సినిమా చేయను నుంచి సినిమా మాత్రమే చేస్తాను అనే వరకు...
ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్నాడు మహేష్ బాబు.
By: Tupaki Desk | 24 March 2025 11:30 AMప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్నాడు మహేష్ బాబు. తన సినిమాలతో ఎంతో మందిని అలరించడంతో పాటూ ఎందరో అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు మహేష్. సినిమా సినిమాకీ మరింత కష్టపడి ఫ్యాన్స్ ను ఇంకా అలరించాలని చూస్తాడు మహేష్. తనకు సినిమా తప్ప మరొకటి తెలియదని మహేష్ ఇప్పటికే చాలా సార్లు చెప్పిన సంగతి తెలిసిందే.
అలాంటి మహేష్ బాబుని చిన్నప్పుడు సినిమాలో నటించమని అడిగితే చెట్టెక్కి కూర్చొన్నాడట. ఈ విషయాన్ని డైరెక్టర్ కోడి రామకృష్ణ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా తెరకెక్కిన పోరాటం సినిమాలో మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన విషయం అందరికీ తెలుసు.
ఈ సినిమాలో కృష్ణకు చిన్న తమ్ముడిగా మహేష్ నటించాడు. పోరాటం సినిమా సెట్స్ కు మహేష్ రెగ్యులర్ గా వస్తుండేవాడని, ఆ టైమ్ లో మహేష్ చాలా చిన్న వాడని, పోరాటంలో కృష్ణకు తమ్ముడు పాత్ర కోసం మహేష్ అయితే బావుంటాడనిపించి కృష్ణకు విషయం చెప్తే దానికి ఆయన నవ్వుతూ, వాడసలు ఎవరి మాటా వినడు. ఒప్పుకోడు, కావాలంటే నువ్వే ఒప్పించుకోమని అన్నారని కోడి రామకృష్ణ తెలిపారు.
సరే అని సెట్స్ లో ఓ చెట్టు దగ్గర ఆడుకుంటున్న మహేష్ దగ్గరకెళ్లి నీకు సినిమాలు చేయాలని ఉందా అని అంటే లేదన్నాడని, ఎందుకంటే సినిమాలంటే మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి కదా. మా నాన్న గారిని చూస్తున్నాగా అని అన్నాడని, అంత చిన్న వయసులోనే మహేష్ సినిమా గురించి ఎన్నో తెలిసినట్టు మాట్లాడాడని కోడి అన్నారు.
ఈ సినిమాలో నీ రోల్ బావుంటుందని మహేష్ కు చెప్పి ఎంత ఒప్పించబోయినా మహేష్ ఒప్పుకోలేదని, నేను చేయను అంటూ చెట్టు ఎక్కేశాడని, తర్వాత నానా తిప్పలు పడి మహేష్ ను ఒప్పించానని కోడి రామకృష్ణ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అసలు సినిమాలు చేయనన్న మహేష్ బాబు ఇప్పుడు నటుడిగా ఏ స్థాయిలో ఉన్నాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న మహేష్ ఆ సినిమా తర్వాత తన స్థాయిని ఎంత పెంచుకుంటాడనేది చెప్పడం కూడా కష్టమే.