Begin typing your search above and press return to search.

పొలిమేర కలెక్షన్స్.. న్యాయం చేయాలంటూ నిర్మాత పిర్యాదు

ఈ ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన గౌరీ కృష్ణ, తనకు వచ్చిన బెదిరింపుల గురించి వివరించారు.

By:  Tupaki Desk   |   15 July 2024 2:33 PM GMT
పొలిమేర కలెక్షన్స్.. న్యాయం చేయాలంటూ నిర్మాత పిర్యాదు
X

టాలీవుడ్‌లో మరో వివాదం చెలరేగింది. ప్రముఖ నిర్మాత గౌరీ కృష్ణ తనను మరో నిర్మాత బెదిరిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవలే విడుదలైన 'మా ఊరి పొలిమేర 2' సినిమాతో గౌరీ కృష్ణ నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో, అతనికి రావాల్సిన వాటా ఇవ్వకుండా బెదిరింపులు వస్తున్నాయని ఆయన ఆరోపిస్తున్నారు.

ఈ ఉదయం హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన గౌరీ కృష్ణ, తనకు వచ్చిన బెదిరింపుల గురించి వివరించారు. ఆయన కథనం ప్రకారం, 'మా ఊరి పొలిమేర 2' సినిమాకి సంబంధించిన రైట్స్ నందిపాటి వంశీ మరియు సుబ్బారెడ్డి అనే ఇద్దరు వ్యక్తులకు అగ్రిమెంట్ ప్రకారం రాసిచ్చారట. అయితే సినిమా భారీ హిట్ కావడంతో దాదాపు 30 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయని, కానీ తనకు రావాల్సిన వాటా ఇవ్వడం లేదని, అడిగితే బెదిరిస్తున్నారని చెప్పారు.

గౌరీ కృష్ణ తన ఫిర్యాదులో, వంశీ నందిపాటి తనను కొన్నాళ్ల పాటు కాలం గడిపించి, చివరికి డబ్బులు ఇవ్వక ముందుకు వెళ్లకుండా చేశారని, అప్పుడు ఆయన వారి ఆఫీసుకు వెళ్లి డబ్బులు అడిగితే, డబ్బులు ఇవ్వబోమని, ఇంకా గట్టిగా మాట్లాడితే ప్రాణహాని కలగొద్దని బెదిరించినట్లు తెలిపారు. ఈ ఘటనతో తాను ఎంతో భయాందోళనకు గురవుతున్నానని, తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలని పోలీసులను కోరారు.

ఈ సంఘటన టాలీవుడ్‌లో కలకలం రేపింది. గౌరీ కృష్ణ ఆరోపణలు నిజమైతే, ఇది సినిమా ఇండస్ట్రీలోని నైతిక ప్రమాణాలపై తీవ్ర ఆందోళన కలిగించే విషయమని పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. సినిమా నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్‌లో జరిగే ఈ రకమైన అక్రమాలు సినిమా పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయని వారు అంటున్నారు.

గౌరీ కృష్ణకు రావాల్సిన న్యాయం జరగాలంటూ పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు పోలీసులను కోరుతున్నారు. ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. మిగిలిన నిర్మాతలు కూడా గౌరీ కృష్ణకు మద్దతు ప్రకటించడంతో ఈ వివాదం ఇంకా పెద్దదై, పోలీసుల దృష్టికి మరింతగా చేరనుంది. వంశీ నందిపాటి మరియు సుబ్బారెడ్డి ఈ ఆరోపణలపై ఇంకా స్పందించలేదు. పోలీసులు ఈ కేసు పై దర్యాప్తు మొదలుపెట్టారని సమాచారం.