Begin typing your search above and press return to search.

రివైండ్ 2023: వీళ్ల‌లో ఎవ‌రు మొన‌గాడు?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్... గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.. యంగ్ య‌మ ఎన్టీఆర్.. వీళ్ల పేర్లు ఏడాది అంతా ప్ర‌ముఖంగా హెడ్ లైన్స్ లో ఉన్నాయి

By:  Tupaki Desk   |   31 Dec 2023 4:27 AM GMT
రివైండ్ 2023: వీళ్ల‌లో ఎవ‌రు మొన‌గాడు?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్... గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.. యంగ్ య‌మ ఎన్టీఆర్.. వీళ్ల పేర్లు ఏడాది అంతా ప్ర‌ముఖంగా హెడ్ లైన్స్ లో ఉన్నాయి. చ‌ర‌ణ్‌- తార‌క్ ఆర్.ఆర్.ఆర్ నాటు నాటు కార‌ణంగా నిరంత‌రం వార్త‌ల్లో నిలిచారు. నాటు నాటుకు ఆస్కార్ పుర‌స్కారం ద‌క్క‌డంతో ఈ పాట‌లో న‌ర్తించిన స్టార్లు, సాంకేతిక నిపుణుల పేర్లు మార్మోగాయి. అలాగే పుష్ప‌రాజ్ గా న‌టించిన అల్లు అర్జున్ కి ఉత్త‌మ న‌టుడిగా జాతీయ అవార్డ్ ద‌క్క‌డంతో అత‌డి పేరు మార్మోగింది. కానీ ఈ ఏడాదిలో బ‌న్ని, చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ మొనగాళ్లే వీళ్లంద‌రినీ మించి అద్భుతంగా అత్యధిక‌ అవార్డుల‌ను అందుకుని తాను మొన‌గాడిని అని నిరూపించారు సీనియ‌ర్ లిరిసిస్ట్ చంద్ర‌బోస్. ఆస్కార్ పుర‌స్కారంతో ఆర్.ఆర్.ఆర్ టీమ్ గౌర‌వాన్ని అందుకోవ‌డంలో ఆయ‌న పాత్ర అన‌న్య సామాన్యం. నాటు నాటు పాట‌కు సాహిత్యం అందించిన మేధావి కూడా.


తెలుగులో పుట్టాం.. తెలుగులో పెరిగాం... తెలుగులో ఎదుగుతాం.. తెలుగులో బతుకుతాం.. తెలుగులో చనిపోతాం.. ఇదీ ప్ర‌ముఖ సినీకవి, సాహితీవేత్త‌ చంద్ర‌బోస్ ప్ర‌వ‌చ‌నం. తెలుగు సినిమాకు తెలుగు ప్ర‌జ‌ల‌కు జాతీయ అంతర్జాతీయ వేదిక‌ల‌పై గుర్తింపు ద‌క్క‌డానికి ఇటీవ‌ల‌ చంద్ర‌బోస్ సాహిత్యం ఒక మూల‌కార‌కంగా మారిందన‌డంలో అతిశ‌యోక్తి లేదు. ఎంద‌రో లెజెండ‌రీ సినీసాహితీవేత్త‌లున్నారు.. కానీ వేటూరి.. సిరివెన్నెల నిష్క్ర‌మ‌ణం త‌ర్వాత మ‌ళ్లీ లెజెండ‌రీని అని నిరూపించిన మేధో ర‌చ‌యిత లిరిసిస్ట్ క‌నుకుంట్ల సుభాష్ చంద్ర‌బోస్. ఒకే ఏడాదిలో ఏకంగా ఆరు అత్యున్న‌త అవార్డుల్ని గెలుచుకున్న, తెలుగు సినిమాని గెలిపించిన‌ మేటి గేయ ర‌చ‌యిత ఆయ‌న‌.


ఎవరు హీరో అంటే.. పాట హీరో.. సంగీతం హీరో... సాహిత్యం హీరో.. అని చెప్పే చంద్ర‌బోస్ భార‌త‌దేశానికి ఆస్కార్ ని అందించిన ధీశాలుల్లో ఒక‌రు. ఈ ఏడాదిలో ఆస్కార్ గెలుచుకున్న ఆర్.ఆర్.ఆర్ లో నాటు నాటుకు ర‌చ‌యిత‌. ఆస్కార్ ఒక్క‌టేనా... గోల్డెన్ గ్లోబ్.. హాలీవుడ్ క్రిటిక్స్ పుర‌స్కారాల్ని తెలుగు వాకిళ్ల‌లోకి తెచ్చిన ఘ‌న‌త‌ను చంద్ర‌బోస్ లిరిక్ నాటు నాటుతో సాధ్యమైంది. నాటు నాటు.. పాటను 45 నిమిషాల్లో రాసినప్పటికీ.. దాన్ని పూర్తి చేయడానికి ఏడాదికి పైగా పట్టింది. అంత సహనంగా ఉన్నందుకు ప్రతిఫలం దక్కించుకున్నారు చంద్ర‌బోస్.


1995లో మొదలైన ప్రయాణం... 2023 వరకు 28 సంవత్సరంలో 800 సినిమాల్లో 3600పైగా పాటలు రాశారు చంద్ర‌బోస్. కానీ ఆయ‌న జీవితానికి పరిపూర్ణత తీసుకువచ్చిన సంవత్సరం 2023.. ఫిబ్రవరిలో గోల్డెన్ గ్లోబ్, అటుపై హాలీవుడ్ క్రిటిక్స్ ఛాయిస్ పుర‌స్కారం.. మూడవది క్రిటిక్స్ అవార్డ్స్ సొంత‌మ‌య్యాయి. ఆ త‌ర్వాత‌ నాలుగవ పుర‌స్కారంగా ఆస్కార్... న‌ట్టింటికొచ్చింది. ఐదవది బాంబే హంగామా అవార్డు, ఆరవది ఏకంగా జాతీయ పురస్కారం. ఇలా ఈ ఏడాదిలో ఆరు అవార్డులను ఆయ‌న ఖాతాలో వేసుకున్నారు చంద్ర‌బోస్.


తెలుగుకి వెయ్యి ఏళ్ల సాహితీ చరిత్ర ఉంది. రెండువేల సంవత్సరాల భాష చరిత్ర ఉంది. తెలుగులో పుట్టాం.. తెలుగులో పెరిగాం... తెలుగులో ఎదుగుతాం, తెలుగులో బతుకుతాం, తెలుగులో చనిపోతాం.. ఇక నాటు నాటు సాంగ్ రాసే అవకాశం ఇచ్చిన ఆర్.ఆర్.ఆర్ క‌ర్త‌ల‌కు ఆయన ఎప్ప‌టికీ కృత‌జ్ఞ‌తా భావంతో ఉన్నారు. అది ఆయ‌న విన‌మ్ర‌త‌.. ఒదిగి ఉండే వ్య‌క్తిత్వం.. విధేయ‌త ఆయ‌న‌కు తొలి నుంచి అబ్బిన గుణం. అందుకే చంద్ర‌బోస్ ఇంతింతై వ‌టుడింతై ఎదిగారు.


కేవ‌లం చంద్ర‌బోస్ అవార్డును అందుకోవ‌డ‌మే కాదు... త‌న ఆనందాన్ని త‌న గ్రామంలో వేడుక‌ను క‌వ‌ర్ చేసిన స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్ కి కూడా అవార్డు ద‌క్క‌డం అరుదైన దృశ్యం. ఈ సంవత్సరం 12 మార్చి 2023న అమెరికా లాస్ ఏంజిల్స్‌లోని హాలీవుడ్‌లోని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అందించే ఆస్కార్ అవార్డ్స్‌లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా లిరిసిస్ట్ చంద్రబోస్ ఆస్కార్ అవార్డును గెలుచుకోగా..

2ఏప్రిల్ 2023న చంద్రబోస్ ఆస్కార్ అవార్డుతో తన గ్రామానికి వెళ్లినప్పుడు ఊరి ప్ర‌జ‌లంతా ఆనందడోలిక‌ల్లో మునిగిపోయారు. వేడుకల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు నృత్యాలు చేశారు. పల్లెటూరి నుంచి ఆస్కార్ వేదిక వరకు తన ప్రయాణాన్ని ఈ సందర్భంగా చంద్రబోస్ గుర్తు చేసుకున్నారు. ఈ మొత్తం వేడుక‌ల జ్ఞాపిక‌గా ఆస్కార్ చ‌ల్ల‌గ‌రిగ అనే ల‌ఘుచిత్రాన్ని రూపొందించారు ప్ర‌ముఖ ఫోటోగ్రాఫ‌ర్ చిల్కూరి సుశీల్ రావు.

ఈ ల‌ఘు చిత్రానికి అంత‌ర్జాతీయ గుర్తింపు ద‌క్కింది. అది కూడా ..కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్‌గా ఆస్కార్ చల్లగరిగ పుర‌స్కారం ద‌క్కించుకుంది. భారతదేశంలోని ఓ కుగ్రామంలో జరిగిన వేడుక ప్రపంచ దృష్టిని ఆకర్షించడం అద్భుతమైన విషయం. ఈ అవార్డు కేవలం చంద్రబోస్‌కే కాకుండా ఆయన గ్రామమైన చల్లగరిగకు దక్కిన నివాళి. ఇదంతా చంద్ర‌బోస్ వ‌ల్ల‌నే సాధ్య‌మైంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. భారతదేశం నుండి వచ్చిన డాక్యుమెంటరీ ఆస్కార్ చ‌ల్ల‌గ‌రిగ‌, యునైటెడ్ స్టేట్స్ నుండి వ‌చ్చిన మ‌రో రెండు సహా నామినీలతో పోటీప‌డుతూ విజేతగా నిలిచింది. తెలుగు డాక్యుమెంటరీ ఫ్రాన్స్‌లోని కేన్స్ వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో విజేతగా నిల‌వ‌డం అరుదైన ఘ‌న‌త‌.

RRR ప్ర‌పంచ సినీయ‌వ‌నిక‌పై చెర‌గ‌ని ముద్ర వేయ‌డ‌మే కాదు ప్ర‌ఖ్యాత‌ హాలీవుడ్ దిగ్గ‌జాల్లో మ‌న ప్ర‌తిభ‌ను ప‌రిచ‌యం చేసింది. తెలుగోడి స‌త్తా ఏంటో ప్ర‌పంచానికి చాటిన ఈ సినిమాకి ప‌ని చేసిన ఆర్టిస్టులు సాంకేతిక నిపుణుల‌కు అరుదైన గౌర‌వం ద‌క్కింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ 2023లో సంస్థలో చేరడానికి 398 మంది ప్రముఖ కళాకారులు ఎగ్జిక్యూటివ్ లకు ఆహ్వానాలను పంప‌గా సాంకేతిక నిపుణుల విభాగంలో టాలీవుడ్ లిరిసిస్ట్ చంద్ర‌బోస్ ఈ జాబితాలో చోటు ల‌భించ‌డం భార‌త‌దేశానికే గ‌ర్వ‌కార‌ణం. ఆర్.ఆర్.ఆర్ కి ప‌ని చేసిన‌ కీర‌వాణి, చర‌ణ్‌, సెంథిల్‌ల‌తో పాటు అత‌డు ఈ రేర్ ఛాన్స్ ద‌క్కించుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

అకాడెమీ సంస్థ‌లో సభ్యత్వం ఎంపిక వృత్తిపరమైన అర్హతలపై ఆధారపడి ఉంటుంది. ఆ అర్హ‌త త‌న‌కు ఉంద‌ని సీనియ‌ర్ గేయ ర‌చ‌యిత చంద్ర‌బోస్ నిరూపించారు. ఒక సామాన్యుడి నుంచి లెజెండ‌రీగా ఎదిగిన ఆయ‌న‌కు తెలుగు వారంతా హ్యాట్సాప్ చెప్ప‌డానికి వెన‌కాడ‌లేదు. గ్రేట్ మ్యాన్.. గ్రేట్ అఛీవ‌ర్.. లెజెండ‌రీ రైట‌ర్ చంద్ర‌బోస్ కి తుపాకి త‌ర‌పున ప్ర‌త్యేకించి నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు...


-- K . శివాజీ