Begin typing your search above and press return to search.

మాడ్ స్క్వేర్.. ఫైనల్ గా అఫీషియల్ డేట్ వచ్చేసింది

తాజాగా విడుదలైన పాటలు ‘లడ్డూ గాని పెళ్లి’ ‘స్వాతి రెడ్డి’ కూడా టాప్ ట్రెండింగ్ లిస్టులో మోత మోగిస్తుండడం విశేషం.

By:  Tupaki Desk   |   18 Jan 2025 11:24 AM GMT
మాడ్ స్క్వేర్.. ఫైనల్ గా అఫీషియల్ డేట్ వచ్చేసింది
X

మాడ్ బ్లాక్‌బస్టర్ తర్వాత ప్రేక్షకులను మళ్లీ నవ్వుల పంట పండించడానికి సిద్ధమవుతున్న చిత్రం మాడ్ స్క్వేర్. సినిమా మొదటి భాగం విడుదలై ప్రేక్షకులలో మంచి క్రేజ్ అందుకున్న తర్వాత రెండో భాగం ఎలా ఉంటుందో అనే ఉత్కంఠ ఎక్కువగా ఉంది. ఈ సినిమా ఎలాంటి టీజర్ లేకుండానే మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. తాజాగా విడుదలైన పాటలు ‘లడ్డూ గాని పెళ్లి’ ‘స్వాతి రెడ్డి’ కూడా టాప్ ట్రెండింగ్ లిస్టులో మోత మోగిస్తుండడం విశేషం.


సినిమాలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ కథనాయకులుగా కనిపించనున్నారు. ఇక ఫైనల్ గా మేకర్స్ ఈరోజు అధికారికంగా మాడ్ స్క్వేర్ విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రాన్ని మార్చి 29న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచింది. "మరింత ఫన్ మీ కోసం, మరింత మాడ్‌నెస్ మీ ఊహలకు మించినది" అని మేకర్స్ తెలిపిన మాటలే సినిమాపై ఉన్న అంచనాలను చూపించాయి.

కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఆయన తన వినూత్న కథన శైలితో కామెడీ ట్రాక్స్ తో ప్రేక్షకులను మళ్లీ మెప్పించడానికి సిద్ధమయ్యారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూర్చగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఈ సినిమాకు ఎడిటింగ్ అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇక మాడ్ స్క్వేర్ 2023లో విడుదలైన మాడ్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఒక రేంజ్ లో క్లిక్కయ్యింది. అందుకే జెట్ స్పీడ్ లో సీక్వెల్ కూడా రెడీ చేసేశారు. ఫస్ట్ పార్ట్ లో ముగ్గురు కాలేజీ స్నేహితుల సాహసాలు, వారి చుట్టూ ఉండే హాస్యాస్పదమైన పరిస్థితుల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తింది. ఇప్పుడు మాడ్ స్క్వేర్ లో వారి పర్సనల్ లైఫ్ స్టైల్ ను చూపించనున్నారు.

ముందు భాగాన్ని మించి మరింత వినోదాన్ని అందించడానికి సిద్ధంగా ఉందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదల అవుతుండగా, దీన్ని 2025 వేసవి సీజన్‌లో థియేటర్లలో పెద్ద పండుగగా మార్చాలని మేకర్స్ భావిస్తున్నారు. మరి మాడ్ స్క్వేర్ కామెడీ మళ్లీ అందరి మనసులు గెలుచుకుంటుందా? లేదా అనేది చూడాలి!