మినీ రివ్యూ: 'లవ్ గురు'
విజయ్ ఆంటోనీ స్వీయ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఈద్ స్పెషల్ గా ఈరోజు ఏప్రిల్ 11న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ విడుదల చేసింది.
By: Tupaki Desk | 11 April 2024 12:27 PM GMTవైవిధ్యమైన చిత్రాలతో తెలుగు తమిళ భాషల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ ఆంటోనీ. ఇప్పటి వరకూ ఎక్కువగా థ్రిల్లర్ సినిమాలతో అలరించిన విలక్షణ నటుడు.. ఇప్పుడు తొలిసారిగా 'రోమియో' అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ తో వచ్చారు. 'లవ్ గురు' పేరుతో తెలుగులోకి డబ్ చేయబడిన ఈ చిత్రంలో మృణాళిని రవి హీరోయిన్ గా నటించింది. వినాయక్ వైద్యనాథన్ దీనికి దర్శకుడు. విజయ్ ఆంటోనీ స్వీయ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఈద్ స్పెషల్ గా ఈరోజు ఏప్రిల్ 11న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ విడుదల చేసింది.
కథేంటంటే.. మలేసియాలో కేఫ్ నడుపుతున్న అరవింద్ (విజయ్ ఆంటోని).. ఇంటి బాధ్యతల్లో పడి వ్యక్తిగత జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. అందుకే 35 ఏళ్లు వచ్చినా ప్రేమ, పెళ్లికి నోచుకోలేకపోతాడు. తన మనసులో ప్రేమ పుట్టినప్పుడు పెళ్లి చేసుకుంటానని చెబుతూ వచ్చిన అతను, సింగిల్ లైఫ్ కు గుడ్ బై చెప్పలానే లక్ష్యంతో ఇండియాకి తిరిగి వస్తాడు. అనుకోకుండా ఓ చావు ఇంట్లో లీల (మృణాళిని రవి)ని చూసి మనసు పారేసుకుంటాడు.. ఆమెతో జీవితాన్ని ఊహించుకుంటాడు.
సినిమా హీరోయిన్ అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న లీల.. పెళ్లికి రెడీగా లేదు. అయితే చివరకు హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలనే కండిషన్ మీద అరవింద్ తో మూడు ముళ్ళు వేయించుకుంటుంది. కానీ, పెళ్లైన మరుసటి రోజే లీలా ఇష్టం లేకుండానే ఈ పెళ్లి చేసుకుందనే సంగతి అరవింద్‌కు అర్థమవుతుంది. మరి ఆ తర్వాత ఏమైంది? భార్య మనసు గెలుచుకునేందుకు అరవింద్ ఏం చేశాడు? హీరోయిన్ అవ్వాలనే లీల లక్ష్యం నెరవేరిందా లేదా? లీలా, అరవింద్ చివరకు భార్యా భర్తలుగా ఒక్కటయ్యారా లేదా? అనేది తెలియాలంటే 'లవ్ గురు' సినిమా చూడాల్సిందే.
స్టోరీ లైన్ గా చెప్పుకుంటే ఇదేమీ కొత్త కథ కాదు. పెద్దల బలవంతంతో ఇష్టం లేకుండా అమ్మాయి పెళ్లి చేసుకోవడం, పెళ్ళైన తర్వాత భర్తకు నిజం తెలియడం, భార్య మనసు గెలుచుకోడానికి భర్త చేసే ప్రయత్నాలు, క్లైమాక్స్ లో ఇద్దరూ కలిసిపోవడం.. ఇలాంటి లైన్ తో ఇప్పటికే అనేక సినిమాలు వచ్చాయి. ఇప్పుడు 'లవ్ గురు' మూవీ కూడా అదే క్యాటగిరీకి చెందుతుంది. కాకపోతే పాత రొటీన్ కథనే, ఇక్కడ కొత్తగా ఎంటర్టైనింగ్ గా చూపించే ప్రయత్నం చేశారు. దీనికి సిస్టర్ సెంటిమెంట్ ను కూడా జత చేసిన తీరు ఆకట్టుకుంటుంది.
సినిమా ఫస్టాప్ అంతా ఫన్నీగా సాగితే, సెకండాఫ్ కు వచ్చే సరికి ఎమోషనల్ గా ఉంటుంది. విజయ్ ఆంటోనికి, వీటీవీ గణేష్‌కు మధ్య వచ్చే సీన్స్ నవ్విస్తాయి. అలానే ఇంటర్వెల్ కు ముందు వచ్చే యోగిబాబు పాత్ర నవ్విచడమే కాదు, కథలో కీలకంగా మారుతుంది. అయితే చాలా సన్నివేశాలు 'రబ్ నే బనాదీ జోడీ' లాంటి హిందీ సినిమాతో సహా కొన్ని పాత తెలుగు చిత్రాలను గుర్తు చేస్తాయి. అరవింద్ చెల్లెలు తాలూకు చేదు జ్ఞాపకాలు, క్లైమాక్స్ లో అరవింద్ - లీలాకు మధ్య వచ్చే సీన్స్ భావోద్వేగానికి గురిచేస్తాయి. కథలో కొత్తదనం లేకపోవడం, స్క్రీన్ ప్లే ప్రేక్షకుడు ఊహించేలా ఉండటం, కొన్ని బోరింగ్ సన్నివేశాలు, పాటలు ఈ సినిమాకు మైనస్ అని చెప్పాలి.
అరవింద్‌గా విజయ్ ఆంటోని మెప్పించారు. కామెడీ, ఎమోషనల్ సీన్స్‌లో బాగా నటించారు. మృణాళిని తెరపై అందంగా కనిపించింది కానీ, నటనకు పెద్దగా స్కోప్ దొరికినట్లు అనిపించలేదు. గణేశ్, యోగిబాబు, షా రా నవ్వించే పాత్రలు పోషించారు. మిగతా నటీనటులు కూడా తమ పరిధి మేరకు నటించారు. భాషా శ్రీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా డైలాగ్స్ రాశారు. రొటీన్ కథే అయినప్పటికీ.. సినిమా ఎక్కడా బోర్ కొట్టించకుండా తెరకెక్కించారు. కాబట్టి ఈ వీకెండ్ లో కాలక్షేపం కోసం, కాసేపు సరదాగా నవ్వుకోడానికి 'లవ్ గురు' సినిమాకి వెళ్లొచ్చు.