ట్రెండీ టాక్: నటవారసుడిలో ఎక్కడుంది లోపం?
కానీ నాలుగు రోజులకే కలెక్షన్లు లేక చాప చుట్టేసాయని బాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురించింది.
By: Tupaki Desk | 12 Feb 2025 4:30 PM GMTసోమవారం టెస్ట్ లో ఘోరంగా విఫలమైన తర్వాత, జునైద్ ఖాన్ - ఖుషి కపూర్ ల లవ్‌యాపా , హిమేష్ రేషమ్మియా నటించిన బాదాస్ రవి కుమార్ రెండూ మంగళవారం కలెక్షన్లలో మరింత తగ్గుదలను చవిచూశాయి. రెండు సినిమాలు ఒకే రోజు అంటే ఫిబ్రవరి 7న విడుదలయ్యాయి. కానీ నాలుగు రోజులకే కలెక్షన్లు లేక చాప చుట్టేసాయని బాలీవుడ్ మీడియా కథనాలు ప్రచురించింది.
అయితే లవ్ యాపా నటులు ఇప్పటికీ ప్రచారం కోసం తపిస్తున్నారు. తాజాగా ఇంటర్నెట్ లో ఫరా ఖాన్ - జునైద్ ఖాన్ ల వీడియో ఒకటి వైరల్ అవుతోంది. లవ్‌యాపా ప్రచారంలో భాగంగా జునైద్ తో కలిసి వెళ్లిన ఫరా తన ఇంటి పనిమనిషితో పరాచికం ఆడిన వీడియో కడుపుబ్బా నవ్వించింది. జునైద్ ని చూడగానే ``ఎవరు ఇది? అని సందేహించడం... ఆమిర్ కొడుకు చాలా పొట్టివాడు! అనే పరిహాసంతో కడుపుబ్బా నవ్విస్తుంది. వారి మధ్య సరదా పరిహాసం అందరినీ చిలౌట్ చేసింది. నిజానికి అమీర్ ఖాన్ పొట్టి. కాబట్టి అతడి వారసుడు కూడా పొట్టిగా ఉండాలని చాలా మంది భావిస్తారు. కానీ జునైద్ చాలా ఎత్తు. ఇక్కడ జునైద్ ఒడ్డూ పొడుగూ మ్యాటర్ కాదు. అతడు నటించిన రొమాంటిక్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాపైంది. అతడు ప్రజల్ని థియేటర్లకు రప్పించేంత పెద్ద స్టార్ కాలేకపోయాడు. అతడు ఆశించినది సాధించాలి అంటే చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది.
ఒక పెద్ద స్టార్ నటవారసుడు వస్తున్నాడు! అనే క్యూరియాసిటీ ప్రజల్లో లేకపోవడం కూడా జునైద్ కి పెద్ద మైనస్. అలాగే పెద్ద సూపర్ స్టార్ వారసుడు కాబట్టి జునైద్ ఎవరికీ అంతు చిక్కని వాడు కాదు. అతడు చాలా సాధా సీదా బోయ్ లా ఉన్నాడు. అందరితో కలిసిపోయే మనస్తత్వం అతడిని స్వీటెస్ట్ బోయ్ గా చూపిస్తోంది. అయితే ఇండస్ట్రీకి కావాల్సింది స్వీటెస్ట్ కాదు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ తో దుమారం రేపే హాటెస్ట్ గయ్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బాలీవుడ్ లో అతడు హృతిక్ రోషన్, రణ్ వీర్ లతో పోటీపడటం అంత సులువు కాదు. కనీసం అతడు వైవిధ్యమైన సినిమాలతో ఇతరుల కంటే తాను ఎలా బెస్ట్ అనేది నిరూపించాల్సి ఉంటుంది. కంటెంట్ అతడిని కింగ్ గా మార్చగలదని కూడా విశ్లేషిస్తున్నారు. అమీర్ ఖాన్, ఫరాఖాన్ సహా చాలా మంది సెలబ్రిటీలు ప్రచారం చేసినా కానీ, లవ్ యాపా విజయం సాధించలేదు.