సీనియర్ లిరిసిస్ట్ గురుచరణ్ మృతికి ప్రముఖుల సంతాపం
...ఇలాంటి ఎన్నో హృదయాలను తాకే మధురమైన పాటలకు ఆ కలం జీవం పోసింది.
By: Tupaki Desk | 12 Sep 2024 7:53 AM GMTముద్దబంతి నవ్వులో మూగ భాషలు మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు..
బోయవాని వేటుకు గాయపడిన కోయిల.. గుండె కోత కోసినా చేసినావు ఊయల...
ఉలికి పడకు అల్లరి మొగుడా ఊపరా ఊయల ...
...ఇలాంటి ఎన్నో హృదయాలను తాకే మధురమైన పాటలకు ఆ కలం జీవం పోసింది. తెలుగు సినిమా సాహిత్యంలో మరపురాని గేయాల్ని అందించిన మేటి గేయ రచయిత గురుచరణ్ (77) ఇక లేరు. ఆయన ఇహలోకాన్ని వీడారు. ఈ సందర్భంగా తెలుగు చిత్రసీమ ఆయనకు నివాళులు అర్పించింది. సీనియర్ గీత రచయిత గురుచరణ్ తీవ్ర అనారోగ్యంతో కొన్ని వారాలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కానీ ఆయన అనారోగ్యం నుంచి కోలుకోలేకపోయారు. గురుచరణ్ మృతి పరిశ్రమకు తీరని లోటు. తెలుగు సినిమాకి ఆయన అందించిన విషాద గీతాలన్నీ ఎవర్‌గ్రీన్ గా నిలిచాయి. గేయరచయితగా అద్భుత సాహిత్యంతో రంజింపజేసారు.
గురుచరణ్ అసలు పేరు మానాపురపు రాజేంద్రప్రసాద్. అలనాటి ప్రముఖ నటి ఎం.ఆర్.తిలకం, ప్రముఖ దర్శకుడు మానాపురం అప్పారావుల కుమారుడు ఈయన. ఎంఏ చదివిన గురుచరణ్ ప్రముఖ గీత రచయిత ఆచార్య ఆత్రేయ దగ్గర శిష్యరికం చేశారు. రెండు వందలకు పైగా సినిమా పాటలు రాశారు.
గురుచరణ్ ఎక్కువగా నటుడు మోహన్ బాబు చిత్రాలకు రాశారు. అల్లుడుగారు (1990), కుంతి కుమారి, రౌడీ గారి పెళ్లాం (1991) వంటి చిత్రాలకు పాటలు రాసారు. బోయవాని వేటకు గాయపడ్డ కోయిల పాట `రౌడీగారి పెళ్లాం` చిత్రంలోనిది. ఆయన రాసినవన్నీ క్లాసిక్ హిట్ లే. ఆయన సాహిత్యంలో లేయర్స్ గా సాగుతూ విషాదకరమైన ఓవర్‌టోన్‌లతో మనసును తాకుతాయి. తెలుగులో రెండు వందలకు పైగా పాటలు రాసిన ఘనాపాటి ఆయన. పాపులర్ గీత రచయిత ఆచార్య ఆత్రేయ మనసు కవిగా సుప్రసిద్ధులు. ఆయన శిష్యునిగా గురుచరణ్ మనసును తాకే పాటలను రాసారు. గీత రచయిత గురుచరణ్ కుటుంబానికి పలువురు సినీప్రముఖులు సంతాపం తెలియజేసారు.
సీనియర్ సాహితీవేత్త, సినీకవి చంద్రబోస్ ఒక అద్భుతమైన కవిని, రచయితను కోల్పోయామని ఆందోళన వ్యక్తం చేసారు. చంద్రబోస్ ఆయన గురించి మాట్లాడుతూ-``గురు చరణ్ గారు తెలుగు సినిమాలకు ఎన్నో మేటి క్లాసిక్ పాటలను రాసారు... మోహన్ బాబు గారు నటించిన చాలా సినిమాలకు ఆయన అద్భుతమైన పాటల్ని రాసారు. మోహన్ బాబు గారి ఇంట్లో తెలుగు భాషా ట్యూషన్ మాస్టార్ గా పని చేసేవారు. ఆ తర్వాత మోహన్ బాబు గారు పాటలు రాసే అవకాశం కల్పించడంతో ఆయనకు అది అదృష్టంగా మారింది`` అని తెలిపారు. ఆయనను కోల్పోవడం బాధాకరంగా ఉందని, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసారు.