అభిమానికి కష్టం వస్తే మహేష్ బాబు...!
సూపర్ స్టార్ మహేష్ బాబు చిన్నారుల గుండె ఆపరేషన్ లు చేయించే విషయంలో రికార్డ్ సృష్టించిన విషయం తెల్సిందే.
By: Tupaki Desk | 19 Jun 2024 11:27 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు చిన్నారుల గుండె ఆపరేషన్ లు చేయించే విషయంలో రికార్డ్ సృష్టించిన విషయం తెల్సిందే. వేలాది మంది పిల్లలకు గుండె ఆపరేషన్స్ చేయడం ద్వారా వారి కుటుంబ సభ్యులు అయిన లక్షలాది మంది కళ్లలో ఆనందం చూశాడు.
కేవలం పిల్లల గుండె ఆపరేషన్ లు మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో సార్లు ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఈసారి మహేష్ బాబు తన అభిమాని కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు కష్టాల్లో ఉన్న ఫ్యాన్ కి తన వంతు సహకారం అందించడం జరిగింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే... కృష్ణా జిల్లా పెద్దప్రోలు గ్రామ పంచాయితీకి చెందిన కాకర్లమూడి రాజేష్ ఎప్పటి నుంచో సూపర్ స్టార్ ఫ్యామిలీకి పెద్ద అభిమాని. మొదట కృష్ణ ను అభిమానించిన రాజేష్ ఇప్పుడు మహేష్ బాబును విపరీతంగా అభిమానిస్తూ ఉంటాడు.
జిల్లాలో మహేష్ బాబు అభిమానులందరికి కూడా రాజేష్ గురించి తెలుసు. అలాంటి రాజేష్ తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నాడని, ఆయన ముగ్గురు పిల్లలు కూడా ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు దూరం అయ్యారని తెలిసి మహేష్ బాబు వెంటనే స్పందించాడు.
తన అభిమాన సంఘ నాయకులను రాజేష్ వద్దకు పంపిన మహేష్ బాబు కావాల్సిన తక్షణ సాయంను అందించడం జరిగిందట. అంతే కాకుండా రాజేష్ ఇద్దరు కొడుకులను మంచి స్కూల్ లో చేర్పించడంతో పాటు వారి చదువుకు కావాల్సిన నిధులను కూడా ఇవ్వాలని నిర్ణయించారు.
కిడ్నీ పాడై తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉన్న రాజేష్ చికిత్స అవసరాల కోసం కూడా ఆర్థిక సాయం ను అందించినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి మహేష్ బాబు తన అభిమానులకు కష్టం వస్తే ముందు ఉంటాను అంటూ మరోసారి నిరూపించుకున్నాడు.