Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : మ్యాడ్

By:  Tupaki Desk   |   6 Oct 2023 1:00 PM GMT
మూవీ రివ్యూ : మ్యాడ్
X

'మ్యాడ్' మూవీ రివ్యూ

నటీనటులు: సంగీత్ శోభన్-నార్నె నితిన్-రామ్ నితిన్- శ్రీగౌరీ ప్రియా రెడ్డి-అనంతిక-గోపిక ఉద్యాన్-రఘుబాబు- రచ్చ రవి- మురళీధర్ గౌడ్- అనుదీప్ కేవీ తదితరులు

సంగీతం: భీమ్స్ సిసిరోలియో

ఛాయాగ్రహణం: శ్యామ్ దత్-దినేశ్ కృష్ణన్

నిర్మాత: సూర్యదేవర నాగవంశీ

రచన-దర్శకత్వం: కళ్యాణ్ శంకర్

ఈ మధ్య కాలంలో యువత దృష్టిని బాగా ఆకర్షించిన చిన్న చిత్రం 'మ్యాడ్'. పన్నీగా క్రేజీగా అనిపించిన ట్రైలర్ తో ఈ సినిమా యువ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది. ఈ రోజే మంచి అంచనాల మధ్య విడుదలైన 'మ్యాడ్'.. ఆ అంచనాలను ఏమేర అందుకుందో చూద్దాం పదండి.

కథ:

మనోజ్ (రామ్ నితిన్).. అశోక్ (నార్నె నితిన్).. దామోదర్ (సంగీత్ శోభన్).. ముగ్గురూ అప్పుడే ఇంజినీరింగ్ కాలేజీలో చేరిన కుర్రాళ్లు. ముగ్గురిదీ భిన్నమైన మనస్తత్వాలు. అయినా ముగ్గురూ క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారు. వీళ్ల పేర్లలోని మొదటి అక్షరాలను కలిపి వీరిని 'మ్యాడ్' గ్యాంగ్ అని పిలుస్తారు. అందుకు తగ్గట్లే ఉంటాయి వాళ్లు చేసే పనులు కూడా. ఈ ముగ్గురికీ ముగ్గురు అమ్మాయిలతో కనెక్షన్ ఏర్పడుతుంది. ఆ రిలేషన్లలో కొన్ని సమస్యలు కూడా ఉంటాయి. ఇంజినీరింగ్ పూర్తయ్యేలోపు ఈ ముగ్గురి ప్రయాణం ఎలా సాగిందన్నదే ఈ కథ.

కథనం-విశ్లేషణ:

మ్యాడ్.. నిజంగా పేరుకు తగ్గ సినిమానే. ఇందులో సగటు సినిమా రూల్స్ ఏమీ ఉండవు. చెప్పుకోదగ్గ కథ ఉండదు. కథనం విషయంలోనూ ఒక పద్ధతి అంటూ ఏమీ కనిపించదు. కథకు ఒక ఆరంభం.. మధ్యమం.. ముగింపు అంటూ సంప్రదాయ తరహాలో ఏమీ కనిపించవు. జస్ట్ ఈ సినిమాలో ఉన్నదంతా కామెడీ సీన్లే. ఈ తరం యువత ఆలోచనలు.. అభిరుచులకు తగ్గట్లుగా కాలేజీ నేపథ్యంలో సాగిపోయే ఫన్నీ మూమెంట్స్ నే సినిమాగా తీసేశాడు కళ్యాణ్ శంకర్. ఇలాంటి కాలేజీ కథలు కొత్త కాదు. ఇందులోని సీన్లు కూడా మరీ కొత్తగా ఏమీ అనిపించవు. కానీ ఇంతకుముందు చూసిన కాలేజీ సినిమాలకు దీనికి ఉన్న తేడా ఏంటంటే.. ఇందులో డ్రామా.. ఎమోషన్లు లాంటి అంశాలకు చోటే లేదు. సిచువేషన్ ఎంత సీరియస్ అయినా సరే.. అందులోంచి కామెడీ పండించడం.. పంచులు విసరడమే లక్ష్యంగా సాగుతాయి సన్నివేశాలు. ఎక్కువ ఆలోచించకుండా.. ఏదీ సీరియస్ గా తీసుకోకుండా.. ఆ సమయానికి నవ్వామా.. ఎంజాయ్ చేసి వదిలేశామా అన్నట్లుంటుంది 'మ్యాడ్'. అందుకు తగ్గట్లే సినిమా అయ్యాక పెద్దగా గుర్తుంచుకునేంత ఇంపాక్ట్ ఏమీ ఈ సినిమా వేయదు. యూత్ రెండు గంటలు టైంపాస్ చేయడానికి మాత్రం ఢోకా లేని సినిమా ఇది.

కాలేజీ నేపథ్యం అనగానే తెలుగులో అందరికీ 'హ్యాపీ డేస్' గుర్తుకొస్తుంది. అలాగే హిందీలో బలమైన ఇంపాక్ట్ వేసిన సినిమా 'త్రీ ఇడియట్స్'. వీటి స్ఫూర్తితో పలు భాషల్లో అనేక చిత్రాలు వచ్చాయి. 'మ్యాడ్' కూడా దాదాపుగా అలాంటి సినిమానే. 'త్రీ ఇడియట్స్'లో చూసిన ర్యాగింగ్ సీన్.. హాస్టళ్లలో అల్లర్లు.. 'హ్యాపీడేస్'లో చూసిన క్రికెట్ మ్యాచ్ ఎపిసోడ్.. అమ్మాయిలు-అబ్బాయిల ప్రేమ వ్యవహారాలు.. ఇందులోనూ చూడొచ్చు. ఈ రెండు చిత్రాల నుంచే కాక చాలా సినిమాల నుంచి ఏరుకొచ్చినట్లుగా సన్నివేశాలు కనిపిస్తాయి.

కానీ దీని ప్రత్యేకత దీనిదే అంటూ ట్రెండీగా అనిపించే ఫన్ ఈ సినిమాను భిన్నంగా నిలబెడుతుంది. ఒక సీన్లో కాలేజీలో అల్లరి చేసిన తన కొడుకును మందలించడానికి తండ్రి వస్తాడు. సిచువేషన్ సీరియస్ గా మారిన సమయంలో ఉన్నట్లుండి వెళ్లొస్తా అని వెళ్లిపోతాడు. ఏంటి ఆయన అలా వెళ్లిపోయాడు అని అడిగితే.. ''మా ఊరికి లాస్ట్ బస్ పదకొండున్నరకే'' అని సమాధానం వస్తుంది. ఇక ఇంటర్వెల్ ముంగిట హీరోల్లో ఒకరు తాను కోరుకున్న అమ్మాయి రాలేదని చాలా బాధపడుతుంటే.. ఇంకో పాత్ర వచ్చి ఈ సమయంలో అడగొచ్చో లేదో మనోడు వైన్ షాపు దగ్గరున్నాడట, నీకేమైనా తేవాలాా అంటే ఆ హీరో సీరియస్ గాచూసి ''బాధలో ఉన్నా. బీర్ తాగుతా అని తెల్వదా'' అంటాడు. ఇలా సందర్భం ఎలాంటిదైనా కూల్ అన్నట్లుగా వచ్చి పడే పంచులు ఈ సినిమాను ముందుకు నడిపిస్తాయి. యువ ప్రేక్షకులను వినోదంలో ముంచెత్తుతూ సినిమా చకచకా సాగిపోతుంది. ఎక్కడా కూడా కథ గురించి కానీ.. తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ కానీ కనిపించదు. ఒకదాంతో ఒకటి సంబంధం లేకుండా సన్నివేశాలు వస్తుంటాయి వెళ్తుంటాయి. అవి వినోదాన్ని పంచడం వల్ల మిగతా విషయాల గురించి ఏమీ ఆలోచించకుండా ఎంజాయ్ చేస్తూ సాగిపోతాం. 'జాతిరత్నాలు'లో మాదిరి నాన్ సింక్ డైలాగులు.. పంచులతో దర్శకుడు సినిమాను నడిపించుకుంటూ ముందుకు వెళ్లిపోయాడు. సినిమా నిండా చాలా వరకు అందులో మాదిరి తింగరి క్యారెక్టర్లే కనిపిస్తాయి. లడ్డు లాంటి పాత్రలు కావాల్సినంత వినోదం పంచుతాయి. హీరోల్లో కూడా ఇద్దరు మంచి కామెడీ డోస్ ఇచ్చారు. ప్రేమకథలో పెద్దగా ఫీల్ లేకపోవడం.. ఎమోషన్.. డ్రామా లాంటి అంశాలకు చోటు లేకపోవడం వల్ల 'మ్యాడ్' ఎక్కువ కాలం గుర్తుంచుకోదగ్గ సినిమాలా నిలవలేకపోయింది. కానీ ఈ తరం యువ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా సాగే కామెడీ.. దీన్నొక టైంపాస్ మూవీగా మార్చింది. యూత్ కు ఈ సినిమా మంచి కిక్కిస్తుంది. కాలేజీ నేపథ్యంలో సాగే యూత్ ఫుల్ సినిమాలను ఎంజాయ్ చేయగలిగే మిగతా ప్రేక్షకులు కూడా 'మ్యాడ్'పై ఓ లుక్కేయొచ్చు. కాకపోతే కొంచెం బూతులు.. డబుల్ మీనింగ్ డైలాగుల డోస్ తట్టుకోవాల్సి ఉంటుంది.

నటీనటులు:

ఇప్ప‌టికే కొన్ని వెబ్ సిరీసుల్లో స‌త్తా చాటిన సంతోష్ శోభ‌న్ త‌మ్ముడు సంగీత్ శోభ‌న్ మ్యాడ్ లో త‌న టాలెంట్ చూపించాడు. అత‌డిలో మంచి ఈజ్ ఉంది. సినిమాలో అత‌డి పాత్ర మొద‌లైన కాసేప‌టికే త‌నకు బాగా అల‌వాటు ప‌డిపోతాం. మంచి కామెడీ టైమింగ్ తో అత‌ను ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బ న‌వ్వించాడు. త‌న లుక్ కూడా టిపిక‌ల్ గా ఉండి వైవిధ్య‌మైన పాత్ర‌లకు సూట‌వుతాడ‌నిపిస్తుంది. ఈ సినిమా త‌ర్వాత సంగీత్ కు అవ‌కాశాలు వ‌రుస క‌డితే ఆశ్చ‌ర్యం లేదు. రామ్ నితిన్ చూడ్డానికి క్యూట్ గా అనిపించాడు. అల్ల‌రి పాత్ర‌లో అత‌ను బాగానే వినోదం పండించాడు. త‌న పాత్ర‌లో.. న‌ట‌న‌లో ఒక చిలిపిత‌నం క‌నిపిస్తుంది. ఇక ఎన్టీఆర్ బావ‌మ‌రిది నార్నె నితిన్ మాత్రం సాధార‌ణంగా అనిపిస్తాడు. త‌న పాత్ర‌నే మూడీగా ఉండేలా డిజైన్ చేయ‌గా.. అందుకు త‌గ్గ‌ట్లే అత‌డి న‌ట‌న కూడా సాగింది. క‌థ‌లో కూడా త‌న పాత్ర‌కు ప్రాధాన్యం త‌క్కువే. మిగ‌తా ఇద్ద‌రు హీరోల‌తో పోలిస్తే త‌న స్క్రీన్ టైం కూడా త‌క్కువే. కామెడీ క్యారెక్ట‌ర్లో విష్ణు అద‌ర‌గొట్టాడు. సినిమాలో కామెడీ ప‌రంగా అత‌డికే ఎక్కువ మార్కులు ప‌డ‌తాయి. హీరోయిన్ల‌లో అనంతిక స‌నిల్ కుమార్ చూడ్డానికి అందంగా ఉంది. త‌న హావ‌భావాలు కూడా బాగున్నాయి. శ్రీ గౌరీ ప్రియ కూడా బాగా చేసింది. త‌ను కూడా చూడ్డానికి బాగుంది. ర‌ఘుబాబు చేసిన ప్రిన్సిపాల్ పాత్ర అక్క‌డ‌క్క‌డా న‌వ్వించింది. ముర‌ళీధ‌ర్ గౌడ్ కూడా బాగా చేశాడు.

సాంకేతిక వర్గం:

చిన్న సినిమానే అయినా టెక్నిక‌ల్ గా మ్యాడ్ మంచి స్థాయిలోనే కనిపిస్తుంది. భీమ్స్ సిసిరోలియో ట్రెండీ మ్యూజిక్ ఇచ్చాడు. పాట‌లు మంచి హుషారు తెప్పిస్తాయి. బీట్ ఉన్న పాట‌లతో పాటు అత‌ను రెండు మంచి మెలోడీలు కూడా ఇచ్చాడు. నేప‌థ్య సంగీతం కూడా బాగుంది. శ్యామ్ ద‌త్-దినేశ్ కృష్ణ‌న్ ల ఛాయాగ్ర‌హ‌ణం కూడా ఆక‌ట్టుకుంటుంది. విజువ‌ల్స్ క‌ల‌ర్ ఫుల్ గా క‌నిపిస్తాయి. కాలేజీ వాతావ‌ర‌ణాన్ని బాగా చూపించారు. నిర్మాణ విలువ‌లు సినిమాకు అవ‌స‌ర‌మైన స్థాయిలో ఉన్నాయి. రైట‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్ క‌ళ్యాణ్ శంక‌ర్ లో మంచి సెన్సాఫ్ హ్యూమ‌ర్ ఉంది. ఇంజినీరింగ్ కాలేజీలు.. హాస్ట‌ళ్లు.. క్యాంటీన్ల‌లో జ‌రిగే అల్ల‌రి మీద అత‌డికి బాగా ప‌ట్టున్న‌ట్లుంది. క‌థ మీద పెద్ద‌గా క‌స‌ర‌త్తు చేయ‌ని అత‌ను.. ఫ‌న్ మూమెంట్స్ మీదే దృష్టిపెట్టాడు. ప్ర‌తి సీన్లో న‌వ్వించ‌డ‌మే ప‌నిగా పెట్టుకుని మ్యాడ్ మూవీని ఎంగేజింగ్ గా మార్చాడు. కథ మీద‌.. డ్రామాను పండించ‌డంలో అత‌ను కొంత క‌స‌ర‌త్తు చేయాల్సింది. అదే జ‌రిగితే మ్యాడ్ ఒక స్పెష‌ల్ ఫిలిం అయ్యేది.

చివరగా: టైంపాస్ ఫ‌న్

రేటింగ్ - 2.75/5

Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater