Begin typing your search above and press return to search.

చేతులెత్తేసిన నిర్మాత‌.. చివ‌రికి ట్విస్టేమంటే?

ఇటీవ‌ల ఆయ‌న సౌత్ లోను హ‌వా చాటుతున్నారు. పింక్ త‌మిళ రీమేక్ స‌హా తెలుగు రీమేక్ (వ‌కీల్ సాబ్)లతో బోనీ పేరు ఇక్క‌డా మార్మోగింది

By:  Tupaki Desk   |   22 Jan 2024 4:52 AM GMT
చేతులెత్తేసిన నిర్మాత‌.. చివ‌రికి ట్విస్టేమంటే?
X

భారీ బ‌డ్జెట్ల‌తో సాహ‌సాలు చేయ‌డానికి కొంద‌రు నిర్మాత‌లు వెన‌కాడ‌రు. కంటెంట్ పై గురి కుదిరితే త‌న త‌న హీరో దర్శ‌కుల కోసం ఎంత ఖ‌ర్చు చేసేందుకైనా రాజీకి రారు. అలాంటి నిర్మాత‌ల్లో ఒక‌రిగా బోనీక‌పూర్ బాలీవుడ్ లో పాపుల‌ర‌య్యారు. దశాబ్ధాల కాలంగా ఆయ‌న హిందీ సినీప‌రిశ్ర‌మ‌లో ఒక భాగం. త‌న సోద‌రుడు అనీల్ క‌పూర్, భార్య, ప్ర‌ముఖ న‌టి శ్రీ‌దేవి స‌హా ప‌రిశ్ర‌మ దిగ్గ‌జ హీరోల సినిమాల్ని బోనీక‌పూర్ నిర్మించారు.

ఇటీవ‌ల ఆయ‌న సౌత్ లోను హ‌వా చాటుతున్నారు. పింక్ త‌మిళ రీమేక్ స‌హా తెలుగు రీమేక్ (వ‌కీల్ సాబ్)లతో బోనీ పేరు ఇక్క‌డా మార్మోగింది. రెండు చోట్లా నిర్మాత‌గా ఘ‌న‌మైన ఆరంగేట్రాన్ని బోని చాటుకున్నాడు. త‌దుప‌రి త‌న కుమార్తె జాన్వీ క‌పూర్ ని టాలీవుడ్ కి ప‌రిచ‌యం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. జాన్వీ దేవ‌ర చిత్రంతో తెలుగులో ప్ర‌వేశిస్తోంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర‌హీరో స‌ర‌స‌న జాన్వీ ఆరంగేట్రం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

బోనీ ప్లానింగ్, స‌క్సెస్ రేటు దృష్ట్యా అత‌డిని విమ‌ర్శించే సాహ‌సం ఎవ‌రూ చేయ‌రు. కానీ ఇటీవ‌ల ఆయ‌న తెర‌కెక్కిస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా -మైదాన్ చిత్రీక‌ర‌ణ ఆగిపోయింద‌ని, బ‌డ్జెట్లు లేక బోని చేతులెత్తాసార‌ని ప్ర‌చారం సాగింది. హిందీ మీడియాలో దీనిపై ఇబ్బ‌డి ముబ్బ‌డిగా క‌థ‌నాలు వైర‌ల్ అయిపోయాయి. అయితే చేతులెత్తేసిన నిర్మాత అని ప్ర‌చారం చేసిన వారికి బోనీ క‌పూర్ ఇప్పుడు త‌న‌దైన శైలిలో ప్రాక్టిక‌ల్ గా కౌంట‌ర్ వేస్తున్నాడు.

అజయ్ దేవగన్ స్పోర్ట్స్ డ్రామా-మైదాన్ ఎట్టకేలకు EID 2024న థియేట‌ర్ల‌లోకి వస్తుంది అని ప్ర‌క‌టించాడు. బధాయి హో ఫేమ్ అమిత్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నాలుగు సంవత్సరాలుగా థియేటర్లలో విడుదల కోసం వేచి చూస్తోంది. బోనీ దీనికోసం భారీ పెట్టుబ‌డుల్ని పెట్టారు. ఇప్పటి వరకు అజయ్ దేవగన్ చేసిన సినిమాల్లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో ఒకటిగా ప్ర‌చారంలో ఉన్న 'మైదాన్' కోసం బోనీ రాజీ అన్న‌ది లేకుండా ఖ‌ర్చు చేసార‌ని టాక్ వినిపిస్తోంది. క్రీడాకారుడిగా ఎన్నో రికార్డులను సృష్టించిన ఒక ప్ర‌ముఖ భార‌తీయ రియ‌ల్ హీరో నిజమైన కథను తెర‌పై చూపించ‌నున్నారు.

భారతీయ ఫుట్‌బాల్ స్వర్ణయుగంపై సినిమా ఇది. ఫుట్ బాల్ ఆట‌గాడు, కోచ్ అబ్ధుల్ ర‌హీమ్ జీవిత‌ క‌థతో తెర‌కెక్కింది. ఈ చిత్రంలో దేవగన్ సయ్యద్ అబ్దుల్ రహీమ్‌గా కనిపిస్తాడు. అతడు 1950 నుండి 1963లో మరణించే వరకు భారత ఫుట్‌బాల్ జట్టుకు కోచ్ గా మేనేజర్‌గా పనిచేశాడు. భార‌తీయ ఫుట్ బాల్ స్వ‌రూపాన్ని మార్చేసిన గొప్ప కోచ్ గా పాపుల‌ర‌య్యారు స‌య్య‌ద్.

నిజానికి COVID-19 మహమ్మారి కారణంగా స్పోర్ట్స్ డ్రామా చాలాసార్లు వాయిదా పడింది. ఈ చిత్రంలో ప్రియమణి, గజరాజ్ రావు, బెంగాలీ నటుడు రుద్రనీల్ ఘోష్ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ బోనీ కపూర్ సమర్ప‌ణ‌లో నిర్మించింది. కపూర్ ఆకాష్ చావ్లా- అరుణవ జాయ్ సేన్‌గుప్తా స‌హ‌నిర్మాత‌లు. విరాసత్, నో ఎంట్రీ, వాలిమై, వాంటెడ్, పుకార్, జుదాయి, మిస్టర్ ఇండియా వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాలను బోని నిర్మించారు. రణబీర్ కపూర్ -శ్రద్ధా కపూర్‌లతో కలిసి లవ్ రంజన్ చిత్రం తూ ఝూతి మైన్ మక్కార్ తో బోని న‌టుడిగాను మారారు.