Begin typing your search above and press return to search.

అసలైన పండుగ సినిమా.. సంక్రాంతికి వస్తున్నాంకి మహేష్ బాబు రివ్యూ!

వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొంది నిన్న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు హిట్ టాక్ దక్కింది

By:  Tupaki Desk   |   16 Jan 2025 4:05 AM GMT
అసలైన పండుగ సినిమా.. సంక్రాంతికి వస్తున్నాంకి మహేష్ బాబు రివ్యూ!
X

వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొంది నిన్న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు హిట్ టాక్ దక్కింది. సంక్రాంతికి వచ్చిన మూడు సినిమాల్లోకి ఈ సినిమా వైపు ఫ్యామిలీ ఆడియన్స్ తెగ పరుగులు పెడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు దాదాపు 75% ఆక్యుపెన్సీతో భారీ వసూళ్లు సొంతం అయ్యాయి. రెండో రోజు అదే స్థాయి వసూళ్లు రాబట్టినట్లుగా తెలుస్తోంది. మూడో రోజుకు ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలు ఉన్నాయి అంటూ బాక్సాఫీస్‌ వర్గాల వారు చాలా ధీమాగా చెబుతున్నారు. ఇతర సినిమాల థియేటర్‌లను సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ఇచ్చేస్తున్నారట.

ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ఎంతో మంది సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తూ అభినందించారు. తాజాగా సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు ఈ సినిమాకు రివ్యూ ఇచ్చారు. విడుదలకు ముందు ఈయన ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలంటూ ఆకాంక్షిస్తూ మహేష్ బాబు ట్రైలర్‌ ను ఎక్స్ ద్వారా షేర్‌ చేశారు. ఇప్పుడు సినిమా విడుదల అయిన తర్వాత తన అభిప్రాయంను అదే ఎక్స్ ద్వారా పంచుకున్నారు. మహేష్ బాబు మాటలతో ఈ సంక్రాంతి విజేత సంక్రాంతికి వస్తున్నాం అని తేలిపోయింది అంటూ వెంకటేష్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మహేష్ బాబు ఎక్స్‌లో.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాను చూశాము, చాలా ఎంజాయ్ చేశాం. పండగకి అసలైన సినిమా. వెంకటేష్ గారు అద్భుతంగా నటించారు. నా దర్శకుడు అనిల్‌ రావిపూడికి ఇలాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. హీరోయిన్స్ ఐశ్వర్య రాజేష్‌, మీనాక్షి చౌదరి ఇద్దరూ చాలా బాగా నటించారు. బుల్లి రాజు పాత్రలో కనిపించిన పిల్లాడు మంచి కామెడీతో నవ్వించాడు. చిత్ర యూనిట్‌ సభ్యులు అందిరికీ ప్రత్యేక అభినందనలు అంటూ ట్వీట్‌ చేశారు. మహేష్ బాబు ట్వీట్‌తో సినిమాకు మరింత బూస్ట్‌ దక్కింది. ముఖ్యంగా బుల్లిరాజు కామెడీ గురించి మహేష్‌ బాబు ప్రత్యేకంగా ప్రస్థావించడం చెప్పుకోదగ్గ విషయం.

భార్య, మాజీ ప్రియురాలి మధ్య నలిగిపోయే వ్యక్తి పాత్రలో వెంకటేష్ నటించి మెప్పించాడు. ఇలాంటి పాత్రలు వెంకటేష్‌ గతంలో చాలానే చేశారు. కానీ ఈమధ్య కాలంలో వెంకటేష్‌లోని కామెడీ టైమింగ్‌ను ఈ స్థాయిలో వినియోగించుకున్న దర్శకుడు మాత్రం అనిల్‌ రావిపూడి ఒక్కడే ఉన్నారు. కామెడీ పరంగా వెంకటేష్‌ను మరో స్థాయికి తీసుకు వెళ్లిన ఎఫ్‌ 2 ని మించి ఈ సినిమా ఉంది అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు వరుసగా రెండు రోజులు రికార్డ్‌ స్థాయి వసూళ్లు నమోదు కావడంతో ఇప్పటికే బ్రేక్‌ ఈవెన్‌కి దగ్గర అయ్యింది. ఈ సినిమాకు ఏం కావాలో అదే షూట్‌ చేశాం అని, తక్కువ బడ్జెట్‌తోనే సినిమాను పూర్తి చేశామని దర్శకుడు అనిల్‌ రావిపూడి అన్నాడు. కనుక నిర్మాత దిల్‌రాజు ఈ సినిమా ఏ స్థాయి లాభాలను అందిస్తుందో ఊహకు సైతం అందడం లేదు.