Begin typing your search above and press return to search.

హీరోయిన్ నికర‌ ఆస్తులు 250 కోట్లు.. టాప్-5 బ్రాండ్ల‌తో సంప‌ద‌!

తన సంపదను 5 విజయవంతమైన బ్రాండ్లలో పెట్టుబడిగా పెట్టిన మాధురి త‌ద్వారా భారీగా ఆదాయాన్ని ఆర్జించారు

By:  Tupaki Desk   |   6 Nov 2024 11:30 AM GMT
హీరోయిన్ నికర‌ ఆస్తులు 250 కోట్లు.. టాప్-5 బ్రాండ్ల‌తో సంప‌ద‌!
X

మేటి క‌థానాయిక‌.. భార‌త‌దేశ‌పు అత్యుత్త‌మ‌ డ్యాన్సింగ్ క్వీన్.. వ్యాపార రంగంలో అత్యంత విజ‌య‌వంత‌మైన మ‌హిళా ఎంట‌ర్ ప్రెన్యూర్.. ఆమె ఎవ‌రో చెప్ప‌గ‌ల‌రా? 250 కోట్ల నికర ఆస్తుల‌తో స‌క్సెస్ ఫుల్ బిజినెస్ ఉమెన్ గా పాపుల‌రైన ఆ న‌టి మ‌రెవ‌రో కాదు.. లెజెండ‌రీ క‌థానాయిక‌ మాధురీ దీక్షిత్.


తన సంపదను 5 విజయవంతమైన బ్రాండ్లలో పెట్టుబడిగా పెట్టిన మాధురి త‌ద్వారా భారీగా ఆదాయాన్ని ఆర్జించారు. ఈ వెట‌ర‌న్ న‌టి సొంత కంపెనీలు, వ్యాపారాల గురించి తెలుసుకుంటే ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌హిర్గ‌త‌మ‌య్యాయి.

ఇటీవ‌లే అనీస్ బజ్మీ తెర‌కెక్కించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `భూల్ భూలైయా 3`లో న‌టించారు మాధురి ధీక్షిత్. కార్తీక్ ఆర్యన్, విద్యాబాలన్ , ట్రిప్తి డిమ్రీతో కలిసి కీల‌క పాత్ర‌లో న‌టించిన‌ మాధురీ దీక్షిత్ తాజా విజ‌యాన్ని ఆస్వాధిస్తున్నారు. అయితే న‌టిగా డ్యాన్సింగ్ క్వీన్ గా మాధురికి ఉన్న పేరు ఒకెత్తు అనుకుంటే, తాను వ్యాపార రంగంలో తెలివైన పెట్టుబ‌డుల‌తోను ఆక‌ర్షిస్తున్నారు.

స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టడం నుండి ప్రొడక్షన్ హౌస్‌ని నడిపే వరకు 57 ఏళ్ల మాధురి వివిధ వ్యాపార రంగాలలో విజయాన్ని సాధించారు. నటన, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లతో పాటు విభిన్న ఆదాయ వనరులు భారీ నికర ఆస్తుల ఆర్జ‌న‌కు స‌హ‌క‌రించాయి. మాధురి ధీక్షిత్ నిక‌ర ఆస్తుల విలువ‌ సుమారు రూ. 250 కోట్లుగా ఉంటుంద‌ని అంచనా.

మాధురీ దీక్షిత్ తన సంపదను 5 విజయవంతమైన బ్రాండ్లలో పెట్టుబడి పెట్టింది. మాధురీ దీక్షిత్ యాజమాన్యంలో ఉన్న బ్రాండ్‌లు లేదా కంపెనీల వివ‌రాలు ఆస‌క్తిక‌రం...

*మాధురీ దీక్షిత్ 2018లో నిర్మాతగా మారి సినీరంగంలో పెట్టుబ‌డులు పెట్టారు. తన భర్త డాక్టర్ శ్రీరామ్ నేనేతో కలిసి RnM మూవింగ్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ జంట తమ బ్యానర్‌పై రెండు మరాఠీ సినిమాలను నిర్మించారు. 15 ఆగస్టు (2019), పంచక్ (2024) అనే చిత్రాల్ని నిర్మించారు. మునుముందు హిందీ చిత్రాలను నిర్మించ‌నున్నార‌ని తెలుస్తోంది.

*2013లో మాధురీ దీక్షిత్ తన సొంత ఆన్‌లైన్ డ్యాన్స్ అకాడమీ `డాన్స్ విత్ మాధురి` పేరుతో ప్రారంభించారు. ఇది ఔత్సాహిక యువ‌త‌రానికి వివిధ నృత్య రూపాలను నేర్చుకునే అవకాశాన్ని క‌ల్పిస్తుంది. ఔత్సాహిక విద్యార్థుల‌కు శిక్ష‌ణను అందించే కార్య‌క్ర‌మ‌మిది.

*ప‌లు జాతీయ మీడియాల క‌థ‌నాల ప్ర‌కారం.. మాధురీ దీక్షిత్ - డాక్టర్ శ్రీరామ్ నేనే ఫిట్‌నెస్ బ్యాండ్‌లను విక్రయించే ప‌ర్స‌న‌ల్ హెల్త్ కోచింగ్‌ను అందించే GOQii ఆన్‌లైన్ ఫిట్‌నెస్ ప్లాట్‌ఫామ్‌లో భారీ మొత్తాన్ని పెట్టుబడి పెట్టారు. పెట్టుబడిదారుల జాబితాలో సీగేట్ ఛైర్మన్ స్టీవ్ లుక్జో, ఫ్లెక్స్‌ట్రానిక్స్ CEO మైక్ మెక్‌నమారా, అమిత్ సింఘాల్ - గూగుల్ ఐఎన్‌సిలో సీనియర్ వీపీ స‌హా ఇతరులు ఉన్నారు.

* విద్యార్థుల కోలివింగ్ హాస్ట‌ల్స్ నిర్వ‌హ‌ణ‌లోను మాధురి పెట్టుబ‌డి దారు. హౌసింగ్ బ్రాండ్ అయిన హైవ్ హాస్టల్స్‌ని నిర్వహిస్తున్న కోల్‌స్టే ప్రైవేట్ లిమిటెడ్ వ్య‌వ‌స్థాప‌కులు. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రైవేట్ ప్లేస్‌మెంట్ రౌండ్ ద్వారా రూ. 11.5 కోట్లను సేకరించి పెట్టుబ‌డిగా పెట్టారు. మనీకంట్రోల్ వివ‌రాల ప్రకారం.. నటీమణులు మాధురీ దీక్షిత్- అమృత రావు ప్రైవేట్ పెట్టుబడి దారులుగా ఉన్నారు. 2019లో భరత్ అగర్వాల్, సిద్ధార్థ్ అగర్వాల్ సంయుక్తంగా స్థాపించిన ఈ సంస్థ FY24లో రూ. 40.73 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది.

*పాపుల‌ర్ ఫుడ్ డెలివ‌రీ సంస్థ‌- స్విగ్గీలోను మాధురి పెట్టుబ‌డులు ఉన్నాయి. మనీకంట్రోల్ నివేదిక ప్రకారం.. సెప్టెంబర్ 2024లో మాధురీ దీక్షిత్ , ఇన్నోవ్ 8 వ్యవస్థాపకుడు రితేష్ మాలిక్ స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించడానికి ముందు సెకండరీ మార్కెట్ నుండి రూ. 3 కోట్ల విలువైన స్విగ్గీ షేర్లను కొనుగోలు చేశారు. అంతేకాకుండా, ఆన్‌లైన్ ఫుడ్ అండ్ గ్రోసరీ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లో సమాన వాటాదారులుగా మారడానికి వారు ఒక్కొక్కరు రూ. 1.5 కోట్లు పెట్టుబడి పెట్టారని కూడా క‌థ‌నాలొచ్చాయి.

న‌టిగా కొన‌సాగుతూనే మాధురి త‌న వ్యాపారాల‌ను నిర్వ‌హిస్తుండ‌డం మ‌రో కొస‌మెరుపు. సినీరంగంలోని స‌హ‌చ‌ర న‌టి జూహీ చావ్లా 4600 కోట్ల నిక‌ర ఆస్తుల‌తో భార‌త‌దేశంలోనే నం.1 ధ‌నికురాలైన సెల‌బ్రిటీగా కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. షారూఖ్ ఖాన్ త‌ర్వాత అంత పెద్ద ఎంపైర్ ని న‌డిపించే బిజినెస్ ఉమెన్ గా జూహీ చావ్లా పేరు మార్మోగుతోంది.