Begin typing your search above and press return to search.

లొకేష‌న్‌లో డ్రెస్ మార్చుకుంటే ఎవ‌రో చూసేవారు!

90లలో నటీమణులు ఆరుబయట దుస్తులు మార్చుకోవాల్సి వ‌చ్చేద‌ని.. ఆ స‌మ‌యంలో ఎవరు చూస్తున్నారో తెలియదని మ‌ధుబాల వ్యాఖ్యానించారు.

By:  Tupaki Desk   |   19 May 2024 11:38 AM GMT
లొకేష‌న్‌లో డ్రెస్ మార్చుకుంటే ఎవ‌రో చూసేవారు!
X

మ‌ణిర‌త్నం 'రోజా' చిత్రంలో అద్భుత న‌ట‌న‌కు జాతీయ అవార్డ్ అందుకున్న మ‌ధుబాల‌.. ఆ త‌ర్వాత టాలీవుడ్, కోలీవుడ్ స‌హా హిందీ చిత్ర‌సీమ‌లో ఎన్నో విజ‌యవంత‌మైన చిత్రాల్లో న‌టించారు. కెరీర్ ఆద్యంతం తాను ఆరు భాష‌ల్లో న‌టించాన‌ని, పెళ్లి త‌ర్వాత సినిమాలు వ‌దిలేసినా కానీ ఇప్పుడు ఆరేడేళ్లుగా న‌టిగా బిజీగా ఉన్నాన‌ని మ‌ధుబాల తెలిపారు. అయితే నాటితో పోలిస్తే, ఇప్పుడు సెట్లో ఆడ‌వారికి సౌక‌ర్యాలు ఎంత‌గా మెరుగ‌య్యాయో కూడా వెల్ల‌డించారు.

90లలో నటీమణులు ఆరుబయట దుస్తులు మార్చుకోవాల్సి వ‌చ్చేద‌ని.. ఆ స‌మ‌యంలో ఎవరు చూస్తున్నారో తెలియదని మ‌ధుబాల వ్యాఖ్యానించారు. మ‌ధూ ప్ర‌స్తుతం న‌టిగా తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ఆస్వాధిస్తోంది. తనకు నచ్చే పాత్రలను పోషిస్తోంది. ఫూల్ ఔర్ కాంటే, రోజా వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలలో అద్భుత‌ పాత్రలతో మెప్పించిన మ‌ధూ ఇటీవల కంగనా రనౌత్‌తో 'తలైవి', సమంతా రూత్ ప్రభుతో 'శాకుంతలం' చిత్రాలలో నటించింది.

నాటితో పోలిస్తే నేడు పరిశ్రమలో వచ్చిన మార్పుల గురించి మ‌ధూ మాట్లాడారు. ద‌శాబ్ధాలుగా ప‌రిశ్ర‌మ ఎలా అభివృద్ధి చెందిందో.. సౌక‌ర్యాలు ఎంతగా మెరుగ‌య్యాయో మధూ వెల్లడించారు. వ్యానిటీ వ్యాన్ వంటి కనీస సౌకర్యాలు లేకపోవడంతో నాటి రోజుల్లో నటీమణులు ఎదుర్కొన్న సవాళ్లను ఆమె గుర్తు చేసుకున్నారు. తమిళ చిత్రాలను రిమోట్ లొకేషన్‌లలో చిత్రీకరించడం అంటే ప్రకృతిపై ఆధార‌ప‌డ‌టం అని, త‌ప్ప‌ని పరిస్థితులలో లొకేష‌న్‌లోనే దుస్తులను మార్చుకోవ‌డం వంటి వాటిపైనా మ‌ధూ ఓపెనైంది. మీడియాతో మాట్లాడుతూ.. ఆరోజులు చాలా క‌ష్టంగా ఉండేవని మ‌ధూ అన్నారు. నేను ఎర్ర గుహలలో, కొలాచిలో తమిళ చిత్రాల షూటింగులు చేస్తున్నాను. ఆరోజుల్లో షూట్ స‌మ‌యాల్లో ఆరుబ‌య‌ట స్థ‌లాన్ని మ‌రుగుదొడ్డిగా భావించాల్సి వ‌చ్చేది. కొండ ప్రాంతాలు, చెట్ల క్రింద కూర్చొని... అది చాలా ఇబ్బందికరమైన సమయం. అంత‌ వేడిలో డ్యాన్స్ చేయడానికి మనం వేసుకునే బట్టలు... ఆపై ఆ బట్టల నుండి బయట పడేందుకు తంటాల‌ను గుర్తు చేసుకోలేను. బ‌ట్ట‌లు మార్చుకునేప్పుడు ఎవరు చూస్తున్నారో మాకు తెలియదు.. అప్పుడు చాలా కష్టంగా ఉండేది.. అని మ‌ధూ తెలిపారు.

మణిరత్నం -ఇరువర్ షూటింగ్ సమయంలో తమిళనాడులోని ఒక మారుమూల ప్రదేశంలో షూటింగ్ జరుగుతోంది. విశ్రాంతి తీసుకోవడానికి ఎక్కడా చోటు లేనందున తాను రాళ్లపై నిద్రించవలసి వచ్చిందని కూడా మధు గుర్తు చేసుకున్నారు. ఈ రోజుల్లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని అన్నారు. ఇప్పుడు అంత ఇబ్బంది లేదు. మ‌న‌కు మేకప్ కోసం వ్యాన్ కావాలని అడ‌గొచ్చు, గోప్యతకు అవ‌కాశం ఉంది. ఒకప్పుడు నేను మణిరత్నం సర్‌తో ఇరువార్ (1997) షూటింగ్‌లో ఉన్నాను. మేము తమిళనాడులో ఎక్కడో ఓ లొకేష‌న్ లో షూటింగ్ చేస్తున్నాము. నాకు ఆ స్థలం సరిగ్గా గుర్తులేదు. కానీ నేను భోజనం చేసి బ్రేక్ టైమ్‌లో అక్కడ రాళ్లపై పడుకున్నాను. నేను బండ మీద పడుకున్నాను.. ''అంత డబ్బు సంపాదించి ఏం లాభం? ఆమె రాళ్ల మీద పడుకోవలసిన పనిలేదు!! అని ఎవ‌రో అన‌డం విన్నాను. మహిళా నటీమ‌ణుల‌కు ఆ రోజులు కష్టంగా ఉండేది అని మ‌ధూ అన్నారు.

నా కోసం నేను కనుగొన్నది ఏమిటంటే.. నాకు స్టేజ్ ఉన్నా లేకపోయినా నేను ఎప్పుడూ న‌టినే. కాబట్టి మంచి నటిగా ఎదగడానికి ప్రతిరోజూ నన్ను నేను సిద్ధం చేసుకుంటాను అని మ‌ధుబాల అన్నారు. శ్రేయాస్ తల్పాడేతో మధు నటించిన తాజా చిత్రం కర్మమ్ భుగ్తం ఇప్పుడు థియేటర్లలో రన్ అవుతోంది.