చరణ్‌కు మేడం టుస్సాడ్స్ గౌరవం.. సమ్మర్ లో అసలు సర్ ప్రైజ్
సింగపూర్‌లో ఉన్న ఈ ప్రఖ్యాత మ్యూజియంలో రామ్ చరణ్ విగ్రహం 2025 వేసవిలో సందర్శకులకు అందుబాటులోకి రానుంది.
By: Tupaki Desk | 22 Oct 2024 12:26 PM GMTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహం ఏర్పాటుతో మరో గొప్ప రికార్డును అందుకోబోతున్నాడు. సింగపూర్‌లో ఉన్న ఈ ప్రఖ్యాత మ్యూజియంలో రామ్ చరణ్ విగ్రహం 2025 వేసవిలో సందర్శకులకు అందుబాటులోకి రానుంది. ఈ వార్తను ఇటీవల అబుదాబి లో జరిగిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (IIFA) అవార్డుల వేడుకలో ప్రకటించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్‌కు "మేడం టుస్సాడ్స్ ఆఫ్ ది ఫ్యూచర్ అవార్డు" ని ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ, “మేడం టుస్సాడ్స్‌లో ప్రఖ్యాత వ్యక్తులతో నా విగ్రహం ఉంచబడుతుందనేది నా జీవితంలో ఓ గొప్ప గౌరవం. చిన్నప్పుడు ఎన్నో మైనపు విగ్రహాలు చూసి ఆశ్చర్యపోయేవాడిని. కానీ, ఇలా నా విగ్రహం కూడా అక్కడ ఉంటుందని ఊహించలేదు. సినిమాలపై నా అభిమానం, కష్టానికి ఈ గుర్తింపే అద్దం పడుతుంది. మేడం టుస్సాడ్స్‌కు ఇదే నా కృతజ్ఞతలు” అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ ప్రత్యేకతలో మరొక విశేషం ఏమిటంటే, రామ్ చరణ్ పెంపుడు కుక్క రైమ్‌ను కూడా ఈ విగ్రహంలో కవర్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు క్వీన్ ఎలిజబెత్ II తో పాటు మాత్రమే ఈ ప్రైవిలేజ్ ఉంది. "రైమ్ కూడా నా జీవితంలో ఎంతో ముఖ్యమైన భాగం. నాకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో, అదే ఈ విగ్రహంలో ప్రతిఫలిస్తుంది" అంటూ రామ్ చరణ్ చెప్పారు.
ఇక మేడం టుస్సాడ్స్ సింగపూర్ మరియు ఐఫా భాగస్వామ్యం గత కొన్నేళ్లుగా కొనసాగుతూ, భారతీయ సినిమాను అంతర్జాతీయంగా చాటిచెప్పడానికి తమ వంతు పాత్ర పోషిస్తోంది. ఈ సందర్భంగా మేడం టుస్సాడ్స్ సింగపూర్ రీజినల్ డైరెక్టర్ అలెక్స్ వార్డ్ మాట్లాడుతూ, "రామ్ చరణ్ లాంటి ప్రతిభావంతుడిని మా మ్యూజియంలో స్థానం కల్పించడం మా గర్వంగా భావిస్తున్నాం. భారతీయ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎదుగుతున్నందుకు మేము ఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తున్నాం" అని తెలియజేశారు.
ఇప్పటికే మేడం టుస్సాడ్స్ సింగపూర్ ఐఫా జోన్‌లో షారుఖ్ ఖాన్, కాజోల్, అమితాబ్ బచ్చన్ లాంటి ఇండియన్ స్టార్స్ ఉన్నారంటే రామ్ చరణ్ కూడా అదే స్థాయికి చేరుకుంటున్నారని చెప్పాలి. భారతీయ సినిమాకి గ్లోబల్‌గా గుర్తింపు రావడంలో ఇదొక ప్రత్యేక సందర్భంగా నిలిచింది. ఈ మ్యూజియం భాగస్వామ్యంలో భాగంగా అభిమానులు తమ అభిమాన హీరోల మైనపు విగ్రహాలను చూడటమే కాదు, వారి ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేయడానికి ఇదొక వేదికగా నిలుస్తోంది.