ఈ బ్యానర్ ఫార్ములా ఇండస్ట్రీకి ఆదర్శం!
ప్రజలకు అప్పటికే తెలిసిన అందమైన జానపద కథల్ని తెరపై అద్భుతంగా చూపిస్తే బ్లాక్ బస్టర్లు సరసంగా లభిస్తాయని నిరూపిస్తోంది ఈ బ్యానర్.
By: Tupaki Desk | 21 Sep 2024 3:15 AM GMTఎంపిక చేసుకునే కథలు, పాత్రలతోనే ప్రేక్షకుల మైండ్‌లో బలంగా ముద్ర వేయగలిగితే, బడ్జెట్ ఎంత పెట్టారు? స్టార్ కాస్టింగ్ ఎవరు? అన్నది పట్టించుకోరు. పఠాన్, జవాన్ లేదా దంగల్, సుల్తాన్, ధూమ్ కోసం పని చేసిన స్టార్లు ఎవరినీ సంప్రదించాల్సిన పని లేకుండానే దినేష్ విజన్ నేతృత్వంలోని మాడాక్ ఫిల్మ్స్ ఇన్నోవేటివ్ కథలు, పాత్రలతో బ్లాక్ బస్టర్లు కొడుతోంది. స్త్రీ2, జరా హాట్కే జరా బచ్కే, ముంజ్యా వంటి ఇటీవలి విజయాలు బలమైన రచన, గొప్ప పాత్రలు, అద్భుత కథలతో ప్రేక్షకులకు పిచ్చిగా నచ్చాయి. ప్రజలకు అప్పటికే తెలిసిన అందమైన జానపద కథల్ని తెరపై అద్భుతంగా చూపిస్తే బ్లాక్ బస్టర్లు సరసంగా లభిస్తాయని నిరూపిస్తోంది ఈ బ్యానర్.
చిన్న పట్టణాల్లో సాగే జానపద కథలలో హత్తుకునే ప్రత్యేకమైన పాత్రలను అభివృద్ధి చేసే మాడాక్ ఫిల్మ్స్ విధానం విజయవంతమైన ఫార్ములాగా నిరూపితమైంది. ముంజ్య, స్త్రీ, సర్కత వంటి చిరస్మరణీయ పాత్రలను సృష్టించిన వారి కళానైపుణ్యం, ప్రావీణ్యం చర్చకు వస్తోంది. రాజ్ కుమార్ రావు లాంటి చిన్న హీరోని పెద్ద స్టార్ ని చేసిన పాత్రల్ని వీరు సృజించారు. శ్రద్ధా కపూర్ లాంటి ఛామింగ్ బ్యూటీతో సెన్సిటివ్ కథలను వండి వార్చడంలోను తమ తెలివితేటలను ప్రదర్శించారు.
వందల కోట్ల పారితోషికాలు తీసుకునే స్టార్ల జోలికి వెళ్లకుండా, కాస్ట్ ఫెయిల్యూర్ బాపతు సినిమాలేవీ చేయకుండా వారు మంచి కథలు, పరిమిత బడ్జెట్ లకు సహకరించే స్టార్లను ఎంపిక చేసుకుని తెలివైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. తమ సినిమాల కథలు, పాత్రలతోనే పెద్ద స్టార్లను సృష్టించిన ఘనత మడాక్ ఫిలింస్ కి దక్కుతోంది. స్టార్ పవర్ కోసం వెంపర్లాడే చాలా మంది దర్శకనిర్మాతలకు ఇది నిజంగా కనువిప్పుగా కూడా కనిపిస్తోంది. పరిమిత బడ్జెట్ లో స్త్రీ 2 తెరకెక్కించి 550కోట్ల కలెక్షన్లు సాధించిన ఈ బ్యానర్ నైపుణ్యం ఇప్పుడు చాలా మందికి కళ్లు తెరిపించిందన్న గుసగుసా వినిపిస్తోంది.
తదుపరి పుష్ప 2 లాంటి భారీ సినిమాతో పోటీపడుతూ మడాక్ ఫిలింస్ నిర్మించిన చావా(విక్కీ కౌశల్) బరిలోకి దిగుతోంది. ఈ సంస్థకు ఉన్న ట్రాక్ రికార్డ్ దృష్ట్యా ఈ సినిమాపైనా అంచనాలు భారీగా ఉన్నాయి.