Begin typing your search above and press return to search.

'మా నాన్న సూపర్ హీరో' మూవీ రివ్యూ

సినిమా సినిమాకూ వైవిధ్యం చూపిస్తూ సాగిపోయే యువ కథానాయకుడు సుధీర్ బాబు.. చివరగా 'హరోంహర' అనే యాక్షన్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు.

By:  Tupaki Desk   |   10 Oct 2024 7:22 AM GMT
మా నాన్న సూపర్ హీరో మూవీ రివ్యూ
X

'మా నాన్న సూపర్ హీరో' మూవీ రివ్యూ

నటీనటులు: సుధీర్ బాబు-షాయాజి షిండే-సాయిచంద్-ఆర్ణ వోహ్రా-విష్ణు ఓయ్-రాజు సుందరం-హర్షవర్ధన్-దేవీ ప్రసాద్-శశాంక్ తదితరులు

సంగీతం: జై క్రిష్

ఛాయాగ్రహణం: సమీర్ కళ్యాణ్

నిర్మాత: సునీల్ బలుసు

రచన-దర్శకత్వం: అభిలాష్ రెడ్డి కంకర

సినిమా సినిమాకూ వైవిధ్యం చూపిస్తూ సాగిపోయే యువ కథానాయకుడు సుధీర్ బాబు.. చివరగా 'హరోంహర' అనే యాక్షన్ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఇప్పుడతను 'మా నాన్న సూపర్ హీరో' అనే ఎమోషనల్ డ్రామాతో వచ్చాడు. దసరా కానుకగా విడుదలైన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

జానీ (సుధీర్ బాబు) చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకుంటాడు. తండ్రి అతణ్ని తన వెంట ఉంచుకోలేని స్థితిలో కొన్ని రోజుల పాటు అనాథాశ్రమంలో వదులుతాడు. అదే సమయంలో శ్రీనివాస్ (షాయాజి షిండే) జానీని దత్తత తీసుకుంటాడు. కానీ తన వ్యాపారంలో నష్టం రావడం.. భార్యను కోల్పోవడంతో దత్తత తెచ్చుకున్న కొడుకు అరిష్టం అని భావించి అతడి పట్ల అయిష్టత పెంచుకుంటాడు. కానీ తనను పెంచిన తండ్రి మీద అమితమైన ప్రేమ ఉన్న జానీ.. ఆయన ఎన్ని మాటలు అన్నా.. ఎన్ని తప్పులు చేసినా భరిస్తూ వస్తాడు. కానీ శ్రీనివాస్ ఓ పెద్ద సమస్యలో చిక్కుకోవడంతో ఆయన్ని కాపాడేందుకు కోటి రూపాయలు అవసరం అవుతాయి. ఆ డబ్బుల కోసం జానీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి నుంచి డబ్బులు కొట్టేయాలని అనుకుంటాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు.. తనతో జానీకి ఉన్నసంబంధం ఏంటి.. తన దగ్గర అంత డబ్బెందుకు ఉంది.. జానీ అనుకున్న ప్రకారం ఆ డబ్బులు కొట్టేశాడా.. చివరికి ఏం జరిగింది.. ఈ ప్రశ్నలన్నింటికీ తెరమీదే సమాధానం తెలుసుకోవాలి.

కథనం-విశ్లేషణ:

ప్రేమకథలు అనగానే అబ్బాయి-అమ్మాయి మధ్య కథలే అనుకుంటాం. కానీ వెండి తెర మీద దశాబ్దాల నుంచి ఆ కథలు చూపిస్తూనే ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం. ఆ కథలను చెప్పే వాళ్లకు అందులో కొత్తదనం చూపించడం కష్టమైపోతోంది. చూస్తున్న ప్రేక్షకులకూ మొహం మొత్తేస్తోంది. అందుకేనేమో ఇప్పుడు 'ప్రేమకథలు' కొత్త పుంతలు తొక్కుతున్నాయి. పిల్లల మీద తల్లిదండ్రుల ప్రేమను.. అలాగే తల్లిదండ్రుల మీద పిల్లల ప్రేమలనూ చూపించి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గత ఏడాది తెలుగు దర్శకుడే అయిన సందీప్ రెడ్డి వంగ హిందీలో 'యానిమల్' అంటూ ఓ తండ్రి మీద కొడుక్కి ఉన్న ప్రేమను హింసాకత్మక కోణంలో చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు అభిలాష్ కంకర అనే యువ దర్శకుడు తెలుగులోనే 'మా నాన్న సూపర్ హీరో' రూపంలో ఇద్దరు తండ్రులు-ఓ కొడుకు మధ్య సాగే హృద్యమైన ప్రేమకథను ఆవిష్కరించాడు. బుల్లితెరపై 'లూజర్' అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల భావోద్వేగాలను తట్టి లేపిన అభిలాష్.. పెద్ద తెర మీద ఇంకా బాగా ఎమోషన్లను పండించి తొలి ఫీచర్ ఫిలింతోనే దర్శకుడిగా తనదైన ముద్ర వేశాడు.

ఒకబ్బాయి-ఇద్దరమ్మాయిలు లేదా ఒకమ్మాయి-ఇద్దరబ్బాయిల మధ్య ముక్కోణపు ప్రేమకథలు చూస్తుంటాం కానీ.. 'మా నాన్న సూపర్ హీరో' ఇద్దరు తండ్రులు-ఓ కొడుకు మధ్య సాగే చిత్రమైన ముక్కోణపు ప్రేమకథ. చిన్నతనంలో అనుకోకుండా కొడుకును దూరం చేసుకుని మళ్లీ ఆ కొడుకును కలవాలని తహతహలాడే ఓ తండ్రి.. అనాథాశ్రమం నుంచి ఆ కుర్రాడిని తెచ్చుకుని ప్రేమగా పెంచి ఒక దశలో తనపై మనసు విరిగిపోయిన మరో తండ్రి.. పెంచిన తండ్రి తనను అసహ్యించుకున్నప్పటికీ తన మీద ప్రేమను చూపిస్తూ తన కన్నతండ్రి మీద అభిమానాన్ని కోల్పోయిన కొడుకు.. ఈ ముగ్గురి మధ్య నడిచే కథ ఇది. ఈ ముగ్గురిలో ఎవ్వరూ ఒకరి ప్రేమను ఒకరు పొందలేని స్థితిలో ఉంటారు. ఈ సంఘర్షణే 'మా నాన్న సూపర్ హీరో' కథను డ్రైవ్ చేస్తుంది. భావోద్వేగాలు పండడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నెగెటివ్ షేడ్స్ ఉంటేనే హీరోల పాత్రలు బాగా ప్రేక్షకులకు బాగా రుచిస్తున్న ఈ రోజుల్లో రాముడు మంచి బాలుడు తరహాలో హీరో పాత్రను తీర్చిదిద్ది.. దాంతో ప్రేక్షకులను బాగా కనెక్ట్ చేయగలిగాడు దర్శకుడు అభిలాష్. 'లూజర్' తరహాలోనే తూకం తప్పకుండా.. మెలోడ్రామా ఎక్కువ కాకుండా భావోద్వేగాలు పండించగల నైపుణ్యాన్ని 'మా నాన్న సూపర్ హీరో'లోనూ చూపిస్తూ ప్రేక్షకులను ఎంగేజ్ చేయగలిగాడతను.

తనను పెంచిన తండ్రి తనను అసహ్యించుకుంటున్నా.. ఎన్ని తప్పులు చేస్తున్నా.. అన్నింటినీ భరిస్తూ.. తాను ఎన్నో అవస్థలు పడి తండ్రి సమస్యలు తీర్చే కొడుకు పాత్రతో ప్రేక్షకులు త్వరగా కనెక్ట్ అవుతారు. ఆ పాత్రలోని సిన్సియారిటీ త్వరగానే ప్రేక్షకులకు అర్థమవుతుంది. సుధీర్ బాబు పాత్రకు తగ్గట్లు నటిస్తూ ప్రేక్షకులు ఆ పాత్ర మీద ప్రేమ పెంచుకునేలా చేస్తాడు. ఇష్టపడి దత్తత తెచ్చుకున్న తండ్రి.. ఆ తర్వాత కొడుకుని అంతగా అసహ్యించుకోవడానికి చూపించిన కారణం కూడా బలంగానే కనిపిస్తుంది. పెంచిన తండ్రి కొడుకుల మధ్య ఈ సంఘర్షణ కథను ముందుకు నడిపిస్తుండగా.. అసలు తండ్రి లైన్లోకి వస్తాడు. ఆ తండ్రికి కొడుకెవరో.. కొడుక్కి ఆ తండ్రి ఎవరో తెలియకుండా వీళ్లిద్దరూ కలవడం.. జర్నీ చేయడం నేపథ్యంలో తర్వాతి కథ నడుస్తుంది. పెంచిన తండ్రిని కాపాడ్డానికి కన్న తండ్రి (అతనెవరో తెలియకుండానే)ని మోసం చేయడానికి సిద్ధ పడి.. ఆ వ్యక్తితో ప్రయాణం సాగించే క్రమంలో డ్రామా బాగా పండింది. కథ ఒక దశ వరకు ఆసక్తికరంగా నడిచాక.. మధ్యలో దర్శకుడు కొంచెం పక్కదారి పట్టించిన ఫీలింగ్ కలుగుతుంది. రాజు సుందరం పాత్ర ప్రవేశం.. ఆ తర్వాత వచ్చే పాట స్పీడ్ బ్రేకర్లలా మారాయి. ఇక్కడ కొంచెం డీవియేట్ అయినట్లు కనిపించే కథనం.. మళ్లీ కథ కేరళకు షిప్ట్ అయ్యాక గాడిన పడుతుంది. ప్రి క్లైమాక్స్ నుంచి చాలా ఎమోషనల్ గా నడిచే ‘మా నాన్న సూపర్ హీరో’ ప్రేక్షకులను భావోద్వేగాల్లో తడిసి ముద్దయ్యేలా చేస్తుంది. పతాక సన్నివేశాలు కూడా గొప్పగా అనిపిస్తాయి. సన్నివేశాలతో పాటు.. డైలాగులు కూడా చాలా హృద్యంగా సాగడం.. సుధీర్ బాబు-సాయిచంద్ ఒకరితో ఒకరు పోటీ పడి నటించడంతో ‘మా నాన్న సూపర్ హీరో’ చివర్లో ప్రేక్షకులను కదిలించేస్తుంది. సంతోషకరమైన ముగింపుతోనే ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టిస్తుంది. చివరి అరగంటలో దర్శకుడు ఎమోషన్లను డీల్ చేసిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అయిపోతారు. కళ్లలో తడితో.. గుండె నిండిన ఫీలింగ్ తో థియేటర్ నుంచి బయటికి వస్తారు. ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ ఎమోషనల్ మూవీస్ లో ‘మా నాన్న సూపర్ హీరో’ ఒకటి అనడంలో సందేహం లేదు. కొంచెం స్లో నరేషన్.. మధ్యలో ఓ పావు గంట బోరింగ్ అన్నది పక్కన పెడితే.. ‘మా నాన్న సూపర్ హీరో’లో ఎంచదగ్గ లోపాలు లేవు. ఎమోషనల్ చట్ ఉన్న స్లైస్ ఆఫ్ లైఫ్ డ్రామాలను ఇష్టపడే వారికి ఈ చిత్రం బాగా నచ్చుతుంది.


నటీనటులు:

నటుడిగా కెరీర్ ఆరంభంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న సుధీర్ బాబు 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' నుంచి భిన్నమైన ప్రయాణం చేస్తున్నాడు. ఆ సినిమాతో ఎమోషన్లను పండించడంలో నేర్పు సాధించిన అతను.. సినిమా సినిమాకూ మెరుగవుతున్నాడు. 'సమ్మోహనం'తో పెర్ఫామెన్స్ పరంగా కెరీర్లో పీక్స్ అందుకున్న అతను.. మరోసారి ఆ స్థాయి స్టాండౌట్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. జానీ పాత్రలో అతను ప్రేక్షకులకు చాలా నచ్చేస్తాడు. చాన్నాళ్లు గుర్తుంటాడు. తప్పక తప్పు చేస్తున్నపుడు.. సంఘర్షణకు గురయ్యే సన్నివేశాల్లో తన నటన ప్రేక్షకులను కదిలించేస్తుంది. తన తర్వాత ఎక్కువ ఆకట్టుకునేది సాయిచందే. సెకండ్ ఇన్నింగ్స్ లో ఆయన పాత్రలు చూస్తుంటే ఇంత మంచి నటుడిని తెలుగు తెర చాలా ఏళ్ల పాటు వాడుకోకుండా పక్కన పెట్టేసిందే అనిపిస్తుంది. ఆయన ఆహార్యం.. నటన ఈ తరహా జీవితంలో ఏదో కోల్పోయి వేదన అనుభవిస్తున్న పాత్రలకు బాగా సూటువుతున్నాయి. సాయిచంద్ నటిస్తున్న ఫీలింగే కలగదు. చాలా సహజంగా భావోద్వేగాలను పండించాడు. నమ్మిన వాడే తనను మోసం చేసినపుడు సాయిచంద్ నటన ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టించేస్తుంది. ఆ సీన్ 'వేదం'లో ఓ సన్నివేశాన్ని గుర్తుకు తెస్తుంది. ముందుగా విలన్.. ఆపై కామెడీ రోల్సే చేస్తూ వచ్చిన షాయాజీ షిండే ఎమోషనల్ టచ్ ఉన్న సీరియస్ పాత్రలో కొంచెం కొత్తగా కనిపిస్తాడు. ఆయన నటన కూడా ఆకట్టుకుంటుంది. హీరో స్నేహితుడి పాత్రలో విష్ణు ఓయ్ ఓకే. శశాంక్.. రాజు సుందరం.. దేవిశ్రీ ప్రసాద్.. వారి వారి పాత్రల్లో బాగానే చేశారు.

సాంకేతిక వర్గం:

జై క్రిష్ సినిమా కథకు.. నడతకు తగ్గట్లు టచింగ్ అనిపించే పాటలు.. బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే పాట మామూలుగా అనిపించినా.. మిగతావి కథకు తగ్గట్లుగా హృద్యంగా సాగుతాయి. నేపథ్య సంగీతం కూడా మంచి ఫీల్ తో సాగుతుంది. సన్నివేశాల్లోని గాఢతను ఇంకా పెంచేలా స్కోర్ ఇచ్చాడు జై క్రిష్. సమీర్ కళ్యాణ్ ఛాయాగ్రహణం కూడా బాగుంది. విజువల్స్ ప్లెజెంట్ ఫీలింగ్ ఇస్తాయి. నిర్మాణ విలువలు ఓకే. ఇలాంటి కథకు సపోర్ట్ చేయడం అభినందనీయం. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ అభిలాష్ కంకర తన తొలి ఫీచర్ ఫిలింతో బలమైన ముద్ర వేశాడు. 'లూజర్' తరహాలోనే అతను సినిమా కోసం కూడా ఎమోషనల్ టచ్ ఉన్న కథనే ఎంచుకున్నాడు. కానీ ఎక్కడా సెంటిమెంట్ ఓవర్ డోస్ కాకుండానే ప్రేక్షకులను చాలా చోట్ల కదిలించగలిగాడు. పాత్రలు.. వాటి మధ్య సంఘర్షణను.. కథలోని మలుపులను బాగా రాసుకుని.. తెర మీద సరిగ్గా భావోద్వేగాలు పండేలా చూసుకున్నాడు. రచయితగానే కాక దర్శకుడిగానూ అతడికి మంచి మార్కులు పడతాయి.

చివరగా: మా నాన్న సూపర్ హీరో.. సూపర్ ఎమోషన్స్

రేటింగ్-3/5