'వేటగాడు' టైటిల్ కోసం ట్రై చేసారు కానీ..!
స్థానిక భాషలో మంచి క్యాచీ టైటిల్ తో ప్రజల్లోకి తీసుకెళ్లాలని లైకా సంస్థ భావించినా కానీ అది వీలు పడలేదు.
By: Tupaki Desk | 9 Oct 2024 4:35 PM GMTఇటీవలి కాలంలో చాలా అనువాద చిత్రాల టైటిళ్లు మారడం లేదు. ఒరిజినల్‌లో ఏ టైటిల్ ని ఉపయోగించారో అదే టైటిల్‌తో ఇరుగు పొరుగు భాషల్లోను సినిమాలను రిలీజ్ చేస్తుండడం ఆశ్చర్యపరుస్తోంది. కొన్నిసార్లు సినిమాలకు సరిగా టైటిళ్లు కుదరకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. చాలా సందర్భాలలో ఆశించిన టైటిల్ పై హక్కులు పొందడం కష్టంగా మారుతోంది. ఇప్పుడు అలాంటి సమస్యనే ఎదుర్కొంటోంది వేట్టయ్యాన్. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ఈ సినిమా పాన్ ఇండియా కేటగిరీలో అత్యంత భారీగా విడుదలవుతోంది. కానీ దీనికి పొరుగు భాషల్లో టైటిల్ కుదరలేదు. స్థానిక భాషలో మంచి క్యాచీ టైటిల్ తో ప్రజల్లోకి తీసుకెళ్లాలని లైకా సంస్థ భావించినా కానీ అది వీలు పడలేదు.
ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్‌లు అన్నిటికీ పేరు మార్పు లేదని లైకా ప్రొడక్షన్స్ కంపెనీ ప్రకటించింది. `వేట్టైయన్: ది హంటర్` పేరుతోనే అన్ని డబ్బింగ్ వెర్షన్‌లను రిలీజ్ చేస్తామని పేర్కొంది. ముందుగా `వేటగాడు` టైటిల్ తో తెలుగులో రిలీజ్ చేయాలని భావించారు. అయితే టైటిల్ అందుబాటులో లేదని లైకా వెల్లడించింది. ఈ చిత్రానికి తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రతి వర్గం మద్దతు ఇవ్వాలని ఈ నోట్ లో కోరారు.
నిజానికి ధనుష్ నటించిన రాయన్ టైటిల్ మార్పు లేకుండానే విడుదలైంది. వేట్టైయాన్, కంగువ వంటి చిత్రాలను తమిళ టైటిళ్లతో తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నందున తమిళ నిర్మాతలు తెలుగు ప్రేక్షకులను పట్టించుకోవడం లేదని, నిర్లక్ష్యంగా అగౌరవపరుస్తున్నారని ప్రముఖ తెలుగు రచయిత రవి అబ్బూరి ఆరోపించిన నేపథ్యంలో లైకా ప్రొడక్షన్స్ వివరణ ఇచ్చింది. టైటిల్ అందుబాటులో లేకపోవడం వల్లనే ఇలా రిలీజ్ చేయాల్సి వస్తోందని లైకా పేర్కొంది.
వెట్టయన్‌లో రజనీతో పాటు, అమితాబ్ బచ్చన్ (తమిళ అరంగేట్రం), ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, రితికా సింగ్, దుషార విజయన్, వీజే రక్షన్ తదితరులు నటించారు. 33 ఏళ్ల తర్వాత అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ ఈ సినిమా కోసం మళ్లీ కలిసి నటిస్తున్నారు. వారి చివరి చిత్రం 1991లో విడుదలైన `హమ్`. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించగా, చిత్ర సాంకేతిక బృందంలో సినిమాటోగ్రాఫర్ ఎస్.ఆర్ కతీర్, ఎడిటర్ ఫిలోమిన్ రాజ్ ఉన్నారు. వెట్టయన్ అక్టోబర్ 10న తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో థియేటర్లలోకి రానుంది.