హాలీవుడ్ సింహం కోసం మహేష్..?
మహేష్ బాబు హాలీవుడ్ యానిమేషన్ చిత్రం 'ముఫాస' కు తెలుగు డబ్బింగ్ చేయబోతున్నారని టాక్ వస్తోంది.
By: Tupaki Desk | 17 Aug 2024 5:48 AM GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న తన పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నారు. ఈ సినిమా కోసం మహేష్ తన లుక్‌లో భారీ మార్పులు చేసుకుంటూ, పూర్తి స్థాయి డెడికేషన్ తో పని చేస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో, ఆయన ఒక ఆసక్తికర నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు హాలీవుడ్ యానిమేషన్ చిత్రం 'ముఫాస' కు తెలుగు డబ్బింగ్ చేయబోతున్నారని టాక్ వస్తోంది.
డిస్నీ సంస్థ ఈ సినిమా కోసం మహేష్ బాబుతో చర్చలు జరుపుతోందని తెలుస్తోంది. ఇప్పటికే మహేష్ డబ్బింగ్ చెప్పేందుకు ఓకే చెప్పారని సమాచారం. 'ముఫాస' యానిమేటెడ్ చిత్రం, 'ది లయన్ కింగ్' సినిమా ప్రీక్వెల్ గా రూపొందుతోంది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన ముఫాస కథే ఈ సినిమా కధాంశంగా ఉండబోతోంది. చిన్నపిల్లలకు మహేష్ బాబు ఇష్టమైన హీరో కావడం, అలాగే యూత్ సీనియర్ ఆడియెన్స్ లో కూడా మంచి క్రేజ్ ఉండడంతో, డిస్నీ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మహేష్ బాబు ఇప్పటికే పలు తెలుగు సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ముఖ్యంగా 'జల్సా', 'బాద్‌షా', 'ఆచార్య' వంటి చిత్రాలకు ఆయన వాయిస్ ఓవర్ అందించారు. కానీ, హాలీవుడ్ తెలుగు డబ్బింగ్ సినిమా కోసం మాత్రం ఇదే మొదటి సారి. దీనితో, ఈ వార్త ఇప్పుడు అభిమానుల్లో భారీ అంచనాలను కలిగిస్తోంది. మహేష్ బాబు తన మేనరిజం, వాయిస్ మాడ్యులేషన్ తో సినిమాకి మరో లెవెల్ తీసుకెళ్తారని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇక 'ముఫాస' సినిమాకు మహేష్ బాబు వాయిస్ అందిస్తే, తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం మరింత చేరువ అవుతుందని, పిల్లలు, పెద్దలు అన్నీ విభాగాల వారు కూడా ఈ చిత్రాన్ని మరింత ఆసక్తిగా చూసే అవకాశం ఉంటుందని, డిస్నీ భావిస్తోంది. ముఖ్యంగా డిస్నీ సంస్థ ఈ యానిమేషన్ చిత్రాలను తెలుగు మార్కెట్ లో ప్రమోట్ చేయడంలో మంచి విజయాలు సాధిస్తోంది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు వంటి స్టార్ ను తీసుకోవడం, ప్రేక్షకులకు మరింత చేరువ కావడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈ డిసెంబర్‌లో 'ముఫాస' విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగులో ఈ సినిమాను విడుదల చేస్తున్న నిర్మాతలు, మహేష్ బాబును భాగం చేసుకుంటే, సినిమా పాపులారిటీ మరింతగా పెరుగుతుందని భావిస్తున్నారు. మరి, మహేష్ ఈ సినిమాకు వాయిస్ ఓవర్ చెప్తారా? లేదంటే ఈ వార్తలు కేవలం ఊహాగానాలేనా అన్నది త్వరలోనే తెలిసిపోనుంది. గతంలో లయన్ కింగ్ సినిమాకు నాని వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే.