Begin typing your search above and press return to search.

బైబిల్ పేరుతో చీప్ ప్ర‌చారం.. హీరోయిన్‌కి హైకోర్టు నోటీసులు!

నెటిజ‌నులు స‌ద‌రు హీరోయిన్ క‌మ‌ర్షియ‌ల్ మైండ్ సెట్ పై విరుచుకుప‌డుతున్నారు.

By:  Tupaki Desk   |   11 May 2024 5:12 PM GMT
బైబిల్ పేరుతో చీప్ ప్ర‌చారం.. హీరోయిన్‌కి హైకోర్టు నోటీసులు!
X

పుస్త‌కానికి 'ప్రెగ్నెన్సీ బైబిల్' అనే టైటిల్ పెట్ట‌డంపై హైకోర్ట్ సీరియ‌స్ అయింది. ఇది స్టార్ హీరోయిన్ కి చిక్కులు తెచ్చి పెట్టింది. నెటిజ‌నులు స‌ద‌రు హీరోయిన్ క‌మ‌ర్షియ‌ల్ మైండ్ సెట్ పై విరుచుకుప‌డుతున్నారు. ఇంత‌కీ ఎవ‌రా స్టార్ హీరోయిన్.. వివ‌రాల్లోకి వెళితే..


ఈ ఎపిసోడ్‌లో స్టార్ హీరోయిన్ బెబో క‌రీనాక‌పూర్ ఖాన్. ప‌టౌడీ సంస్థాన అధినేత, బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ భార్య‌. క‌రీనా ఇప్పుడు త‌న ఫ్రెగ్నెన్సీపై ఒక పుస్త‌కాన్ని ర‌చించి మార్కెట్లోకి రిలీజ్ చేసింది. అయితే ఈ ప్రెగ్నెన్సీ మెమోయిర్‌కు 'బైబిల్' పేరు పెట్టినందుకు కరీనా కపూర్ ఖాన్‌కు హైకోర్టు నోటీసులు పంపింది. ''కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబిల్‌'' అని టైటిల్ పెట్ట‌డంతో కరీనా కపూర్ ఖాన్‌కు మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసు జారీ చేసింది. పుస్తకం టైటిల్‌లో బైబిల్ అనే పదాన్ని ఉపయోగించడాన్ని వ్యతిరేకిస్తూ క్రిస్టోఫర్ ఆంథోనీ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా కోర్టు నోటీసు జారీ చేసింది.

జాతీయ మీడియా క‌థ‌నం ప్రకారం.. కరీనా కపూర్ ఖాన్‌తో పాటు పుస్తక విక్రయదారు అయిన అమెజాన్‌పై కేసు నమోదు చేయాలంటూ న్యాయవాది క్రిస్టోఫర్ ఆంథోనీ పిటిషన్ వేయ‌గా, దానిపై విచారిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టులోని జస్టిస్ గుర్పాల్ సింగ్ అహ్లూవాలియా సింగిల్ జడ్జి బెంచ్ నోటీసు జారీ చేసింది. టైటిల్‌లో 'బైబిల్' అనే పదాన్ని ఎందుకు ఉపయోగించారనే దానిపై కోర్టు క‌రీనా నుండి సమాధానం కోరింది. పుస్తక విక్రయంపై నిషేధం విధించాలని తన పిటిషన్‌లో న్యాయవాది ఆంథోనీ డిమాండ్ చేసారు. ''క్రైస్తవ మతంలో పవిత్ర గ్రంథం పేరు బైబిల్.. అందుకే ఈ ప‌ని చేసిన వారిపై స‌మాజంలో చాలా కోపం ఉంది'' అని కరీనా, పుస్తక విక్రేతనుద్ధేశించి అత‌డు వ్యాఖ్యానించారు. బెబోకు ప్రత్యుత్తరం ఇవ్వడానికి 1 జూలై 2024 వరకు కోర్టు సమయం ఇచ్చింది.

పుస్తకం టైటిల్‌లో బైబిల్ అనే పదాన్ని ఉపయోగించడం క్రైస్తవ సమాజం మనోభావాలను దెబ్బతీసేలా ఉందని జబల్‌పూర్‌కు చెందిన సామాజిక కార్యకర్త ఆంథోనీ తన పిటిషన్‌లో ఆరోపించారని కూడా తాజా క‌థ‌నంలో వెల్ల‌డైంది.

బైబిల్ ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ మతం తాలూకా పవిత్ర గ్రంథం. కరీనా కపూర్ ఖాన్ గర్భాన్ని బైబిల్‌తో పోల్చడం తప్పు! అని ఆంటోనీ పిటిషన్ లో పేర్కొన్నారు. తన పుస్తకానికి చౌకగా ప్రచారం పొందేందుకు క‌రీనా ఈ పదాన్ని ఉపయోగించారని ఆంథోనీ ఆరోపించారు. నిజానికి అత‌డు ముందుగా క‌రీనాపై ఎఫ్ఐఆర్ (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) దాఖలు చేయడానికి ప్రయత్నించాడు. అయితే మధ్యప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేయడానికి నిరాకరించారు.

టైటిల్‌లో 'బైబిల్' అనే పదాన్ని ఉపయోగించడం ఎంత అభ్యంతరకరంగా ఉందో వివ‌ర‌ణ ద్వారా నిర్ధారించడంలో అతడు (పోర్ష‌న‌ర్‌) విఫలమయ్యాడని గమనించినందున దిగువ కోర్టు తిరస్కరించింది. అడిషనల్ సెషన్స్ కోర్టులో అతడి పిటిషన్ ని మళ్లీ తిరస్కరించింది. పిటిషనర్ మొదట క‌రీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయడానికి నిరాకరించడంతో అత‌డు ఫిర్యాదు చేయడానికి దిగువ కోర్టును ఆశ్రయించాడు.