షారూఖ్ కంటి సమస్యకు హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్స్ సలహా
అయితే కింగ్ ఖాన్ విదేశాలకు వెళ్లే ముందే నేరుగా హైదరాబాద్ లో అడుగుపెట్టాడు. ఇక్కడ ప్రఖ్యాత ఎల్వీ ప్రసాద్స్ కంటి చికిత్స ఆస్పత్రిలో స్పెషలిస్టులను సంప్రదించారని తెలుస్తోంది.
By: Tupaki Desk | 31 July 2024 5:54 AM GMTకింగ్ ఖాన్ షారూఖ్ వరుస విజయాలతో దూకుడుమీదున్నాడు. ఓవైపు సినిమాలు.. మరోవైపు వ్యాపారాల్లో దూసుకుపోతున్నాడు. ఐపీఎల్‌లో షారూఖ్ కేకేఆర్ టీమ్ అద్భుత విజయాలు సాధిస్తోంది. ఇలాంటి ఆనందకర సమయంలో అతడిని ఒక విషయం కలవరపెడుతోంది. అదే అతడి కంటి సమస్య.
షారూఖ్‌కి కంటి చూపు మందగించిందని, దీనికోసం ముంబైలో స్థానిక క్లినిక్ ని సంప్రదించినా ప్రయోజనం లేకపోవడంతో అతడు అమెరికా వెళ్లి చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నట్టు ఇంతకుముందు కథనాలొచ్చాయి. ఎమర్జెన్సీ బేసిస్ లో అతడు విదేశాలకు వెళ్లి కంటి ఆపరేషన్ చేయించుకునేందుకు సిద్ధమయ్యారని వార్తలు వెలువడ్డాయి.
అయితే కింగ్ ఖాన్ విదేశాలకు వెళ్లే ముందే నేరుగా హైదరాబాద్ లో అడుగుపెట్టాడు. ఇక్కడ ప్రఖ్యాత ఎల్వీ ప్రసాద్స్ కంటి చికిత్స ఆస్పత్రిలో స్పెషలిస్టులను సంప్రదించారని తెలుస్తోంది. నిజానికి ముంబైలో అతడు కంటికి ఆపరేషన్ చేయించుకోవాలని భావించినా దానిని వాయిదా వేసాడు. ఇప్పుడు ఎల్వీ ప్రసాద్స్ లో సలహాలు తీసుకున్నాడు. తదుపరి అమెరికాలోని న్యూయార్క్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. సినిమా లెజెండ్ షారూఖ్ అంతటి వాడు హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్స్ కి రావడంతో దీనిపై బోలెడంత చర్చ సాగుతోంది.
హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్స్ కంటి చికిత్సాలయం ప్రపంచంలోనే అధునాతన సాంకేతికత కలిగిన గొప్ప నేత్రాలయం. ఇక్కడ దేశవిదేశాల నుంచి ఎందరో ప్రముఖులు గతంలో కంటి చికిత్సల కోసం ఎటెండయ్యారు. భారతదేశం నలుమూలల నుంచి హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్స్ కి పేషెంట్లు వస్తుంటారు. నమ్మకమైన శస్త్ర చికిత్సలు ఎల్వీ ప్రసాద్స్ ప్రత్యేకత. అలాంటి చోట సలహా తీసుకుని షారూక్ ఇప్పుడు న్యూయార్క్ కి బయలుదేరుతున్నారని అర్థమవుతోంది. షారూఖ్ తనకు ఉన్న అరుదైన కంటి సమస్యను బట్టి ఈ సలహా పొంది ఉంటాడని కూడా భావిస్తున్నారు.
అయితే దీనిపై షారూఖ్ ఇంకా స్పందించలేదు. ఖాన్ కానీ అతడి కుటుంబం కానీ దీనిపై స్పందించాల్సి ఉంటుంది. గత ఐపీఎల్ సీజన్‌లో షారూఖ్ వడదెబ్బ తిన్న తర్వాత అతడికి అనారోగ్య సమస్యలు తలెత్తాయి. ఇప్పుడు కంటి చికిత్స కోసం అతడు అత్యవసరంగా విదేశాలకు పయనమవుతుండడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. తమ ఫేవరెట్ షారూఖ్ త్వరగా ఈ సమస్య నుంచి బయటపడాలని అభిమానులంతా ఆకాంక్షిస్తున్నారు.