Begin typing your search above and press return to search.

మహేష్‌ 2010లో చేసిన ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌... ఏంటో తెలుసా?

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు 2024 ఆరంభంలో సంక్రాంతి కానుకగా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

By:  Tupaki Desk   |   3 Jan 2025 9:57 AM GMT
మహేష్‌ 2010లో చేసిన ట్వీట్‌ ఇప్పుడు వైరల్‌... ఏంటో తెలుసా?
X

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు 2024 ఆరంభంలో సంక్రాంతి కానుకగా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు. త్రివిక్రమ్‌తో చేసిన మూడో సినిమా బాక్సాఫీస్‌ వద్ద బొక్కబోర్లా పడింది. ఏడాది కాలంగా మహేష్‌బాబు షూటింగ్‌కి దూరంగా ఉంటున్నారు. కేవలం ఆయన గత ఏడాది కాలంగా రాజమౌళి సినిమా కోసం గ్రౌండ్‌ వర్క్‌లో బిజీగా ఉన్నారు. కొత్త లుక్‌తో పాటు, ఫిజిల్ ఫిట్‌ నెస్‌ కోసం వర్కౌట్‌లు చేస్తున్నారు. ఎట్టకేలకు రాజమౌళితో మహేష్ బాబు సినిమా పట్టాలెక్కింది. నిన్న సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. కానీ అధికారికంగా మాత్రం ప్రకటించలేదు.

మహేష్ బాబు, రాజమౌళి కాంబోలో మూవీ పట్టాలెక్కింది. రెగ్యులర్‌ షూటింగ్‌ సైతం ఈ నెలలోనే ఉంటుందని తెలుస్తోంది. హైదరాబాద్‌ శివారు ప్రాంతంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో సినిమా మొదటి షెడ్యూల్‌కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక వైపు రాజమౌళి సినిమాకు సంబంధించిన షూటింగ్‌ హడావుడి, పూజా కార్యక్రమాలకు సంబంధించిన విషయం గురించి సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతున్న సమయంలో కొందరు మహేష్ బాబు ఫ్యాన్స్ దాదాపు 14 ఏళ్ల క్రితం మహేష్‌ బాబు ట్వీట్‌ చేసిన ఒక ట్వీట్‌ను వైరల్‌ చేస్తున్నారు. ఆ ట్వీట్‌లో మహేష్ బాబు తాను రాజమౌళి దర్శకత్వంలో సినిమాను చేయబోతున్నట్లుగా పేర్కొన్నాడు.

ఆ సమయంలో మహేష్ బాబు ట్వీట్‌ ను జనాలు పెద్దగా పట్టించుకోలేదేమో కానీ ఇప్పుడు మాత్రం ఆ ట్వీట్‌ను తెగ షేర్‌ చేస్తున్నారు. ఖలేజా సినిమా సమయంలో మహేష్‌ బాబు నుంచి రాజమౌళి సినిమా ప్రకటన వచ్చింది. మహేష్ బాబుతో కాకుండా ఆ సమయంలో రాజమౌళి 'ఈగ' వంటి ప్రయోగాత్మక సినిమాను చేయడం జరిగింది. ఈగ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో విజువల్‌ ఎఫెక్ట్స్‌ ప్రధానంగా బాహుబలి సినిమాను పట్టాలెక్కించాడు. బాహుబలి సినిమా రెండు పార్ట్‌లు పూర్తి అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు నాలుగు సంవత్సరాలు పట్టింది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కోసం మూడు ఏళ్ల సమయం తీసుకున్నాడు.

రాజమౌళి ఎట్టకేలకు మహేష్ బాబుతో సినిమాను రూపొందిస్తున్నాడు. హాలీవుడ్‌ రేంజ్ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమాను రూపొందించబోతున్నట్లుగా తెలుస్తోంది. రికార్డ్‌ బ్రేకింగ్‌ వసూళ్లు మాత్రమే కాకుండా ఆస్కార్‌ స్టేజ్‌పై మరోసారి తెలుగు సినిమాను ఉంచాలని దర్శకుడు రాజమౌళి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఆఫ్రికా సహా పలు దేశాల్లో సినిమాను భారీ ఎత్తున రూపొందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే సినిమా 2027 ఆరంభంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. మహేష్ బాబు ఫ్యాన్స్‌ అదృష్టం బాగుంటే 2026 చివరి వరకు వచ్చినా ఆశ్చర్యం లేదని కొందరు అంటున్నారు.