Begin typing your search above and press return to search.

విజయ్ సేతుపతి మహారాజా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

కోలీవుడ్ లో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు విజయ్ సేతుపతి

By:  Tupaki Desk   |   15 Jun 2024 4:35 AM GMT
విజయ్ సేతుపతి మహారాజా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
X

కోలీవుడ్ లో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు విజయ్ సేతుపతి. విలక్షణ నటుడిగా విజయ్ సేతుపతికి మంచి గుర్తింపు ఉంది. అందుకే భాషలతో పరిమితం లేకుండా అన్ని ఇండస్ట్రీలలో విజయ్ సినిమాలు చేస్తున్నాడు. తెలుగులో ఉప్పెన సినిమాలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడిగా నటించాడు. ఈ సినిమాలో అతని పెర్ఫార్మెన్స్ కి మంచి గుర్తింపు వచ్చింది.

అలాగే మాస్టర్, విక్రమ్ సినిమాలలో ప్రతినాయకుడి పాత్రలలో నటించాడు. కేవలం హీరోగా చేస్తానని కూర్చోకుండా విలక్షణ పాత్రలు ఉంటే విజయ్ సేతుపతి నటించడానికి ముందువరుసలో ఉంటాడు. డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చిన విజయ్ ఫర్జీ వెబ్ సిరీస్ తో ఆకట్టుకున్నాడు. షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాలో విలన్ గా మెప్పించాడు.

హిందీలో మేరీ క్రిస్మస్ అనే సినిమాలో హీరోగా నటించాడు. తాజాగా మహారాజా అనే మూవీతో విజయ్ ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. తమిళ్, తెలుగు భాషలలో ఈ చిత్రం రిలీజ్ అయ్యింది. నితిలన్ సామినాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని ప్యాషన్ స్టూడియోస్, ది రూట్ సంస్థలపై సుధన్ సుందరం, జగదీష్ పళనిసామి నిర్మించారు. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటించాడు.

జూన్ 14న థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది. విలక్షణమైన పాత్రలో విజయ్, ఇంటరెస్టింగ్ కథాంశంతో దర్శకుడు మెప్పించారనే మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాని తెలుగులో మైత్రీ శశి రిలీజ్ చేశారు. 1.5 కోట్లకి తెలుగు రిలీజ్ రైట్స్ ని ఆయన కొనుగోలు చేశారు. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే 1.8 కోట్ల కలెక్షన్స్ వస్తే చాలు.

మూవీకి హిట్ టాక్ రావడంతో బ్రేక్ ఈవెన్ అందుకోవడం పెద్ద కష్టం కాదనే మాట వినిపిస్తోంది. విజయ్ సేతుపతి కెరియర్ ఆరంభంలో చేసిన పిజ్జా సినిమా తెలుగులో అతనికి సక్సెస్ ఇచ్చింది. మరల ఇన్నేళ్ల తర్వాత మహారాజా మూవీ హిట్ టాక్ దిశగా వెళ్తున్నట్లు ఉంది. ఈ సినిమా కమర్షియల్ హిట్ అయితే విజయ్ సేతుపతి మార్కెట్ కూడా తెలుగులో పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.