Begin typing your search above and press return to search.

'లవ్ రెడ్డి' మూవీ రివ్యూ

లవ్ రెడ్డి.. ఇలాంటి టైటిల్ తో ఓ సినిమా రావడం ఆశ్చర్యం కలిగించే విషయం. దీని ట్రైలర్ కూడా ప్రేక్షకుల్లో కొంత క్యూరియాసిటీ పెంచింది.

By:  Tupaki Desk   |   18 Oct 2024 11:56 AM GMT
లవ్ రెడ్డి మూవీ రివ్యూ
X

'లవ్ రెడ్డి' మూవీ రివ్యూ

నటీనటులు: అంజన్ రామచంద్ర-శ్రావణి రెడ్డి-ఎన్.టి.రామస్వామి-గణేష్-రవి కాలబ్రహ్మ-వాణి గౌడ తదితరులు

సంగీతం: ప్రిన్స్ హెన్రీ

ఛాయాగ్రహణం: మోహన్ చారి-అస్కర్ అలీ

నిర్మాత: హేమలత రెడ్డి

రచన-దర్శకత్వం: స్మరణ్ రెడ్డి

లవ్ రెడ్డి.. ఇలాంటి టైటిల్ తో ఓ సినిమా రావడం ఆశ్చర్యం కలిగించే విషయం. దీని ట్రైలర్ కూడా ప్రేక్షకుల్లో కొంత క్యూరియాసిటీ పెంచింది. కొత్త నటీనటులతో స్మరణ్ రెడ్డి అనే నూతన దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

నారాయణ రెడ్డి (అంజన్ రామచంద్ర) కర్ణాటక బోర్డర్లో ఉండే రాయలసీమ పల్లెటూరిలో ఓ రైతు కుటుంబానికి చెందిన కుర్రాడు. ఓ గార్మెంట్ కంపెనీలో అతడికి 20 శాతం వాటా ఉంటుంది. ఐతే మూడు పదుల వయసు వచ్చినా పెళ్లి చేసుకోని అతను.. తాను రోజూ ప్రయాణించే బస్సులో దివ్య (శ్రావణి రెడ్డి) అనే అమ్మాయిని చూసి తొలి చూపులోనే ప్రేమిస్తాడు. దివ్య అతడితో సన్నిహితంగా మెలగడంతో ఆమెకు కూడా తనంటే ఇష్టం అనుకుంటాడు నారాయణరెడ్డి. తనతో జీవితాన్ని ఊహించుకుని గాల్లో తేలిపోతుంటాడు. తన ఇంట్లో కూడా విషయం తెలిసి అతడికి మద్దతుగా నిలుస్తారు. దివ్యతో ప్రేమలో పడ్డాక పూర్తిగా మారిపోయిన నారాయణరెడ్డిని అందరూ 'లవ్ రెడ్డి' అని పిలుస్తుంటారు. ఐతే ఇంతకీ దివ్య మనుసులో నారాయణరెడ్డి ఉన్నాడా లేడా.. నారాయణరెడ్డి తన ప్రేమను చెప్పాక దివ్య స్పందనేంటి.. చివరికి వీళ్లిద్దరూ కలిశారా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

అబ్బాయిలు ఎలా ప్రేమలో పడతారు? బస్టాపులో అమ్మాయి వర్షంలో తడుస్తూ కనిపించినపుడు! ఎవరికైనా సాయం చేస్తూ పెద్ద మనసు చాటుకున్నపుడు! అమ్మాయి ఎలా ప్రేమలో పడుతుంది? తనను ఎవరైనా అల్లరి చేస్తుంటే హీరో వచ్చి కాపాడినపుడు! హీరో హీరోయిన్ల ప్రేమకు సాధారణంగా ఏం అడ్డంకి ఉంటుంది..? పరువు కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే హీరోయిన్ తండ్రి! ఇలాంటి స్థితిలో హీరోయిన్ ఏం చేస్తుంది? హీరో అంటే ఇష్టం ఉన్నా సరే దాన్ని మనసులో దాచుకురని అతణ్ని దూరం పెడుతుంది! సగటు ప్రేమకథల్లో సాధారణంగా కనిపించే దృశ్యాలివి. 'లవ్ రెడ్డి' కూడా ఇలా రొటీన్ గా సాగిపోయే ప్రేమకథే. కథ పరంగా ఎక్కడా ఎగ్జైట్మెంట్ కలగదు. కొత్తదనపు ఛాయలు కనిపించవు. కాకపోతే కొత్తవాళ్లయినా హీరో హీరోయిన్లు పరిణతితో నటించడం.. వారి మధ్య సన్నివేశాలు అక్కడక్కడా ఆహ్లాదం పంచడం.. పాటలు బాగుండడం.. క్లైమాక్స్ కొంచెం కదిలించేలా ఉండడం ఈ లవ్ స్టోరీలో మెచ్చదగ్గ విషయాలు. ఒక ప్రత్యేకమైన సినిమా చూసిన ఫీలింగ్ ఏమీ కలగదు కానీ.. అలా అని మరీ తీసిపడేయదగ్గ సినిమా కూడా కాదు 'లవ్ రెడ్డి'.

'లవ్ రెడ్డి'లో నటీనటులందరూ కొత్త వాళ్లే. దర్శకుడు సహా టెక్నీషియన్లూ కొత్త వాళ్లే. ఇలాంటి ఓ టీం కలిసి ఒక మామూలు ప్రేమకథను చూపించి ప్రేక్షకులను మెప్పించాలనుకుంటే కష్టం. ఇలాంటి ప్రయత్నాలు చేసినపుడు కథను మామూలుగా నడిపించి.. మామూలుగానే ముగిస్తే ప్రేక్షకులను ఎంగేజ్ చేయడం కష్టం. ఐతే కథ సాధారణంగానే అనిపించినా.. అక్కడక్కడా కొన్ని చెప్పుకోదగ్గ మూమెంట్స్ ఉండడం.. ముగింపులో షాక్ ఫ్యాక్టర్ ఉండడం ఇందులో ప్లస్ పాయింట్స్. సినిమాలో ప్రధాన లోపం ప్రేమకథలో మెరుపులేమి లేకపోవడం. హీరో హీరోయిన్ల బంధాన్ని సరిగా ఎస్టాబ్లిష్ చెయ్యలేక పోయాడు దర్శకుడు. ప్రేమకథను సరిగా తీర్చిదిద్దుకుని ఉంటే తర్వాత హీరో హీరోయిన్ల మధ్య ఎడబాటు వచ్చినపుడు ప్రేక్షకుల్లో ఎమోషన్ ఉండేది. ముగింపు బావున్నా ముందు నడిచిన ప్రహసనం వల్ల దాని ఇంపాక్ట్ తగ్గిపోయింది. ఐతే చాలా వరకు ఏముంది ఈ సినిమాలో అనిపించేలా సాగినా.. చివర్లో హార్ట్ హిట్టింగ్ గా అనిపించే ముగింపు ప్రేక్షకులను కొంచెం కదిలిస్తుంది. హీరో కోణంలో కథను నడిపించినంతసేపూ ఏ విశేషం లేనట్లు కనిపించే 'లవ్ రెడ్డి'.. హీరోయిన్ వైపు నుంచి కథను చెప్పడం మొదలయ్యాక ప్రత్యేకంగా అనిపిస్తుంది. అక్కడి నుంచి ప్రేక్షకుల అటెన్షన్ రాబడుతుంది. క్లైమాక్స్ లో భావోద్వేగాలు ఓ మోస్తరుగా పండాయి. చివర్లో వచ్చే ట్విస్టు.. కథకు ఇచ్చిన ముగింపు కూడా ఎఫెక్టివ్ గా అనిపిస్తాయి. కానీ చివరి అరగంట కోసం అంతకుముందు గంటన్నరకు పైగా 'లవ్ రెడ్డి'ని భరించడం కొంచెం కష్టమే అవుతుంది.

పైన చెప్పుకున్నట్లు ఈ కథ మొదలయ్యే దగ్గర్నుంచి చాలా రొటీన్ ఫీల్ కలుగుతుంది. ఏ సన్నివేశంలోనూ కొత్తదనం కనిపించదు. బస్సులో మొదలై.. బస్సులోనే ముందుకు నడిచే ఇలాంటి ప్రేమకథల్ని చాలా సార్లు చూసి ఉంటాం. ఐతే రొటీన్ అయినా ప్రేమ సన్నివేశాలు విసుగ్గా అయితే అనిపించవు. హీరో హీరోయిన్లు ఇద్దరూ పల్లెటూర్లలో కనిపించే సగటు అబ్బాయి-అమ్మాయిలా సహజంగా కనిపించడం.. వారి పెర్ఫామెన్స్ కూడా ఓకే అనిపించడంతో ఈ లవ్ స్టోరీ సోసోగా నడిచిపోతుంది. పాటలు కూడా బాగానే అనిపిస్తాయి. కానీ హీరో పెళ్లిచూపులు చూసే మరో అమ్మాయితో నడిపిన కామెడీ ట్రాక్ మాత్రం చికాకు పెడుతుంది. హీరో ఫ్యామిలీ సీన్స్ కూడా అంతంతమాత్రమే. ప్రేమకథ ఒక దశ దాటాక ఎటూ కదలక ఒకే చోట ఉండిపోవడం వల్ల కూడా సినిమా భారంగా మారుతుంది. ఐతే హీరో తన ప్రేమను కథానాయికకు చెప్పే దగ్గర్నుంచి ఈ కథపై ఆసక్తి పుడుతుంది. హీరోయిన్ రియాక్ట్ అయ్యే సందర్భంలో వచ్చే డైలాగులు బావున్నాయి. హీరోయిన్ కోణంలో కథను చెప్పడం మొదలయ్యాక 'లవ్ రెడ్డి' ట్రాక్ ఎక్కుతుంది. అక్కడి నుంచి ముగింపు వరకు సినిమా ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాలు కూడా కొత్తగా అనిపించకపోయినా.. వాటిని తీర్చిదిద్దిన తీరు ప్రేక్షకులను కాస్త కదిలిస్తుంది. కానీ చివరి అరగంట కోసం అంతకుముందు ప్రహసనాన్ని భరించాల్సి ఉంటుంది. ఓవరాల్ గా 'లవ్ రెడ్డి'లో అక్కడక్కడా చెప్పకోదగ్గ కొన్ని మూమెంట్స్ ఉన్నాయి. అలా అని ఇది సంతృప్తినిచ్చే సినిమా అని చెప్పలేం.

నటీనటులు:

ప్రేమ కథలో హీరో అనగానే ఊహించుకునే స్థాయిలో ఇందులో కథానాయకుడు ఉండడు. నారాయణ రెడ్డిగా అంజన్ రామచంద్ర చూడ్డానికి మామూలు పల్లెటూరి కుర్రాడిలా కన్పిస్తాడు. తన నటన ఒకే. చివర్లో ఎమోషన్లను బాగానే పండించాడు. హీరోయిన్ శ్రావణి రెడ్డి సినిమాలో బెస్ట్ పెర్ఫామర్ అని చెప్పొచ్చు. షార్ట్ ఫిల్మ్స్ అనుభవంతో ఆమె చక్కగా నటించింది. కీలక సన్నివేశాల్లో పరిణతి చూపించింది. క్లైమాక్సులో తన నటన చాలా బాగుంది. హీరోయిన్ తండ్రి పాత్రలో చేసిన నటుడు బాగా చేశాడు. అతను కూడా చివర్లో తన ప్రత్యేకత చాటుకున్నాడు. హీరో తమ్ముడు.. ఫ్రెండు పాత్రల్లో చేసిన ఆర్టిస్టులు కూడా బానే చేశారు.

సాంకేతిక వర్గం:

చిన్న బడ్జెట్లో.. పరిమితుల మధ్య ఈ సినిమా తీసిన విషయం తెర మీద తెలిసి పోతుంది. ఐతే సాంకేతిక నిపుణులు మంచి కృషే చేశారు. ముఖ్యంగా ప్రిన్స్ హెన్రీ సంగీతం ఆకట్టుకుంటుంది. తన పాటల్లో రెండు వినసొంపుగా ఉన్నాయి. నేపథ్య సంగీతం కూడా బాగానే సాగింది. మోహన్ చారి - అస్కర్ అలి అందించిన ఛాయాగ్రహణం ఓకే. నిర్మాణ విలువలు ఈ సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. రైటర్ కమ్ డైరెక్టర్ స్మరణ్ ఒక మామూలు కథనే నిజయితీగా చెప్పాలనుకున్నాడు. కానీ ప్రేమకథను అతను సరిగా తీర్చిదిద్దుకోలేకపోయాడు. ఫైనల్ యాక్ట్ బాగున్నా ముందు లవ్ స్టోరీలో బలం లేకపోవడం వల్ల చివరికి అనుకున్నంత ఇంపాక్ట్ రాలేదు.

చివరగా: లవ్ రెడ్డి.. రొటీన్ లవ్ స్టోరీలో క్లైమాక్స్ మెరుపు

రేటింగ్-2.25/5