యేటేటా 30 కోట్లు కేవలం ధాతృత్వానికి.. మహేష్ ది గ్రేట్!
మహేష్ బాబు ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన పిల్లలు, పలు సంఘాలకు మద్దతు ఇవ్వడంపై దృష్టి పెడుతుంటారు. ఆర్థికంగా గొప్ప సహకారం అందిస్తున్నారు.
By: Tupaki Desk | 24 July 2024 2:30 PM GMTటాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు తన అసాధారణమైన నటప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. నటుడిగానే కాకుండా అతడు దయాగుణంలో అపారమైన దాతృత్వ స్వభావ రీత్యా కూడా గొప్ప పేరు తెచ్చుకున్నారు. మహేష్ దాన ధర్మాలు, ఆపదలో ఉన్న చిన్నారులను ఆదుకునేందుకు చేసే సాయం ఎల్లవేళలా చర్చనీయాంశమయ్యాయి. వందలాదిగా హృద్రోగులైన చిన్నారులను ఆయన సేవాగుణం కాపాడింది. మహేష్ తన ఆదాయంలో కొంత మొత్తాన్ని వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలకు వెచ్చిస్తుంటారు. తాజా సమాచారం మేరకు... మహేష్ ప్రతి సంవత్సరం సుమారు రూ. 30 కోట్ల మేర స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇస్తున్నారని తెలిసింది.
మహేష్ బాబు ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన పిల్లలు, పలు సంఘాలకు మద్దతు ఇవ్వడంపై దృష్టి పెడుతుంటారు. ఆర్థికంగా గొప్ప సహకారం అందిస్తున్నారు. పిల్లలకు గుండె శస్త్రచికిత్సలకు నిధులు సమకూర్చడం ద్వారా అవసరంలో ఉన్న వారి జీవితాలను మెరుగుపరచడానికి 'మహేష్ బాబు ఫౌండేషన్' ను స్థాపించారు. ఫౌండేషన్ దత్తత తీసుకున్న ఆంధ్రప్రదేశ్‌లోని బుర్రిపాలెం.. తెలంగాణలోని సిద్ధాపురం గ్రామాలలో పాఠశాలలు, అంగన్‌వాడీ భవనాలు, గ్రంథాలయాలు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల నిర్మాణం సహా పలు కార్యక్రమాలను చేపట్టింది. అదనంగా, ఫౌండేషన్ వెనుకబడిన నేపథ్యాల నుండి ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందిస్తుంది. రెగ్యులర్ మెడికల్ చెకప్‌లు, టీకా డ్రైవ్‌లను నిర్వహిస్తుంది.
మహేష్ ధాతృత్వం అంచెలంచెలుగా విస్తరించింది. 2021 లో మహేష్ బాబు గుండె జబ్బులతో బాధపడుతున్న 30 మంది పిల్లలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. వారి శస్త్రచికిత్సలకు వైద్యానికి నిధులు సమకూర్చారు.
ఈ సేవాగుణం అతడి అభిమానులు, సాధారణ ప్రజలను ఎంతగానో ఆకర్షించింది. వారంతా మహేష్ కృషిని ప్రశంసించారు. మహమ్మారీ సమయంలో కోవిడ్-19 వ్యాక్సిన్ గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో ఏఐజీ హాస్పిటల్స్ చేపట్టిన 'ఎండ్ కరోనా క్యాంపెయిన్'కు మహేష్ బాబు కూడా మద్దతు ఇచ్చారు.
ఆర్జన, అతడి అపారమైన సంపదలు, కీర్తి ప్రతిష్ఠలు ఎన్ని ఉన్నప్పటికీ మహేష్ బాబు తన దాతృత్వ కార్యకలాపాలను ప్రచారం కోరుకోరు. వాస్తవికంగా మహేష్ నిశ్శబ్దంగా వైవిధ్యం చూపాలని నమ్ముతారు. తన నిస్వార్థ దయతో చాలా మందికి స్ఫూర్తినిచ్చాడు. మహేష్ బాబు ఉదారత.. సామాజిక సంక్షేమంపై నిబద్ధత అతనికి 'భారతదేశపు అత్యంత స్వచ్ఛందమైన సూపర్ స్టార్' అనే బిరుదును సంపాదించిపెట్టాయి. ఇతరులు అనుసరించడానికి ఒక ఉదాహరణగా ఆయన నిలిచారు. మహేష్ తదుపరి ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో భారీ పాన్ ఇండియన్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.