శ్రీమంతుడే కాదు, మహర్షి కూడా కాపీనే!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'శ్రీమంతుడు' సినిమా కాపీ రైట్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 14 Feb 2024 10:03 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'శ్రీమంతుడు' సినిమా కాపీ రైట్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. శరత్ చంద్ర అనే రచయిత తన కథను కాపీ కొట్టి ఈ మూవీ తెరకెక్కించారని ఆరోపిస్తూ కోర్టుకు వెళ్లారు. దీనికి సంబంధించి ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ పై క్రిమినల్ కేసు నమోదైంది. ఈ వివాదం ఇంకా తేలకముందే, ఇప్పుడు మహేష్ నటించిన 'మహర్షి' మూవీ కూడా చిక్కుల్లో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన చిత్రం 'మహర్షి'. ఈ సినిమా కథ కూడా కాపీ అంటూ శరత్ చంద్ర సంచలన ఆరోపణలు చేశారు. తను రాసిన 'సమాహారం' అనే నవలలోని కొన్ని సన్నివేశాలు ఈ చిత్రంలో కనిపిస్తున్నాయని అన్నారు. 'శ్రీమంతుడు' కేసుపై తీర్పు వెలువడగానే, 'మహర్షి' సినిమా విషయంలో తన హక్కును పొందేందుకు కోర్టును ఆశ్రయిస్తానని అంటున్నారు.
'మహర్షి' అనేది మహేష్ బాబు కెరీర్ లో మైలురాయి 25వ చిత్రం. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పివిపి సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. 2019లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నేషనల్ ఫిలిం అవార్డ్స్ కూడా సాధించి, జాతీయ స్థాయిలో ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. అలాంటి సినిమా కాపీ అంటూ శరత్ చంద్ర కామెంట్స్ చేయడం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
స్వాతి వారపత్రికలో ప్రచురితమైన తన 'చచ్చేంత ప్రేమ' కథ నుండి సీన్ బై సీన్ కాపీ చేసి 'శ్రీమంతుడు' సినిమా తీశారని శరత్ చంద్ర ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ వివాదం ఓ కొలిక్కి రాకముందే.. ఇప్పుడు వంశీ పైడిపల్లి కూడా తన కథను కాపీ కొట్టి 'మహర్షి' సినిమా తీసినట్లుగా రచయిత ఆరోపిస్తున్నారు. యాదృచ్ఛికంగా ఈ రెండు సినిమాల్లోనూ మహేష్ బాబే హీరో. మరి దీనిపై ప్రొడ్యూసర్ దిల్ రాజు, డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఎలా స్పందిస్తారో చూడాలి.
ఇదిలా ఉంటే ఇటీవల 'బేబీ' మూవీకి కూడా కాపీ మరకలు అంటుకున్నాయి. స్టోరీ తనదేనంటూ శిరిన్ శ్రీరామ్ అనే షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ హైదరాబాద్ లోని రాయదుర్గంలో ఫిర్యాదు చేశారు. 2015లో తాను రాసుకున్న 'ప్రేమించొద్దు' అనే కథను సాయి రాజేశ్ కు చెప్పానని, కాపీ రైట్ చట్టాన్ని బేబీ ఉల్లంఘించి తన కథనే బేబీ సినిమాగా తీశారని ఆరోపించారు.