని ఫ్యామిలీ ఈ ఏడాది కోర్టు మెట్లు ఎక్కింది. నాగచైతన్య, సమంత విడాకులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణమంటూ తెలంగాణ మంత్రి కొండా సురేఖ తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేయకుండా ఉండేందుకు సమంతను కేటీఆర్ దగ్గరికి పంపించేందుకు హీరో నాగార్జున, నాగచైతన్య బలవంతపెట్టారని.. దీనికి సమంత నిరాకరించడం విడాకులకు దారితీసిందని సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసింది. అక్కినేని ఫ్యామిలీని ప్రస్తావిస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయటంతో మంత్రిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ విషయంలో ఇండస్ట్రీ అంతా అక్కినేని ఫ్యామిలీకి, సమంతకు సపోర్ట్ గా నిలిచింది. ఇక మినిస్టర్ వ్యాఖ్యలపై సీరియస్ అయిన నాగార్జున.. ఆమెపై నాంపల్లి కోర్టులో రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు.
రాజ్ తరుణ్ - లావణ్య వివాదం...
టాలీవుడ్ ను ఓ కుదుపు కుదిపిన వివాదాలలో రాజ్ తరుణ్, లావణ్య వివాదం కూడా ఒకటి. టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ తనతో పదకొండేళ్లు సహజీవనం చేసి, నమ్మించి వదిలేసి వెళ్లిపోయాడని లావణ్య అనే అమ్మాయి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకున్నాడని, గర్భవతిని చేసి అబార్షన్ చేయించుకునేలా ఒత్తిడి తీసుకొచ్చాడని, హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో డేటింగ్ చేస్తూ ఇప్పుడు తనని వదిలించుకోవాలని చూస్తున్నాడంటూ సంచలన ఆరోపణలు చేసింది. దీనిపై ఇరు వర్గాలూ కోర్టు మెట్లు కూడా ఎక్కాయి. అప్పట్లో అందరికీ ఇదే హాట్ టాపిక్ అయింది. కాంప్రమైజ్ చేసుకున్నారో, కేసు కోర్టు పరిధిలో ఉందని అనుకున్నారో ఏమో తెలియదు కానీ.. అందరూ సైలెంట్ అయిపోయారు. రాజ్ తరుణ్ ఎప్పటిలాగే సినిమాలతో బిజీ అయిపోగా, లావణ్య మళ్ళీ మీడియా ముందుకు రాలేదు.
రేప్ కేసులో జైలుకి జానీ...
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల ఆరోపణలతో కొన్ని రోజులు జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే. జానీ తనను లైగికంగా వేధించాడంటూ ఆయన దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన ఓ యువతి కేసు పెట్టింది. అత్యాచారం చేసినప్పుడు తను మైనర్ నని ఆమె పేర్కొనడం పెద్ద వివాదానికి దారితీసింది. ఈ నేపథ్యంలో జానీపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసి జైళ్లో పెట్టారు. దీంతో ఆయనకు ప్రకటించిన నేషనల్ ఫిలిం అవార్డ్ రద్దు చేయబడింది. 36 రోజులు పాటు చంచల్ గూడ జైలులో ఉన్న జానీ.. కొన్ని రోజుల క్రితం బెయిల్ పై బయటకొచ్చాడు. అయితే ప్రస్తుతం డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న జానీ పదవీకాలం పూర్తి కాకుండానే, ఎన్నికలు నిర్వహించి కొత్త ప్రెసిడెంట్ ను ఎన్నుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై లీగల్ గా ఫైట్ చేస్తానని జానీ ఈ మధ్యనే ఓ వీడియో రిలీజ్ చేసాడు.
దర్శన్ మర్డర్ కేసు...
కన్నడ హీరో దర్శన్ మర్డర్ కేసులో జైలుకి వెళ్లొచ్చారు. నటి పవిత్రా గౌడతో కలిసి రేణుకాస్వామి అనే అభిమానిని హత్య చేశారనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసారు. పవిత్రకు అసభ్యకరమైన మెస్సేజ్‌లు పంపి వేధించేడనే కారణంతోనే అతన్ని హింసించి చంపినట్లుగా పోలీసులు సాక్ష్యాలు, ఆధారాలు సేకరించారు. దీనిపై తొలుత 3 వేల పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు.. దానికి అనుబంధంగా మరో 13 వందల పేజీల ఛార్జ్ షీట్ వేశారు. అయితే దర్శన్ వెన్నెముకకు సర్జరీ చేసుకోవాలని పిటిషన్ వేయడంతో, కర్ణాటక హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. పవిత్ర బెయిల్ పిటిషన్ ను మాత్రం తిరస్కరించింది.
నటి కస్తూరి అరెస్ట్..
నటి కస్తూరి అనుకోని వివాదంలో చిక్కుకుంది. ఇటీవల తమిళనాడులోని బ్రాహ్మణ సంఘాల సమ్మేళనానికి హాజరైన సందర్భంగా ద్రవిడ వాదులను విమర్శిస్తూ తెలుగు వారి ప్రస్తావన తీసుకురావడమే ఆమెను వివాదంలోకి నెట్టింది. 300 ఏళ్ల కిందట ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగువాళ్లు.. ఇప్పుడు తమది కూడా తమిళ జాతేనని చెప్పుకుంటుంటే.. శతాబ్దాలకు పూర్వమే ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడానికి మీరెవరు? అంటూ కస్తూరి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ కామెంట్స్ పై పలు చోట్ల కేసులు నమోదు చేసారు. నవంబర్ లో హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో చెన్నై పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.
హేమ డ్రగ్స్ వివాదం...
నటి హేమ డ్రగ్స్ వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఆ మధ్య బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు హేమపై ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. తాను ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని హేమ చెప్పగా.. పోలీసులు మాత్రం హైదరాబాద్ వచ్చి మరీ ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఆ సమయంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆమెపై తాత్కాలికంగా నిషేధం విధించింది. ఆ తర్వాత కొన్ని రోజులకు బ్యాన్ ఎత్తేసింది. ఇటీవల కాలంలో మళ్ళీ హేమ వివాదం గురించి ఎవరూ మాట్లాడుకోలేదు.
LIC టైటిల్ వివాదం...
నయనతార భర్త, డైరెక్టర్ విగ్నేష్ శివన్ 'LIC' టైటిల్ తో 'లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్' అని అర్థం వచ్చేలా సినిమా అనౌన్స్ చేయడం వివాదానికి దారి తీసింది. LIC కంపెనీ (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) చిత్ర బృందంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు డైరెక్టర్ విగ్నేష్ శివన్ కి నోటీసులు జారీ చేసింది. దీంతో LIK - 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' గా టైటిల్ ను మార్చారు. ఈ సినిమాలో లవ్ టుడే' ఫేమ్ ప్రదీప్ రంగనాథన్, 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
నయన్ సినిమాపై బ్యాన్...
నయనతార ప్రధాన పాత్రలో నటించిన 'అన్నపూరణి' సినిమా విషయంలో వివాదం చెలరేగింది. ఇది లవ్ జిహాద్ ని ప్రోత్సహించేలా ఉందని, ఒక సాంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయిని ముస్లిం పద్దతిలో మార్చేలా దారుణంగా చిత్రీకరించారని అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీనిపై పలు రాష్ట్రాల్లో కేసులు కూడా నమోదవ్వడంతో నెట్ ఫ్లిక్స్ ఓటీటీ నుంచి ఈ సినిమాని తొలగించారు. మత విశ్వాసాలను దెబ్బ తీయాలనేది తమ ఉదేశ్యం కాదని, తమ సినిమా ఎవరి మనోభావాలనైనా కించపరిస్తే క్షమించమని మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
త్రిషపై షాకింగ్ కామెంట్స్...
ఈ ఏడాది ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య తలెత్తిన వివాదంలో అనవసరంగా హీరోయిన్ త్రిష కృష్ణ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. తమిళనాడు ఏఐఏడీఎంకే నాయకుడు ఏవీ రాజు ప్రత్యర్థి పార్టీ నేతలను విమర్శిస్తూ.. కొందరు రాజకీయ నాయకులు రూ.25 లక్షలు చెల్లిస్తాం రావాలని త్రిషను కోరినట్లు, రిసార్ట్ కు పిలిపించుకున్నట్లు సంచలన ఆరోపణలు చేసారు. ఇది వైరల్ అవ్వడంతో త్రిష సీరియస్ అయింది. ''అటెన్షన్ కోసం తాపత్రయపడే దిగజారుడు మనస్తత్వంగల వాళ్లను చూస్తే నాకు అసహ్యం. నా ఓపిక కూడా నశించింది. ఇక క్షమించను.. ఇకపై వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఎవరు మాట్లాడినా లీగల్ గా సమాధానం వస్తుంది'' అంటూ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇలా ఈ ఏడాదిలో అనేక మంది హీరో హీరోయిన్ల చుట్టూ కాంట్రావర్సీలు అయ్యాయి. అల్లు అర్జున్ నంద్యాల పర్యటన తర్వాత సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అల్లు ఆర్మీ మధ్య ఓ రేంజ్ లో ఘర్షణలు జరిగాయి. 'పుష్ప 2' విడుదల తర్వాత అంతా సద్దుమణిగింది. ఐఫా (IIFA-2024) అవార్డ్స్ హోస్టింగ్ కారణంగా టాలీవుడ్ హీరోలు రానా దగ్గుబాటి - తేజా సజ్జ లపై కొన్ని రోజులపాటు ట్రోలింగ్ జరుగుతోంది. ఈవెంట్ లో భాగంగా తెలుగు సినిమాలను రోస్టింగ్ చేసే క్రమంలో వీరిద్దరూ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమవ్వడమే దీనికి కారణం. అయితే దీనిపై తేజ, రానాలు క్లారిటీ ఇచ్చారు. ఎవరినీ తక్కువ చేయాలనే ఉద్దేశ్యం తమకు లేదని వివరణ ఇచ్చారు. కానీ వీరిద్దరూ 'మిస్టర్ బచ్చన్' ను ట్రోల్ చేయడంపై దర్శకుడు హరీష్ శంకర్ హర్ట్ అయ్యారు.