'అతడు' ఎందుకు స్పెషల్ రికార్డ్..?
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మొదటి సినిమా 'అతడు'. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని రాబట్టడంలో అతడు విఫలం అయింది.
By: Tupaki Desk | 19 March 2025 10:32 PM ISTఓటీటీ కాలంలో టీవీలను చూసే వారి సంఖ్య భారీగా తగ్గింది. గతంలో శాటిలైట్ రైట్స్ ద్వారా సినిమాలకు భారీ మొత్తంలో వచ్చేవి. కానీ ఓటీటీ కారణంగా ఈమధ్య కాలంలో సినిమాలు శాటిలైట్ మార్కెట్‌ను పూర్తిగా కోల్పోయాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం శాటిలైట్‌లో ఇప్పటికీ టెలికాస్ట్ అవుతూ అత్యధిక రేటింగ్‌ను సొంతం చేసుకుంటున్నాయి. కొత్త సినిమాలతో పోల్చితే పాత సినిమాలకే శాటిలైట్ రేటింగ్ నమోదు అవుతుంది. ప్రతి భాషలో కొన్ని సినిమాలు అత్యధిక సార్లు టెలికాస్ట్ అయిన సినిమాలు ఉన్నాయి, తెలుగు భాషలో 'అతడు' సినిమా సాధించిన శాటిలైట్ రికార్డ్‌ను రాబోయే పాతిక ఏళ్లలోనూ ఏ సినిమా సొంతం చేసుకునే అవకాశాలు లేవని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మొదటి సినిమా 'అతడు'. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని రాబట్టడంలో అతడు విఫలం అయింది. కానీ బుల్లి తెరపై అతడు సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. టీవీలో టెలికాస్ట్ అయిన ప్రతి సారి అతడు సినిమా అత్యధిక రేటింగ్ నమోదు చేస్తూనే ఉంది. సాధారణంగా అయిదు పది సార్లు మహా అయితే వంద సార్లు సినిమాలు టెలికాస్ట్ కావడం మనం చూస్తూ ఉంటాం. కానీ అతడు సినిమా ఇప్పటి వరకు ఏకంగా 1500 సార్లు టెలికాస్ట్ అయింది. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అంటూ బుల్లి తెర వర్గాల వారు అంటున్నారు. ఒక ప్రముఖ ఛానల్‌లో ఒక సినిమాను ఇన్ని సార్లు టెలికాస్ట్ చేయడం ఇదే మొదటి సారి అంటున్నారు.
బాక్సాఫీస్ నిరాశ పరచిన 'అతడు' సినిమా బుల్లి తెరపై ఎందుకు ఈ స్థాయిలో హిట్ అయింది అనేది ఎవరూ చెప్పలేకపోతున్నారు. మహేష్ బాబును త్రివిక్రమ్ చూపించిన తీరు ఆయన ఫ్యాన్స్‌కి మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అంతే కాకుండా సినిమాలోని త్రిష పాత్ర చాలా క్యూట్‌గా ఉంటుంది. మహేష్ బాబు నటనతో పాటు బ్రహ్మానందం కామెడీ కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. పాటలు సినిమా స్థాయిని పెంచుతాయి. అందుకే అతడు చాలా స్పెషల్ సినిమా అనడంలో సందేహం లేదు. ప్రతి సన్నివేశాన్ని ప్రేక్షకులు ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. ముఖ్యంగా బ్రహ్మానందం, మహేష్ బాబు కాంబోలో వచ్చే కామెడీ సీన్స్, కొన్ని యాక్షన్ సీన్స్‌ను బుల్లి తెరపై ఎన్ని సార్లు చూసినా మళ్లీ చూడాలి అనిపించే విధంగా ఉంటాయి. అందుకే అతడు సినిమా చాలా స్పెషల్ సినిమాగా నిలిచింది.
మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో అతడు సినిమా తర్వాత వచ్చిన ఖలేజా సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. కానీ ఆ సినిమా కూడా బుల్లి తెరపై మంచి స్పందన దక్కించుకుంది. కానీ అతడు స్థాయిలో ఖలేజా సినిమా టీవీలో హిట్ కొట్టలేదు. ఆ తర్వాత వచ్చిన గుంటూరు కారం సినిమా సైతం వీరి కాంబోలో యావరేజ్‌గానే నిలిచింది. కానీ ఆ సినిమా సైతం బుల్లి తెరపై మంచి స్పందన దక్కించుకుంది. ఎన్ని సినిమాలు వచ్చినా, ఇంతకు ముందు ఎన్ని సినిమాలు ఉన్నా అతడు సినిమా స్థాయిలో టీవీలో టెలికాస్ట్ కావడం అసాధ్యం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అతడు విడుదల అయ్యి 20 ఏళ్లు అవుతుంది. ఇప్పటి వరకు 1500 సార్లు సినిమా బుల్లి తెరపై టెలికాస్ట్ అయింది. థియేటర్‌ల ద్వారా రీ రిలీజ్ కూడా అయిన విషయం తెల్సిందే. రీ రిలీజ్‌లోనూ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.