మహేష్- నాగార్జున మల్టీస్టారర్?
కానీ అది ఇప్పటికీ సాధ్యం కాలేదు. కానీ కింగ్ యువహీరోలతో కలిసి పని చేసేందుకు ఎప్పుడూ ఆసక్తిగా ఉన్నారు.
By: Tupaki Desk | 14 Jan 2024 4:10 AM GMTఅమితాబ్ బచ్చన్ - నాగార్జున మల్టీస్టారర్ దశాబ్ధాల క్రితమే వచ్చి అభిమానులను ఆకట్టుకుంది. ఇందులో శ్రీదేవి కథానాయికగా నటించారు. నేటితరం హీరోలతోను నాగ్ మల్టీస్టారర్లు చేస్తున్నారు. నాగార్జున-నాగచైతన్య- అఖిల్ మల్టీస్టారర్, నాగార్జున- నాని మల్టీస్టారర్ లను ఇప్పటికే థియేటర్లలో వీక్షించాం.
ఇంతకుముందు చిరు-వెంకీ-నాగార్జున మల్టీస్టారర్ గురించి ఆసక్తికర చర్చ సాగింది. కానీ అది ఇప్పటికీ సాధ్యం కాలేదు. కానీ కింగ్ యువహీరోలతో కలిసి పని చేసేందుకు ఎప్పుడూ ఆసక్తిగా ఉన్నారు. నాగార్జున- అల్లరి నరేష్- రాజ్ తరుణ్ మల్టీస్టారర్ `నా సామి రంగ` ఈ సంక్రాంతి కానుకగా భోగిరోజు (జనవరి 14)న విడుదలైంది. ప్రస్తుతం నా సామి రంగ ప్రచారంలో కింగ్ అండ్ టీమ్ బిజీ బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా నాగార్జున మీడియాతో సినిమా గురించిన విశేషాలను పంచుకున్నారు. ఆసక్తికరంగా ఈ ఇంటర్వ్యూలో నాగార్జున, మహేష్ బాబుతో కలిసి ఒక చిత్రానికి పని చేస్తారా? అన్న చర్చా సాగింది. లెజెండరీ నటులు ఏఎన్నార్ - కృష్ణల వారసత్వాన్ని కొనసాగించాలనే కోరికను నాగార్జున వ్యక్తం చేశారు.
నాగార్జున స్పందిస్తూ మహేష్- ఎస్ఎస్ రాజమౌళితో సినిమాను పూర్తి చేసిన తర్వాత మాత్రమే అలాంటి అవకాశం ఉంటుందని నాగార్జున హాస్యభరితంగా వ్యాఖ్యానించారు. నాగార్జున మహేష్ బాబుతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని వ్యక్తం చేసారు. అయితే అతను రాజమౌళి చిత్రాన్ని పూర్తి చేయడానికి కనీసం మూడు సంవత్సరాలు పట్టవచ్చు. అది ఈ ఏడాది చివరిలో ప్రారంభమవుతుంది.
తమిళ హీరోలతో కింగ్:
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్ర చిత్రంలో నాగార్జున అతిథి పాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. తదుపరి తమిళ హీరోలతోను నాగ్ కలిసి పని చేస్తున్నారు. ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలోను నాగార్జున నటించనున్నారు. తాజా సమాచారం మేరకు.. షూటింగ్‌ను త్వరలో ప్రారంభించనున్నారు. ధనుష్‌తో కలిసి నటించే చిత్రాన్ని ఈ నెల 25న ప్రారంభిస్తానని నాగ్ స్వయంగా ప్రకటించారు. ధనుష్ చిత్రంలో నాగార్జున పాత్ర ఎలా ఉంటుంది? అన్నదానిపై స్పష్ఠత రావాల్సి ఉంది.