2024లో పెళ్లితో లాకైన టాప్ హీరోయిన్స్
దీనిని కాస్త ఆలస్యంగా గ్రహించినా పలువురు సెలబ్రిటీలు పెళ్లితో కొత్త ఆనందం వెతుక్కున్నారు.
By: Tupaki Desk | 20 Dec 2024 6:30 AM GMTజీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా చివరికి వ్యక్తిగత జీవితంలో ఎంత ఆనందంగా ఉన్నామన్నది చాలా ముఖ్యం. కుటుంబ జీవితంతోనే పరిపూర్ణ ఆనందం. దీనిని కాస్త ఆలస్యంగా గ్రహించినా పలువురు సెలబ్రిటీలు పెళ్లితో కొత్త ఆనందం వెతుక్కున్నారు. కెరీర్ ని చక్కదిద్దుకుంటూనే, ఓ ఇంటి వాళ్లయి సంసార జీవనంలో సరిగమల్ని ఆస్వాధిస్తున్నారు.
2024 ముగుస్తోంది.. 2025కి వెల్‌కం చెప్పే సమయమిది. పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటే.. ఈ ఏడాదిలో నలుగురు కథానాయికలు ఓ ఇంటి వాళ్లయ్యారు. రకుల్ ప్రీత్ సింగ్, సోనాక్షి సిన్హా, శోభిత ధూళిపాల, కీర్తి సురేష్ లతో పాటు హైప్రొఫైల్స్ నుంచి రాధిక మర్చంట్ వివాహం ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం వారంతా తమ భర్తలతో హ్యాపీ లైఫ్‌ని ఆస్వాధిస్తున్నారు.
ఏడాది ఆరంభమే ఫిబ్రవరిలో రకుల్ ప్రీత్ సింగ్ తాను ప్రేమించిన నటుడు కం నిర్మాత జాకీ భగ్నానీని పెళ్లాడింది. బాలీవుడ్ లో పేరున్న భగ్నానీల కుటుంబంలోకి రకుల్ కోడలుగా అడుగుపెట్టింది. ఆ తర్వాత రకుల్ - జాకీ జంట సంతోషకరమన జీవితానికి సంబంధించిన ఫోటోలు నిరంతరం వైరల్ అవుతూనే ఉన్నాయి. ప్రతి పండుగను కుటుంబంతో రకుల్ అందంగా సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. పెళ్లి వేడుకలో నవవధువు వేషధారణలో ఉన్న రకుల్ ఫోటో అంతర్జాలంలో ఎక్కువగా వైరల్ అయింది.
షాట్ గన్ శత్రుఘ్న సిన్హా కుమార్తె సోనాక్షి సిన్హా ప్రేమ వివాహం గురించి తెలిసిందే. సహనటుడు జహీర్ ఇక్భాల్ తో ప్రేమలో పడిన సోనాక్షి కుటుంబ సభ్యులను ఒప్పించేందుకు చాలా ప్రయత్నించింది. కానీ కొన్ని సమస్యలున్నాయి. చివరికి పెద్దల ఆశీస్సులతో సోనాక్షి- జహీర్ పెళ్లయింది. పెళ్లి తర్వాత తొలి ఏడాది పండగలన్నిటినీ మెట్టినింట ఎంతో ఆనందంగా జరుపుకుంటోంది సోనాక్షి. షాట్ గన్ శత్రుఘ్న తన కుమార్తెను ధీవించి వెళుతున్నారు. ఇక పెళ్లి వేడుక నుంచి వధూవరుల అందమైన ఫోటోలు అంతర్జాలంలో వైరల్ అయ్యాయి.
తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన పెళ్లిళ్లలో శోభిత ధూళిపాల- అక్కినేని నాగచైతన్య పెళ్లి ఒకటి. శోభిత తెలుగు, తమిళ చిత్రసీమలతో పాటు, హిందీలోను పాపులర్ హీరోయిన్. నాగచైతన్య ప్రముఖ కుటుంబం నుంచి హీరో కనుక ఈ పెళ్లికి విపరీతమైన ప్రచారం దక్కింది. నాగచైతన్య సమంత నుంచి విడిపోయాక శోభితను మనువాడాడు. ఈ పెళ్లిలో వధూవరుల వేషధారణలు సాంప్రదాయం ఆకట్టుకుంది. ముఖ్యంగా నవవధువు శోభిత ఎంతో ట్రెడిషనల్ గా కనిపించిన ఫోటోలు వైరల్ అయ్యాయి.
ఇటీవల మహానటి కీర్తి సురేష్ తన 15 సంవత్సరాల ప్రేమను పెళ్లితో నిజం చేసుకుంది. తన చిన్నప్పటి స్నేహితుడు, ప్రియుడు ఆంటోని తాటిల్ ని కీర్తి పెళ్లి చేసుకుంది. హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల్లో ఈ జంట వివాహం జరిగింది. పెళ్లిలో కీర్తి సురేష్ సాంప్రదాయ బ్రాహ్మణ వేషధారణ లో కనిపించిన ఫోటోలు వైరల్ అయ్యాయి.
ఈ ఏడాది చెప్పుకోదగ్గ పెళ్లిళ్లలో రాధికా మర్చంట్- అనంత్ అంబానీ జంట వివాహం ఒకటి. ఇది కూడా పెద్దలు అంగీకరించిన ప్రేమ వివాహం. రాధిక-అనంత్ చాలా కాలంగా స్నేహితులు. ఎట్టకేలకు అంగరంగ వైభవమైన పెళ్లితో ఒకటయ్యారు. ఈ జంట పెళ్లి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లిగా చరిత్రకెక్కింది. కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి కోసం ముఖేష్ అంబానీ కుటుంబం మంచినీళ్లలా డబ్బు ఖర్చు చేసింది. దాదాపు 2000 కోట్ల ఖర్చుతో కొన్ని నెలలపాటు వివాహ వేడుకల్ని కొనసాగించింది. క్రూయిజ్ షిప్‌పైనా పార్టీలు చేసింది. ఇక పెళ్లి నుంచి రాధిక మర్చంట్ డిజైనర్ లుక్స్ అంతర్జాలాన్ని షేక్ చేసాయి.