Begin typing your search above and press return to search.

మ‌రో ఇంట్రెస్టింగ్ బ‌యోపిక్‌లో ఆర్.మాధ‌వ‌న్

గత సంవత్సరం ఇంజినీరింగ్ స్పెష‌లిస్ట్, ఆవిష్కర్త జిడి నాయుడు బయోపిక్ కోసం ఆర్ మాధవన్ దర్శకుడు కృష్ణకుమార్ రామకుమార్‌తో చేతులు కలిపినట్లు ప్రకటించారు.

By:  Tupaki Desk   |   11 Feb 2025 6:03 AM GMT
మ‌రో ఇంట్రెస్టింగ్ బ‌యోపిక్‌లో ఆర్.మాధ‌వ‌న్
X

అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోను బ‌యోపిక్‌ల హ‌వా కొన‌సాగుతోంది. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లో ఫిలింమేక‌ర్స్ ప్ర‌ముఖుల జీవిత క‌థ‌ల్ని ఎంపిక చేసుకుని ఉత్కంఠ‌భ‌రిత‌మైన సినిమాల‌ను రూపొందించేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు. త‌మిళంలో `రాకెట్రీ` పేరుతో ఇంత‌కుముందు ఆర్.మాధ‌వ‌న్ ఒక సైంటిస్ట్ బ‌యోపిక్ ని తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. `రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌` 2022లో విడుదలై ఘ‌న‌విజ‌యం సాధించింది. మాజీ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ నిజ జీవితంలో జరిగిన సంఘటనల‌ ఆధారంగా ఈ చిత్రాన్ని మాధ‌వ‌న్ తెర‌కెక్కించారు. మాధ‌వ‌న్ స్వ‌యంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించి, నిర్మించిన ఈ చిత్రానికి జాతీయ అవార్డ్ తో పాటు, ప‌లు అవార్డులు రివార్డులు ద‌క్కాయి. నంబి నారాయ‌ణ‌న్ పాత్ర‌లో మాధ‌వ‌న్ న‌ట‌న‌కు మంచి పేరొచ్చింది.

గత సంవత్సరం ఇంజినీరింగ్ స్పెష‌లిస్ట్, ఆవిష్కర్త జిడి నాయుడు బయోపిక్ కోసం ఆర్ మాధవన్ దర్శకుడు కృష్ణకుమార్ రామకుమార్‌తో చేతులు కలిపినట్లు ప్రకటించారు. ఈ చిత్రం అంతర్జాతీయ షెడ్యూల్‌తో సెట్స్‌కు వెళ్లగా, భార‌తీయ లొకేష‌న్ల‌లో కొత్త‌ షెడ్యూల్ వచ్చే వారం జిడి నాయుడు జన్మస్థలమైన కోయంబత్తూరులో ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని మ్యాడీ స‌మ‌ర్ప‌ణ‌లో, `రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌` నిర్మాత‌ల్లో ఒక‌రైన‌ వర్గీస్ మూలన్ పిక్చర్స్ - ట్రైకలర్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ బ్యాన‌ర్ల‌లో రెండవ వెంచర్ కోసం మరొక బయోపిక్‌ను నిర్మిస్తున్న క్ర‌మంలో నిర్మాత విజయ్ మూలన్ త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేసారు.

రాకెట్రీ తర్వాత మా తదుపరి ప్రాజెక్ట్ కోసం వెతుకుతున్న క్ర‌మంలో, మాకు బలమైన ఫాలోఅప్ కావాలనుకున్నామ‌ని మేక‌ర్స్ తెలిపారు. ఈ కథ మాధవన్‌కు బాగా నచ్చింది. ఇది గొప్ప చిత్రం అయ్యే అవకాశం ఉందని కూడా మేం భావించాం. జిడి నాయుడును భారతదేశపు ఎడిసన్, కోయంబత్తూర్ సంపద సృష్టికర్త అని పిలుస్తారు. ఈ కథను సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ల‌డం ప్రేర‌ణ‌గా నిలుస్తుంద‌ని భావిస్తున్న‌ట్టు నిర్మాత‌లు తెలిపారు.

జిడి నాయుడు వ్యక్తిత్వం స్ఫూర్తిదాయకం. ఆయ‌న ధృఢ నమ్మకాలు, స్థిర‌మైన ఆలోచ‌న‌లు, నిర్ణయాలలో అతడి అచంచలమైన వైఖరి గొప్ప‌వి. అతడు లంచానికి వ్యతిరేకంగా గట్టిగా ఉండేవాడు. లోతైన దేశభక్తి, అపారమైన ఆలోచ‌న‌లు ఉన్న వ్యక్తి. అతడు ఎప్పుడూ చలించలేదు.. ఏం జ‌రిగినా సరే తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.. అని మేక‌ర్స్ వెల్ల‌డించారు. భారతదేశంలో ఈ పాత్ర కోసం ఆర్.మాధవన్ ఉత్తమ ఎంపిక అని నిర్మాత‌ విజయ్ అన్నారు. ఈ బయోపిక్ కోసం దర్శకుడు కృష్ణకుమార్ ఆలోచ‌న‌ గురించి మాట్లాడుతూ అత‌డు క‌థ‌ను వినిపించిన త‌ర్వాత‌ మా న‌మ్మ‌కం పెరిగింద‌ని అన్నారు. రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ సాంకేతిక బృందం ఈ బయోపిక్ కోసం ప‌ని చేస్తుంద‌ని కూడా విజయ్ వెల్లడించాడు.

ఆర్ మాధవన్ - సరితా మాధవన్ ఈ చిత్రాన్ని ట్రైకలర్ పిక్చర్స్ బ్యానర్‌పై విజయ్ మూలన్‌తో కలిసి నిర్మిస్తున్నారు. అరవింద్ కమలనాథన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా అలాగే సృజనాత్మక నిర్మాతగా వ్యవహరిస్తారు. బ‌యోపిక్ టైటిల్ ఫిబ్రవరి 18న ఆవిష్కరించ‌నున్నారు. ఇత‌ర వివరాలు త్వరలో వెల్ల‌డించ‌నున్నారు.