Begin typing your search above and press return to search.

రీ రిలీజ్‌లో సూపర్‌ స్టార్‌ రికార్డ్‌లే రికార్డ్‌లు

తాజాగా మహేష్ బాబు, వెంకటేష్ నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' విడుదల అయింది.

By:  Tupaki Desk   |   8 March 2025 4:31 PM IST
రీ రిలీజ్‌లో సూపర్‌ స్టార్‌ రికార్డ్‌లే రికార్డ్‌లు
X

టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్‌ కొనసాగుతోంది. ఈ రీ రిలీజ్ ట్రెండ్‌ అనేది కేవలం మహేష్ బాబు సినిమాల కోసమే మొదలైందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈమధ్య కాలంలో మహేష్ బాబు నటించిన పలు పాత సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. అవన్నీ భారీ వసూళ్లు నమోదు చేశాయి. ఏ సినిమాకు ఆ సినిమా అన్నట్లుగా, ఒక దాన్ని మించి మరోటి భారీ వసూళ్లు నమోదు చేస్తున్నాయి. గత ఏడాది రీ రిలీజ్‌ అయిన మురారి సినిమా షాకింగ్‌ వసూళ్లు రాబట్టింది. వసూళ్ల విషయం పక్కన పెడితే థియేటర్ల వద్ద ప్రేక్షకుల సందడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని థియేటర్‌లో రీ క్రియేట్‌ చేసిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

మురారి సినిమాలో అలనాటి రామచంద్రుడు పాటకు థియేటర్‌లో వచ్చిన స్పందన చూసి ఇండస్ట్రీ మొత్తం షాక్ అయ్యి ఉంటుంది. థియేటర్‌లో పెళ్లిలు, ప్రేమలు ఇలా ఎన్నో రకాలుగా రీ రిలీజ్ సందర్భంగా చూశాం. అలనాటి రామచంద్రుడు పాటతో పాటు, మురారి క్లైమాక్స్ సన్నివేశంకు రీ రిలీజ్ సందర్భంగా వచ్చిన స్పందన గురించి ఎప్పటికీ మర్చిపోలేరు. మళ్లీ విడుదలైనా మురారికి అదే రేంజ్‌లో స్పందన దక్కే అవకాశాలు ఉన్నాయి. తాజాగా మహేష్ బాబు, వెంకటేష్ నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' విడుదల అయింది. సినిమాకు వస్తున్న స్పందన చూసి బాక్సాఫీస్‌ వర్గాల వారు కూడా షాక్ అవుతున్నారు. ఒక్క షో, ఒక్క రోజుకు రీ రిలీజ్ పరిమితం చేయలేదు.

ఈ వీకెండ్‌ మొత్తం థియేటర్‌లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సందడి చేయబోతుంది. మొదటి రోజు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు దాదాపుగా రూ.1.85 కోట్ల వసూళ్లు నమోదు అయినట్లు బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. హిందీ సూపర్‌ హిట్‌ మూవీ ఛావా ను తెలుగులో నిన్న విడుదల చేశారు. ఆ సినిమాకు ఏమాత్రం తగ్గకుండా, ఆ సినిమాను ఢీ కొట్టే విధంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వసూళ్లు నమోదు అయ్యాయి. ఈ సినిమా రీ రిలీజ్ వల్ల ఛావా సినిమా వసూళ్లపై ప్రభావం పడింది అనేది బాక్సాఫీస్ వర్గాల టాక్‌. ఆ రేంజ్‌లో మహేష్ బాబు, వెంకీల ఫ్యామిలీ సినిమా జోరు బాక్సాఫీస్ వద్ద కొనసాగింది.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాను శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మించారు. మహేష్ బాబుకు జోడీగా సమంత నటించగా, వెంకటేష్ కి జోడీగా అంజలి నటించింది. సినిమాలో ప్రకాష్ రాజ్‌ పోషించిన పాత్ర మరో పాతికేళ్లు అయినా జనాలు మరచి పోలేరు. సినిమా థియేటర్‌లో రేలంగి మామయ్యను ఇమిటేట్‌ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. మొత్తానికి ఈ సినిమా రీ రిలీజ్‌లో గతంలో ఎప్పుడు ఏ సినిమా దక్కించుకోని వసూళ్లు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కేవలం ఈ సినిమా మాత్రమే కాకుండా గతంలో రీ రిలీజ్‌ అయిన పోకిరి, మురారి సినిమాలు సైతం భారీ వసూళ్లు నమోదు చేశాయి. ఇదే ఏడాది మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా 'అతడు' సినిమాను రీ రిలీజ్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. అతడు రీ రిలీజ్ అయితే థియేటర్‌లు కచ్చితంగా మరోసారి ఫ్యాన్స్‌తో నిండి పోవడం ఖాయం. అందుకే మహేష్ బాబుకు రీ రిలీజ్‌లో రికార్డ్‌లే రికార్డ్‌లు నమోదు అవుతున్నాయి.