స్టోరీకే రెండేళ్లు పడితే, సినిమాకి ఇంకెన్నేళ్ళు పడుతుందో?
సూపర్ స్టార్ మహేష్ బాబు, అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సినిమా కోసం యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు
By: Tupaki Desk | 11 Oct 2024 12:13 PM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు, అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సినిమా కోసం యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధికారిక ప్రకటన రాకముందే ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్ ఈ మూవీ గురించి ఓ బిగ్ అప్డేట్ అందించారు.
SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతున్న ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్తుందనే దానిపై అనేక వార్తలు వచ్చాయి. వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ 2025 జనవరి నెలలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అవుతుందని విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చేశారు. అలానే స్టోరీ గురించి చెబుతూ.. మాములుగా తాను ఓ కథ రాయడానికి 3 - 4 వారాల సమయం సరిపోతుందని, కానీ మహేష్ బాబు కోసం కథ రెడీ చేయడానికి 2 సంవత్సరాలు పట్టిందని అన్నారు.
ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు కథలు అందించిన సుదీర్ఘమైన అనుభవమున్న సీనియర్ రైటర్.. మహేష్ కోసం స్టోరీ సిద్ధం చేయడానికి 2 ఏళ్లు టైమ్ తీసుకున్నారంటే అది ఎలాంటి సబ్జెక్ట్ అయ్యుంటుందో ఊహించుకోవచ్చు. అందులోనూ RRR వంటి గ్లోబల్ హిట్ తర్వాత రాజమౌళి నుంచి రాబోతున్న సినిమా ఇది. గ్లోబ్ ట్రాటనింగ్ మూవీ అని, తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అని జక్కన్న ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి విజయేంద్రప్రసాద్ కథ విషయంలో ఎక్కువ కసరత్తులు చేశారని అనుకోవచ్చు.
మహేష్ బాబుతో ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ అడ్వెంచర్ స్టోరీ చేయబోతున్నట్లు విజయేంద్ర ప్రసాద్ చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు. దీని కోసం బ్రిటీష్-ఆఫ్రికన్ రచయిత విల్బర్ స్మిత్ రాసిన నవలను రీసెర్చ్ చేసినట్లు తెలుస్తోంది. కాకపోతే స్క్రిప్ట్ రెడీ చెయ్యడానికే రెండేళ్ల సమయం తీసుకుంటే, ఇంక ఈ కథను తెరకెక్కించడానికి రాజమౌళి ఇంకెన్నేళ్ళు సమయం తీసుకుంటారో అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. జక్కన్న సినిమా అంటే ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఎవరూ చెప్పలేరనే సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు SSMB29 సినిమా కూడా ఎప్పుడు పూర్తవుతుందో ఊహించలేమని అంటున్నారు. కానీ ఎప్పుడొచ్చినా ఈ మూవీ గ్లోబల్ బాక్సాఫీస్ ను షేక్ చెయ్యడం గ్యారంటీ అని నమ్ముతున్నారు.
దర్శక ధీరుడు రాజమౌళి విజయాల వెనుక ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా ఉన్నారనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డెబ్యూ మూవీ 'స్టూడెంట్ నెం.1', 'మర్యాద రామన్న' మినహా మిగతా అన్ని చిత్రాలకు ఆయనే కథలు అందించారు. ఇప్పుడు మహేశ్ బాబు మూవీకి సైతం అధ్బుతమైన కథ సిద్ధం చేసి ఉంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అది ఎలాంటి స్టోరీ లైన్ తో రూపొందునుందో తెలియాలంటే, ఎప్పటిలాగే జక్కన్న ప్రెస్ మీట్ పెట్టి సినిమా వివరాలు వెల్లడించే వరకూ ఆగాల్సిందే.
SSMB29 సినిమాని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో కెఎల్ నారాయణ నిర్మించనున్నారు. ఓ ప్రముఖ హలీవుడ్ సంస్థ నిర్మాణంలో భాగస్వామిగా చేరే అవకాశం ఉందని సమాచారం. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చనున్న ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్స్ వర్క్ చేయనున్నారు.