Begin typing your search above and press return to search.

రాయలసీమ కోసం సినీ ఇండస్ట్రీ ఏం చేసింది?, అక్కడ మినీ స్టూడియో కడితే తప్పేంటి?

రాయలసీమ ప్రాంతంలో మినీ స్టూడియో కడితే తప్పేంటని ప్రశ్నించారు మహి రాఘవ్

By:  Tupaki Desk   |   12 Feb 2024 12:32 PM GMT
రాయలసీమ కోసం సినీ ఇండస్ట్రీ ఏం చేసింది?, అక్కడ మినీ స్టూడియో కడితే తప్పేంటి?
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బయోపిక్ గా తెరకెక్కిన చిత్రం 'యాత్ర 2'. 2009 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారంగా రూపొందిన యాత్ర' సినిమాకి సీక్వెల్. దీనికి మ‌హి.వి.రాఘ‌వ్ దర్శకత్వం వహించారు. ఇటీవలే థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. పాజిటివ్ టాక్ తో నడుస్తోంది. అయితే ఏపీ ప్రభుత్వం నుంచి లబ్ధిపొందిన కారణంగానే దర్శకుడు ఈ సినిమాని రూపొందించారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇందుకుగాను మ‌ద‌న‌ప‌ల్లిలోని హ‌ర్సిలీ హిల్స్‌లో స్టూడియో నిర్మాణం కోసం మ‌హి రాఘ‌వ్‌కి రెండెక‌రాలు భూమి ఇచ్చిందంటూ మీడియాలో కథనాలు వ‌చ్చాయి. దీనిపై తాజాగా దర్శకుడు స్పందించారు.

రాయలసీమ ప్రాంతంలో మినీ స్టూడియో కడితే తప్పేంటని ప్రశ్నించారు మహి రాఘవ్. తానేమీ స్టూడియో నిర్మాణం కోసం యాబై, వంద ఎక‌రాలు అడ‌గ‌లేదని, కేవ‌లం రెండు ఎక‌రాలు మాత్రమే అడిగానన్నారు. అయినా సినీ ప‌రిశ్ర‌మ‌లో రాయ‌ల‌సీమ ప్రాంతానికి పెద్ద‌గా ప్రాధాన్యం ఉండ‌దని, అక్క‌డ షూటింగ్స్ చేయ‌టానికి ఎవ‌రూ ఆస‌క్తి చూపించ‌రని అన్నారు. అందుకే తాను పుట్టి పెరిగిన ప్రాంతానికి తన వంతుగా ఏదైనా చేయాల‌నే ఉద్దేశ్యంతోనే ఈ స్టూడియో కట్టాలని భావించినట్లు తెలిపారు. నిజంగానే రాయలసీమ ప్రాంతానికి ఏదో చేయాల‌నే ఆశ లేక‌పోతే, హైద‌రాబాద్‌లోనో, వైజాగ్‌లోనో స్టూడియో క‌ట్టుకోవటానికి స్థ‌లం కావాల‌ని అడుగుతాను కానీ, వెనుక‌బ‌డిన ప్రాంతంగా చూసే మ‌ద‌న‌ప‌ల్లిలో ఎందుకు స్టూడియో కట్టాలనుకుంటాను? అని ప్రశ్నించారు.

మహి వి.రాఘవ్ మాట్లాడుతూ.. ‘‘నేను 2008లో సినీ పరిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టాను. రచయిత, నిర్మాత, దర్శకుడిగా ఇండ‌స్ట్రీలో 16 ఏళ్లుగా ఉంటున్నాను. మూన్ వాట‌ర్ పిక్చర్స్, 3 ఆట‌మ్ లీవ్స్ అనే రెండు నిర్మాణ సంస్థ‌ల‌ను స్థాపించాను. నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా అంద‌రికీ సుప‌రిచితుడినే. విలేజ్‌లో వినాయ‌కుడు, కుదిరితే క‌ప్పు కాఫీ, పాఠ‌శాల‌, ఆనందో బ్ర‌హ్మ‌, యాత్ర‌, సిద్ధా లోకం ఎలా ఉంది, యాత్ర-2 సినిమాల‌ను రూపొందించాను. అలాగే సేవ్ ది టైగ‌ర్స్‌, సైతాన్ అనే వెబ్ సిరీస్‌ల‌ను రూపొందించాను." అని అన్నారు.

"నేను రాయ‌ల‌సీమ ప్రాంతంలోని మ‌ద‌న‌ప‌ల్లిలోనే పుట్టి పెరిగాను.. అక్క‌డే చ‌దివాను. సినీ ప‌రిశ్ర‌మ‌లో రాయ‌ల‌సీమ ప్రాంతానికి పెద్ద‌గా ప్రాధాన్యం ఉండ‌దు. అంటే అక్క‌డ షూటింగ్స్ చేయ‌టానికి ఎవ‌రూ ఆస‌క్తి చూపించ‌రు. నా ప్రాజెక్ట్స్‌లో ఆనందో బ్ర‌హ్మ‌, సేవ్ ది టైగ‌ర్స్ అనే వెబ్ సిరీస్‌లను రాయలసీమలో తెరకెక్కించలేదు. పాఠ‌శాల‌, యాత్ర 2, సిద్ధా లోక‌మెలా ఉంది, సైతాన్ వెబ్ సిరీస్ రాయ‌ల‌సీమ‌లోనే చిత్రీక‌రించాను. మ‌రీ ముఖ్యంగా ఈ రెండేళ్లలో సైతాన్, యాత్ర 2, సిద్ధాలోకం అనే మూడు ప్రాజెక్ట్స్‌ను మ‌ద‌న‌ప‌ల్లి, క‌డ‌ప ప్రాంతాల్లో రూపొందించాం."

"మూడు ప్రాజెక్ట్స్‌కి దాదాపు రూ.20 నుంచి 25 కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేశాను. అందుకు కార‌ణం నేను పుట్టి పెరిగిన ప్రాంతానికి నా వంతుగా ఏదో చేయాల‌నే ఉద్దేశమే. అందుకోసమే నేను సంపాదించిన డ‌బ్బుని అక్క‌డ ఖ‌ర్చు పెట్టాను. అక్క‌డ సినిమాలు చేయ‌టం వ‌ల్ల లాడ్జీలు, హోటల్స్‌, భోజ‌నాలు, జూనియ‌ర్స్ ఇలా పలు రకాలుగా స్థానికులు ఉపయోగం ఉంటుందని భావించాను. ఈ జ‌ర్నీలో నేను వీట‌న్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాయ‌ల‌సీమ‌లో మినీ స్టూడియో నిర్మించాల‌నుకున్నాను. అందువ‌ల్ల లోక‌ల్ జ‌నాల‌కు ఉప‌యోగంగా ఉంటుందని ఆలోచించాను"

"బుద్ధి ఉన్నోడెవ‌డైనా దీన్ని ఆలోచించాలి. నేనేమీ స్టూడియో నిర్మాణం కోసం యాబై, వంద ఎక‌రాలు అడ‌గ‌లేదు. నేను కేవ‌లం రెండు ఎక‌రాల్లో మాత్రమే మినీ స్టూడియో నిర్మించాల‌నుకున్నాను. దాని వ‌ల్ల అక్క‌డెవ‌రైనా షూటింగ్స్ చేసుకోవాల‌నుకుంటే అంద‌రికీ ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. అందరికీ ప్రాథమిక సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. అందులో త‌ప్పేముంది.. చేయ‌నివారు ఎలాగూ చేయ‌రు. ఇన్నేళ్లు ఇండ‌స్ట్రీ ఉంటుంది క‌దా, రాయ‌ల‌సీమ‌కు ఎవ‌డైనా ఏమైనా చేశారా?. ఎవ‌రూ ఏమీ చేయ‌లేదు. మీరు చేయ‌రు... చేసేవాడిని చెయ్య‌నియ్య‌రు"

"ఓ వర్గం మీడియా దీని గురించి కాస్త కూడా ఆలోచించ‌లేదు. వాళ్ల‌కి ప్రియ‌మైన ప్ర‌భుత్వం ఎవ‌రెవ‌రికీ భూముల‌ను ఎక్క‌డెక్క‌డిచ్చింది?. వాళ్ల‌కు న‌చ్చిన‌వాళ్ల‌కు, ఇష్ట‌మైన వాళ్ల‌కు భూముల‌ను ఇచ్చుకుంది. వీటి గురించి ఎవ‌రూ మాట్లాడ‌రు. నేను నా ప్రాంతంలో కేవ‌లం రెండు ఎకరాల్లో, అక్క‌డి ప్ర‌జల‌కు ఉప‌యోగ‌ప‌డే ఉద్దేశంతో మినీ స్టూడియో క‌ట్టాలని అనుకుంటే మాత్రం రాద్ధాంతం చేస్తున్నారు’’ అని మహి రాఘవ్ అన్నారు.