Begin typing your search above and press return to search.

దర్శకుడికి దారి చూపించే సిరివెన్నెల పాట..!

తన గేయ రచనలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

By:  Tupaki Desk   |   28 Aug 2024 5:42 AM GMT
దర్శకుడికి దారి చూపించే సిరివెన్నెల పాట..!
X

తన గేయ రచనలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి. తెలుగు సినిమా పాటను ప్రేక్షకులు సైతం సాహిత్యాన్ని అర్థం చేసుకునే స్థాయికి చేరవేసేలా ఆయన కృషి చేశారు. సిరివెన్నెల తో మొదలైన ఆయన పాటల ప్రస్థానం ఎన్నో వేల పాటలతో తెలుగు సినిమా పాటకు అందాన్ని తెచ్చిపెట్టాయి. సినిమాకు పాట కూడా ప్రాణం పోయాలనే ఆలోచనతో ప్రతి పాట.. ప్రతి మాట ఎంతో గొప్పగా రాసి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు శాస్త్రి గారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పాట రూపంలో మనతోనే.. మన హృదయాల్లో ఉంటారు. ఐతే సిరివెన్నెల గారితో సినీ ప్రముఖులకు ఉన్న సత్సంబంధాన్న్ని నా ఉచ్ఛ్వాసం కవనం ప్రోగ్రాం తో ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. ఎంతోమంది సెలబ్రిటీస్ ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనగా లేటెస్ట్ గా డైరెక్టర్ క్రిష్ సిరివెన్నెల తో తన అనుబంధాన్ని చెప్పారు.

క్రిష్ సినిమాలో పాటలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆయన చాలా విషయాలను పాటతోనే ప్రేక్షకులకి చెబుతారు. సినిమాలో పాటకి ఉన్న ఔచిత్యం ఏమిటని ఆయన్ను అడిగితే.. సినిమాకు అసలు పాటలే బలం అంటున్నారు క్రిష్. ఇక శాస్త్రి గారు పాటలు సినిమాకు చాలా అవసరమని నేను నమ్ముతా. పాటని సినిమాకు వారధిగా చేసే గేయ రచయిత ఆయన. శాస్త్రి గారు పాట రాశారంటే అప్పటివరకు జరిగిన కథ.. జరుగుతున్నదీ, జరగబోయేది కూడా చెబుతారు. దర్శకుడికే దారి చూపించేలా సిరివెన్నెల పాట ఉంటుందని అన్నారు క్రిష్.

ప్రతి పాటను శాస్త్రి గారు ప్రశ్నతో సంధిస్తారు. సినిమాలో ఆయన ఒక్క పాట రాసినా సరే కథ మొత్తం వింటారు. ప్రతి డైరెక్టర్ ఒక పుస్తకం పెట్టి స్టోరీ, క్యారెక్టర్స్ ఏంటన్నది చూసుకుని ఆ తర్వాత పాట రాసేవారని క్రిష్ అన్నారు.

గమ్యం సినిమాలో ఎంత వరకు సాంగ్ కోసం నేను కథ చెబితే ఆయన మొత్తం జీవితాన్ని తీసుకొచ్చి పాటలో పెట్టేశారు. శాస్త్రి గారితో పనిచేస్తే డైరెక్టర్స్ పని సులభం అవుతుంది. ఐతే ఆయన ఎంత గొప్పగా రాసిన దానికి తగినట్టుగా తీయగలగాలి కదా అనే సాంగ్ చేసేప్పుడు సిరివెన్నెల గారిని తలచుకుని చేశామన్నారు క్రిష్.

తెలుగు సాహిత్యానికి జాతీయ అవార్డ్.. అది కూడా తను తీసిన గమ్యం సినిమాకు వచ్చింది. ఐతే మనం ఢిల్లీకి చాలా దూరంలో ఉన్నాం. ఆయన రాసిన పాటల ముందు అవార్డులే చిన్నబోతాయి. పాటల రూపంలో ఆయన మనకి దొరకడం అదృష్టమని అన్నారు క్రిష్.

అసలు క్రిష్ డైరెక్టర్ ఎలా అయ్యారన్నది చెబుతూ.. అమెరికాలో చదువు పూర్తి చేశాక సినిమాల్లో రావాలనిపించింది. డైరెక్షన్ కన్నా కథలు రాయడం ఆసక్తి. ఐతే వచ్చాక అనుకోకుండా డైరెక్టర్ ని అయ్యాను. మొదటి సినిమా రెండు కోట్ల బడ్జెట్ తో తీశా.. ఆ సినిమాకు శాస్త్రి గారి పాటకి 2 లక్షలు తీసుకుంటారని తెలిసి మెయిన్ గా ఒక సాంగ్ రాయించి మిగతావి బయట రాయించాలని కోగా పరిచయమయ్యాక వెళ్లి కథ చెప్పా.. ఐతే ఇలానే సినిమా తీస్తావా వద్దు అని ఆయన కొన్ని మార్పులు చెప్పారు. మళ్లీ రెండోసారి కథ చెబితే సినిమాకు ఆరు పాటలు రాస్తానన్నారు. కానీ 12 లక్షలు నేను ఇవ్వలేనని అంటే నాకు కథ కరెక్ట్ గా చెప్పు ఒక్క రూపాయ్ తీసుకోను. సినిమా రిలీజ్ అయ్యాక నువ్వెంత ఇచ్చినా తీసుకుంటానని అన్నారు. కథ నచ్చితే శాస్త్రి గారు చాలా సపోర్ట్ ఇస్తారు.

ఆ తర్వాత సినిమా రిలీజ్ ముందు షో వేశా.. ఫస్టాఫ్ కాగానే శాస్త్రి గారు పిలిచి సినిమా బాగుందా.. లేదా అని ఎవరినీ అడక్కు.. గొప్ప సినిమా తీశావ్.. సెకండ్ హాఫ్ అయ్యాక నన్ను కలువు అన్నారు. సినిమా అయ్యాక హగ్ చేసుకుని నేను చెప్పింది విన్నావ్.. కానీ నువ్వు ఏ కథ అయితే రాసుకున్నావో అది తీశావ్ అన్నారు. గమ్యం సినిమా మొత్తం ఒక పాటలో రాసేశారు. ఆ సినిమా అనుకున్న గమ్యం చేరకపోయుంటే అమెరికా వెళ్లి జాబ్ చేసుకునే వాడిని. ఆ సినిమాకు డాక్టర్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి అని అన్నారు క్రిష్. అప్పటి నుంచి ప్రతి సినిమాలో ఆయన పాట పెడుతున్నా. వేదం, గమ్యం, కృష్ణం వందే జగద్గురుం ఇలా అన్నిటికీ శాస్త్రి గారు పాటలు రాశారు. ఆ సినిమాల్లో పాటలు రాసేప్పుడు ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారని చెప్పారు క్రిష్.

సినిమాకు క్లైమాక్స్ ఉంటుంది. కానీ పాటలో క్లైమాక్స్ ఉంటాయని శాస్త్రి గారు చెప్పారు. కొన్ని పదాలు ఒక వాక్యం అయితే. ఒక పదం మరొక పదంతో కలిస్తే దాని అర్థం మారిపోతుంది. అందుకే ఆయన రాసిన ప్రతి పాటలో చివరి రెండు లైన్లు సినిమా క్లైమాక్స్ లా ఉంటాయని అన్నారు క్రిష్.