రెండేళ్ళలో ఆ సంస్థ బాక్సాఫీస్ కలెక్షన్స్ 1600 కోట్లు
బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయాల్సిన పలు స్టార్ క్యాస్ట్ భారీ ప్రాజెక్టులు కూడా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పలేదు
By: Tupaki Desk | 7 March 2025 9:30 AMఇటీవల బాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయాల్సిన పలు స్టార్ క్యాస్ట్ భారీ ప్రాజెక్టులు కూడా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పలేదు. ఈ సమయంలో మాడాక్ ఫిల్మ్స్ మాత్రం సేఫ్ బడ్జెట్స్ తో వరుసగా విజయాలను అందుకోవడం గమనార్హం. స్టార్ పవర్‌ను వదిలేసి కంటెంట్ ఆధారంగా సినిమాలను నిర్మిస్తూ, రిస్క్ లేకుండా లిమిటెడ్ బడ్జెట్‌లో భారీ లాభాలను అందిస్తోంది.
ఇప్పటివరకు మాడాక్ ఫిల్మ్స్ చేసిన వ్యూహం స్పష్టంగా చూస్తే, ముందుగా కథకు ప్రాధాన్యత ఇస్తూ, హారర్, కామెడీ, థ్రిల్లర్‌లకు, హిస్టారికల్ కథలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. స్టార్ క్యాస్ట్ లేని సినిమాలకు కూడా టాప్ నాన్ థియేట్రికల్ డీల్స్ అందుకుని, మినిమమ్ బిజినెస్ ద్వారా పెట్టుబడిని సురక్షితం చేసుకుని, థియేట్రికల్ వసూళ్లను పూర్తి లాభంగా మార్చుకుంటున్నారు. ఈ విధానం వల్లనే మాడాక్ ఫిల్మ్స్ ప్రాజెక్ట్‌లు బయ్యర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు రిస్క్‌లెస్ గేమ్‌గా మారాయి.
2024లో వచ్చిన స్త్రీ 2 సినిమా 100 కోట్ల లోపే బడ్జెట్‌లో తెరకెక్కి 874 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. హారర్ కామెడీ జానర్‌లో మళ్లీ మరో బిగ్ హిట్ కొట్టిన మాడాక్, ముంజ్యా సినిమాతో మరోసారి తమ వ్యూహాన్ని రిపీట్ చేసింది. కేవలం 30 కోట్ల బడ్జెట్‌తో తీసిన ముంజ్యా సినిమా 132 కోట్ల గ్రాస్‌ను సాధించి బాలీవుడ్‌లో మినీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ రెండు సినిమాలు కలిపి 1000 కోట్లకు పైగా వసూళ్లను నమోదు చేయడం బాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది.
ఇక 2025 ఫిబ్రవరిలో విడుదలైన ఛావా సినిమా మాడాక్ ఫిల్మ్స్‌కు మరో భారీ హిట్‌ను అందించింది. ఈ చారిత్రక యాక్షన్ డ్రామా 135 కోట్ల బడ్జెట్‌తో రూపొందగా, ఇప్పటికే 600 కోట్ల మార్క్‌ను దాటింది. ఈ సినిమా ప్రాముఖ్యత తెలుగులోనూ పెరిగి అక్కడ కూడా మంచి వసూళ్లు రాబడుతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. హిందీ మార్కెట్‌లో ఆల్రెడీ బిగ్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా, ఇతర భాషల్లోనూ బలమైన హోల్డ్ సాధించేందుకు ప్రయత్నిస్తోంది.
ఇదే తరహాలో మాడాక్ ఫిల్మ్స్ రెండు సంవత్సరాల్లో రెండు సార్లు 500 కోట్ల మార్క్‌ను దాటిన ఏకైక బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్‌గా నిలిచింది. బాలీవుడ్‌లో స్టార్ హీరోల పెద్ద సినిమాలు కూడా ఈ మార్క్‌ను దాటేందుకు కష్టపడుతుంటే, కంటెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చే మాడాక్ ఫిల్మ్స్ వరుసగా మూడు బ్లాక్‌బస్టర్లు అందించడం ట్రేడ్ అనలిస్టులను ఆశ్చర్యపరుస్తోంది. కేవలం 2 ఏళ్లలో 1600 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన మాడాక్ ఫిల్మ్స్, ఇప్పుడు 2000 కోట్ల మార్క్‌ను టార్గెట్ చేసుకుని మరిన్ని ప్రాజెక్ట్‌లను లైనప్ చేస్తోంది.
ప్రస్తుతం మాడాక్ ఫిల్మ్స్ నుంచి వచ్చే కొత్త సినిమాలపై హైప్ మరింత పెరిగింది. థామా, శక్తి శాలిని, స్త్రీ 3 సినిమాలు ఈ బ్యానర్ నుంచి రాబోతున్నాయి. వీటిలో హారర్ థ్రిల్లర్ సినిమాలు మల్టివర్స్ తరహాలో వస్తుండడం విశేషం. గత హిట్లను దృష్టిలో ఉంచుకుంటే, వీటిని కూడా హిందీ మార్కెట్‌లోనే కాకుండా, సౌత్‌లోనూ విస్తృతంగా ప్రమోట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.