Begin typing your search above and press return to search.

'లక్కీ భాస్కర్'పై కాపీ ఆరోపణలు

ఆ సినిమా మీద ఇప్పుడు కాపీ ఆరోపణలు చేశాడు బాలీవుడ్ సీనియర్ దర్శకుడు హన్సల్ మెహతా.

By:  Tupaki Desk   |   1 Jan 2025 1:05 PM GMT
లక్కీ భాస్కర్పై కాపీ ఆరోపణలు
X

గత ఏడాది తెలుగు నుంచి వచ్చిన బెస్ట్ మూవీస్‌లో 'లక్కీ భాస్కర్'ను ముందు వరుసలో పెట్టొచ్చు. దీని మీద ఎన్నో రెట్ల వసూళ్లు రాబట్టిన చిత్రాలు ఉన్నాయి కానీ.. కంటెంట్ పరంగా దీనికి అవి సాటి రావు. పర్ఫెక్ట్ మూవీ అంటే ఎలా ఉండాలో ఈ సినిమాను ఉదాహరణగా చూపించవచ్చు. దాని స్థాయిలో అది మంచి వసూళ్లు కూడా రాబట్టింది. ఆ సినిమా మీద ఇప్పుడు కాపీ ఆరోపణలు చేశాడు బాలీవుడ్ సీనియర్ దర్శకుడు హన్సల్ మెహతా. తన దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ 'స్కామ్ 1992'ను కాపీ కొట్టి 'లక్కీ భాస్కర్' తీశారని ఆయన ఆరోపించాడు. ఐతే సినిమా రిలీజైనపుడు సైలెంట్‌గా ఉన్న హన్సల్.. ఇప్పుడు ఈ ఆరోపణలు చేయడమేంటని ఆశ్చర్యం కలగొచ్చు. దీనికి ఒక నేపథ్యం ఉంది. 'లక్కీ భాస్కర్' నిర్మాత నాగవంశీ.. ఇటీవల ఒక చర్చా వేదికలో బాలీవుడ్ మీద టాలీవుడ్ తెలుగు సినిమాల ఆధిపత్యం గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.

'పుష్ప-2' ఒకే రోజు రూ.86 కోట్ల వసూళ్లు సాధించడం చూసి బాలీవుడ్ వాళ్లకు నిద్ర పట్టి ఉండదని నాగవంశీ వ్యాఖ్యానించగా.. ఈ కామెంట్ మీద హన్సల్ స్పందించాడు. తాను బాలీవుడ్ వాడినే, ముంబయిలోనే ఉంటా.. కానీ బాగానే నిద్ర పోతున్నా అని ఆయన సెటైరిగ్గా వ్యాఖ్యానించాడు. ఈ ట్వీట్లో నాగవంశీ ఎవరో తెలియదన్నట్లు మాట్లాడిన హన్సల్.. తర్వాత తన పేరు ప్రస్తావించి 'లక్కీ భాస్కర్' సినిమా గురించి ప్రస్తావించాడు. ఈ సినిమా తన 'స్కామ్' సిరీస్ నుంచి తీసుకున్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా అని ఆయన ఆరోపించాడు. ఐతే దీని మీద తనకు అభ్యంతరమేమీ లేదని.. సినిమాలు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంటాయని.. దీని వల్ల అందరూ గెలుస్తారని వ్యాఖ్యానించాడు. ఎవరూ ఎవరి కంటే గొప్ప కాదని.. ఇలా మాట్లాడడం చాలా తప్పని.. ఇంత అహంకారం పనికి రాదని హన్సల్ పేర్కొన్నాడు. 2025లో చూసుకుందాం అంటూ తన టైం లైన్లోకి వస్తున్న వాళ్లందరికీ ఆయన ఒక ఛాలెంజ్ లాంటిది విసిరారు.