అక్క స్టార్‌డమ్ తమ్ముడి కంట్లో నలుసు
ప్రియాంక చోప్రా అకస్మాత్తుగా ప్రపంచ వేదికపైకి రావడం ఆమె కుటుంబానికి పెద్ద పేరు తేవడం కంటే ఎక్కువ ఇబ్బందులను తెచ్చిపెట్టింది.
By: Tupaki Desk | 3 Dec 2024 3:30 AM GMTగ్లోబల్‌స్టార్ గా ఓ వెలుగు వెలుగుతోంది ప్రియాంక చోప్రా. అందాల పోటీలో నెగ్గి.. ఒక మోడల్ గా కెరీర్ ప్రారంభించి .. నటిగా ఇంతింతై అన్న చందంగా ఎదిగిన పీసీ అద్భుతమైన ప్రయాణం అందరిలో స్ఫూర్తి నింపుతుంది. కెరీర్ లో జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, తనవైపు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, ప్రతిభతో దూసుకుపోయిన మేటి నటిగా ప్రియాంక చోప్రాకు గుర్తింపు ఉంది. పరిశ్రమలో అగ్ర హీరోలకు ధీటుగా పారితోషికం అందుకుంటున్న ప్రియాంక చోప్రా నేడు ఈ స్థాయికి రావడం సరే కానీ... అది తన కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు తెచ్చిందో తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు.
ప్రియాంక చోప్రా అకస్మాత్తుగా ప్రపంచ వేదికపైకి రావడం ఆమె కుటుంబానికి పెద్ద పేరు తేవడం కంటే ఎక్కువ ఇబ్బందులను తెచ్చిపెట్టింది. తన సోదరుడు సిద్ధార్థ్ కి ఇది ఇబ్బందిగా పరిణమించింది. తన యుక్తవయస్సును ఎక్కువగా ఒంటరిగా గడిపిన సిద్ధార్థ్ చోప్రా .. ప్రియాంక స్టార్‌డమ్‌కు `కొలేటరల్ డ్యామేజ్` బాధితుడని ఆమె తల్లి మధు చోప్రా పేర్కొంది. పీసీ కెరీర్ పై తాను దృష్టి సారించడం వల్ల సిద్ధార్థ్ కి తాను ఏమీ చేయలేకపోయానని గుర్తు చేసుకున్నారు. అతడి కెరీర్ పథంపై తనకు దృష్టి సారించే అవకాశం లేకపోయిందని మధు చోప్రా ఆవేదనను వ్యక్తం చేసారు. ఇటీవలే అతడికి నీలం ఉపాధ్యాయతో పెళ్లి కుదిరింది. ఇంకా అతడు తన స్టాటస్ ని పెంపొందించుకునే దశలోనే ఉన్నాడని మధు చోప్రా వెల్లడించారు.
మధూ చెప్పిన విషయాలను బట్టి తన సోదరి కెరీర్ పథంలో ఉత్తమ స్థితిని అందుకోవడానికి సిద్ధార్థ్ తనను తాను కోల్పోవాల్సి వచ్చిందని అర్థం చేసుకోగలం. అయితే లక్షలాదిగా ప్రజలు ప్రియాంక చోప్రాను తమకు మార్గదర్శకురాలిగాను, ఆదర్శంగాను భావిస్తున్నారు. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి, గ్లోబల్ ఐకన్ గా అంత గొప్ప విజయం సాధించడం చిన్న విషయం కాదు. పీసీ అజేయంగా ఎదుగుతూ ఉంటే దాంతో పాటే తన సోదరుడు సిద్ధార్థ్ చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. పీసీ తల్లిగారైన మధు చోప్రా కూడా తన కుమార్తె కోసం ఎన్నో త్యాగాలు చేసారు.