ఔరా! AIలో మహాభారతం ఫుల్ మూవీ?
పైగా ఇప్పటి టెక్నాలజీలో తీయాలంటే బడ్జెట్ అపరిమితంగా ఉంటుంది.
By: Tupaki Desk | 21 Nov 2024 9:35 AM GMTమిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్... దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి వంటి దిగ్గజాలు భారీ వీఎఫ్ఎక్స్ తో మహాభారతం సిరీస్ ని నిర్మించాలని ప్లాన్ చేసారు. కానీ అది సాధ్యపడలేదు. మహాభారతం కథాంశాన్ని కనీసం ఐదు భాగాలుగా తెరకెక్కించాలి. పైగా ఇప్పటి టెక్నాలజీలో తీయాలంటే బడ్జెట్ అపరిమితంగా ఉంటుంది. సుమారు 1000 కోట్లు పైగా ఖర్చు చేయాల్సి రావొచ్చు. అందుకే దిగ్గజాలంతా చాలా ఆలోచించి డ్రాప్ అయ్యారు.
కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమా అని మహాభారతం సినిమాని ఏఐ పాత్రలతో కూడా రూపొందించగలమని నిరూపిస్తోంది EiPi కంపెనీ. సదరు కంపెనీ మొత్తం మహాభారతం సినిమాని ఏఐలో తెరకెక్కించడం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠను పెంచుతోంది. ఇటీవలే టీజర్ కూడా రిలీజ్ చేసారు. ఈ టీజర్ నాణ్యత నిజంగా నిపుణులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. నెటిజనుల నుంచి అద్భుత స్పందన వస్తోంది.
ఏఐ టెక్నాలజీ సినిమా భవిష్యత్ ని అమాంతం మార్చేయడం ఖాయమని కూడా దీనిని బట్టి అర్థం చేసుకోవాలి. భవిష్యత్ లో హీరోల రూపురేఖల్ని ఏఐలో మరింతగా అభివృద్ధి చేసి బెటర్ మెంట్ వెర్షన్ ని చూపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే తమ హీరోల్లో ఒరిజినాలిటీ కనిపించకపోతే అభిమానులు నిర్ధయగా తిరస్కరిస్తారు. సాంకేతికతను ఎంతవరకూ అవసరమో అంతవరకూ ఉపయోగిస్తేనే మంచిది. చాలా భారీ బడ్జెట్ చిత్రాలకు వీఎఫ్ఎక్స్ పని అంతగా నాణ్యంగా కనిపించలేదని విమర్శలున్నాయి. ఇంతకుముందు గుణశేఖర్ రుద్రమదేవి లో వీఎఫ్ ఎక్స్ ఎలా ఫెయిలైందో చూసాం. చాలా సినిమాల్లో నాశిరకం విజువల్ ఎఫెక్ట్స్ కనిపించాయి. అలా కాకుండా ఏఐ సాంకేతికతతో పర్ఫెక్షన్ వస్తుందని కూడా చెబుతున్నారు. మారుతున్న సాంకేతికతతో సినిమా భవిష్యత్ కూడా ఎలా మారుతుందో వేచి చూడాలి.